Kolkata High Court: పశ్చిమ బెంగాల్‌లో 26 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలపై కోల్‌కత్తా హైకోర్టు సోమవారం(ఏప్రిల్ 22న) సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో 2016లో నియామకమైన 26 వేల మంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోనున్నారు. 2016లో జరిగిన టీచర్ల రిక్రూర్‌మెంట్ టెస్టును హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఆ పరీక్ష ద్వారా జరిపిన నియామకాలు తక్షణం రద్దు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ పరీక్ష ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ఇన్నేళ్లు తీసుకున్న వేతనాలను వడ్డీతో సహా రికవరీ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ఏం జరిగిందంటే..
పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులతోపాటు గ్రూప్–సీ, గ్రూప్–డి సిబ్బంది నియామకానికి బెంగాల్ ప్రభుత్వం 2016లో స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ నిర్వహించింది. దీనిద్వారా 24,650 ఖాళీల భర్తీ కోసం ఈ పరీక్షను నిర్వహించారు. 23 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. అనంతరం ఎంపిక ప్రక్రియ చేపట్టి ప్రభుత్వం 25,753 మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చింది.
అక్రమాలు జరిగాయని ఫిర్యాదు..
ఈ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. పలువురు దీనిపై విచారణ జరపాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్లను విచారణకు స్వీకరించిన ఆ రాష్ట్ర హైకోర్టు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక డివిజన్ బెంచ్ ఏర్పాటు చేసింది. సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం 2016 నాటి టీచర్ల నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని నిర్ధారించింది. ఆ నియామకాలు చెల్లవని తీర్పు చెప్పింది. ఇప్పటి వరకు ఉపాధ్యాయుల అందుకున్న వేతనాలు 4 వారాల్లో చెల్లించాలని పేర్కొంది. వేతనాల వసూలు బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. ఈ నగదుకు 4 శాతం వడ్డీ కూడా వసూలు చేయాలని సూచించింది.
కొత్త నియామకాలు చేపట్టాలని సూచన..
2016 నియామకం రద్దు చేసిన నేపథ్యంలో కొత్త నియామక ప్రక్రియ ప్రారంభించాలని పశ్చిమ బెంగాల్ స్కూల్ కమిషన్‌కు సూచించింది. ఈ వ్యవహారంపై మరింత సమగ్ర విచారణ జరిపి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. ఇదిలా ఉండగా, ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న మాజీ విద్యాశాఖ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పార్థా చటర్జీని ఈడీ ఇదివరకే అరెస్టు చేసింది.