Pawan Kalyan , Pithapuram Varma
Pawan Kalyan : ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్( Pawan Kalyan) కోసం పోటీ నుంచి తప్పుకున్నారు పిఠాపురం వర్మ. గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి గట్టిగానే పోరాడారు. ఈ ఎన్నికల్లో వర్మ గెలుపు తప్పదని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన కోసం పోటీ నుంచి తప్పుకొని సీటు త్యాగం చేశారు వర్మ. పవన్ గెలుపు తో పాటు అత్యధిక మెజారిటీ తెప్పించేందుకు కృషి చేశారు. అటువంటి వర్మకు గుర్తింపు దక్కకపోవడంతో ఆయనలో అసంతృప్తి రోజురోజుకు పెరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆశ కల్పించారు. అది నెరవేరక పోవడంతో వర్మలో ఒక రకమైన అసహనం పెరుగుతోంది. అదే సమయంలో జనసేన క్యాడర్ తనను దూరం పెట్టడాన్ని సహించలేకపోతున్నారు వర్మ. ఈ తరుణంలో వర్మ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
* మంచి పట్టున్న నేత
వాస్తవానికి పిఠాపురం( Pithapuram) నియోజకవర్గంలో వర్మకు మంచి పట్టు ఉంది. 2014 ఎన్నికల్లో సైతం తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కలేదు ఆయనకు. దీంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు వర్మ. త్రిముఖ పోటీలో సైతం రెండు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులకు కాదని.. ఇండిపెండెంట్ గా బరిలో దిగిన వర్మకు అక్కడి ప్రజలు పట్టం కట్టారు. ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వర్మను టిడిపిలో చేర్చుకున్నారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో టిడిపి టికెట్ ఆయనకి ఇచ్చారు. కానీ జగన్ ప్రభంజనంలో ఓడిపోయారు వర్మ. అయినా సరే గత ఐదేళ్లలో పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ పూర్వ వైభవానికి కృషి చేశారు. ఈ ఎన్నికల్లో వర్మ టిడిపి అభ్యర్థిగా తప్పకుండా గెలుస్తారన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. సరిగ్గా అటువంటి సమయంలోనే ఎంట్రీ ఇచ్చి పవన్ కళ్యాణ్ వర్మ ఆశలపై నీళ్లు చల్లారు.
* ఆ హామీ అమలు కాకపోవడంతోనే
అయితే ఎన్నికల నుంచి తప్పుకొని పవన్ కళ్యాణ్( Pawan Kalyan) విజయానికి కృషి చేస్తే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు పవన్ కళ్యాణ్ సైతం వర్మ విషయంలో సానుకూలంగా ఉండేవారు. దీంతో కూటమి వచ్చిన తరువాత వర్మ కు తప్పకుండా పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ నామినేటెడ్ పోస్టుల భర్తీ దాదాపు పూర్తయింది. ఎమ్మెల్సీల నియామకం కూడా జరిగిపోయింది. అయితే వర్మ పేరు పరిగణలోకి తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆయనలో ఒక రకమైన అసహనం పెరుగుతోంది. పైగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన క్యాడర్ వర్మను లెక్కచేయడం లేదు. ఈ పరిణామాల క్రమంలో వర్మ ఓ వీడియో పోస్ట్ చేయడంతో అంత వైరల్ అయింది. అసంతృప్తితో పవన్ ప్రసక్తి లేకుండా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. కష్టపడి సాధించే విజయానికే గౌరవం అంటూ వర్మ తన ఎక్స్ హేండిల్ లో పోస్ట్ పెట్టారు. ఇందులో ఓ వీడియోను కూడా జత చేశారు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా తాను చేసిన ప్రచార వీడియోలను అందులో జత చేశారు.
* జనసైనికుల ఆగ్రహం
అయితే ఈ వీడియో వైరల్ ( video viral)కావడంతో వర్మ తీరుపై జన సైనికులు మండిపడ్డారు. తమ నాయకుడిని ఉద్దేశించి వర్మ ట్వీట్ పెట్టారని ఆరోపిస్తూ ఆయనపై సోషల్ మీడియాలో దాడికి దిగినంత ప్రయత్నం చేశారు. దీంతో అలర్ట్ అయ్యారు వర్మ. ఆ పోస్టును డిలీట్ చేశారు. అంతేకాదు ఈ ట్వీట్ తో తనకు సంబంధం లేదంటూ వరుస ట్వీట్లు పెట్టారు. ఈ ట్వీట్ తన సోషల్ మీడియా వ్యవహారాలు చూస్తే హైదరాబాద్ టీమ్ నుంచి వచ్చిందంటూ తేల్చేశారు. అయితే గత కొద్ది రోజులుగా వర్మ తీవ్ర అసహనంతో ఉన్నారని.. అనుచరుల వద్ద బాహటంగానే తన ఆవేదన వ్యక్తపరిచారని.. ఆయనే ఈ ట్వీట్ చేశారంటూ జన సైనికులు ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే తాను చెప్పదలచుకున్నది చెప్పి.. తాను ఆ పోస్టును డిలీట్ చేశారని అనుమానాలు కూడా ఉన్నాయి. మరి ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలి.