Atal Bihari Vajpayee: అటల్ బిహారీ వాజ్‌పేయి.. రాజనీతిజ్ఞడు.. నిజాయతీ ఉన్న రాజకీయ నేత. తమిళ ప్రజలు పురచ్చితలైవిగా కొలిచే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా మెచ్చిన నాయకుడు. అయితే, 1999లో వాజ్‌పేయి ప్రభుత్వం కూలిపోవడానికి జయలలితనే కారణమయ్యారు. ఒక్క ఓటుతో ఎన్డీఏ సర్కార్‌ను కూలదోశారు.
సుబ్రమణ్యస్వామి మాటలు విని..
అప్పటి మిత్రుడు, జనతా పార్టీ నేత సుబ్రమణ్యస్వామి మాటలు విని జయలలిత నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చేతులు కలిపారు. వాజ్‌పేయి ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యస్వామి ఆమెకు బద్ధ శత్రువుగా మారారు. ఇక తనకు ఎంతో ఇష్టమైన రాజకీయనేత వాజ్‌పేయి ప్రభుత్వాన్ని కూల్చినందుకు జయలలిత చాలాసార్లు బాధపడ్డారు.
182 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు..
1998 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 182 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇతర పార్టీల సహాయంతో వాజ్‌పేయ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఏడాదిన్నరపాటు ప్రభుత్వం సాఫీగా సాగింది. నాటి ప్రభుత్వానికి ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత కూడా మద్దతు ఇచ్చారు. కానీ, తర్వాతి పరిణామాలతో మద్దతు ఉపసంహరించుకున్నారు. అయితే ఆసమయంలో వాజ్‌పేయ్ ప్రభుత్వానికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా చివరకు హ్యాండ్ ఇచ్చారు. దీంతో బల నిరూపణకు వాజ్‌పేయి సర్కార్‌కు ఒక్క సీటు తక్కువైంది. దీంతో ప్రభుత్వం కూలిపోయింది. కానీ 1999లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంపూర్ణ మెజారిటీ సాధించింది. దీంతో మరోమారు వాజ్‌పేయి ప్రధాని అయి.. ఐదేళ్లు పాలన సాగించారు.