Anil Kumar Yadav: అనిల్ కుమార్ యాదవ్ …ఏపీలో పరిచయం అక్కర్లేని పేరు. వైసీపీ ఫైర్ బ్రాండ్. చిన్నవయసులోనే అమాత్య పదవి పొంది రికార్డు నెలకొల్పిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇటీవల సైలెంట్ అయ్యారు. మంత్రి పదవి ఊడిపోయేసరికి నేలపైకి వచ్చారు. మూడేళ్ల పాటు నిర్వహించింది నీటిపారదుల శాఖే అయినా.. నోరుపారేసుకున్న మంత్రిగానూ పేరు గడించారు. ఎంతోకాలం రాజకీయాల్లో ఉంటే కానీ సాధ్యంకాని విషయాలన్నీ అనిల్ చాలా చిన్న వయసులోనే సాధించేశారు. అలాగే అంతే వేగంగా ఒంటరిగానూ మిగిలిపోతున్నారు. అనిల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో నెల్లూరులో ఆనంవారికి అనుచరుడిగా ఉండేవారు. ఆకుటుంబమే అనిల్‌ను అన్నివిధాలా ప్రోత్సహించింది. పైగా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కూడా ఇప్పించింది.

కానీ పోలింగ్ తేదీ దగ్గరపడినవేళ ఉన్నట్టుండి అనిల్ ఆనం కుటుంబంతో గొడవకు దిగారు. ఇంకేముంది రాత్రికి రాత్రి రాజకీయం మారింది. ఆ ఎన్నికల్లో అనిల్‌కు ఓటమే మిగిలింది. ఇక అప్పటి నుంచి అనిల్ ఆనం కుటుంబానికి దూరమయ్యారు. తరువాత వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో ఏపని అడిగినా.. మనం అధికారంలో లేం… అధికారంలోకి వస్తే మీరడగినవన్నీ చిటికెలో చేసేస్తాననేవారు. జనం కూడా నిజమేనని నమ్మారు.
Also Read: Minister KTR: గ్యాంగ్ రేప్ పై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సీన్ కట్ చేస్తే 2019లో మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. చావుతప్పి కన్నులొట్టబోయిన చందాన బొటాబొటీ మెజారిటీతో గెలుపొందారు. జగన్ కేబినెట్ లో కీలకమైన నీటిపారుదల శాఖామంత్రి అయ్యారు. దీంతో నెల్లూరీయులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇక జిల్లాలో నీటి ప్రాజెక్డ్ లన్నీ పరుగులు పెడతాయనుకున్నారు. అనిల్ కూడా ఇంటా బయటా ప్రతిపక్షాలని బండ బూతులు తిడుతూ తొడలు, జబ్బలు చరుస్తుంటే… ఇక మాకు దిగులే లేదని… అనిల్ అంతటి నాయకుడే లేడని, ఇక రాడని సంబరపడ్డారు.అయితే పదవీ కాలం పూర్తికళ్లు మూసి కళ్లు తెరిచేలోపే… అనిల్ మూడేళ్ల మంత్రి పదవీ కాలం పూర్తయింది. నెల్లూరు, సంగం బ్యారేజీల్లో మిగిలిన పది శాతం పనులను కూడా ఆయన తనహయాంలో చేయించలేకపోయారు. వరసగా రెండేళ్లు వచ్చిన వరదలకి సోమశిల డ్యాం దెబ్బతింది. కేంద్ర బృందాలు పలుమార్లు పరిశీలించి, వెంటనే మరమ్మతులు చేయాలని సూచించినా… ఈ రోజుకీ అవి చేసే దిక్కులేకుండా పోయింది. టీడీపీ ప్రభుత్వంలో పూర్తైన సుమారు 5వేల ఇళ్లని ఇప్పటికీ లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఆ సమీపంలోనే జగనన్న ఇళ్ల స్థలాలు ఇస్తే… అక్కడ ఇల్లు కట్టాలంటేనే జనం జడుసుకుంటున్నారు.

నెల్లూరు గరంలో కాలువకట్టలమీద ఇళ్లు నిర్మించుకున్నవారికి పట్టాలిస్తామని హామీ ఇచ్చి, తరువాత ఇరిగేషన్ స్థలాల్లో పట్టాలు ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పారు. కిందటి ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి నారాయణ కోట్లాది రూపాయలతో నగరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆ పెండింగ్ పనులను అనిల్ పూర్తిచేయలేకపోయారు. రూ.700కోట్లతో అభివృద్ధి చేశామని అనిల్ చెప్పుకుంటారే కానీ.. ఆ అభివృద్ధి ఎక్కడ జరిగిందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇలా ఒక్కటంటే ఒక్క హామీని కూడా అనిల్ నెరవేర్చలేకపోయారు.ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదని అర్ధమైపోయిందిట. దీంతో వెంకటగిరి నుంచి పోటీ చేయాలని భావించారుట. ఇదే విషయాన్ని సీఎం జగన్ కి పదేపదే చెప్పారట. అందుకే మంత్రి పదవి ఊడిందనే చర్చలు ఓ రేంజ్ లోనే సాగుతున్నాయి.వెంకటగిరి నుంచి అనిల్ పోటీచేయబోతున్నారని తెలియగానే…. స్థానికేతరలు మాకొద్దంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు వెల్లువెత్తాయి.దాంతో అనిల్ సైలెంట్ అయిపోయారు.
అటు మంత్రి పదవి పోవడమే కాక.. తనకు బద్ధ శత్రువైన కాకానికి అమాత్య పదవి లభించడంతో యాదవ్ కు మింగుడు పడడం లేదు. మరోవైపు మొన్నటిదాకా మా అనిల్ అన్న… మా అనిల్ అన్న… అంటూ ఓ రేంజ్ లో వీరాభిమానం చూపిన వారంతా అనిల్ కి దూరమవుతున్నారు. నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాధ్ మొదటి నుంచి అనిల్ వెంట ఉన్నారు. వైసీపీ అధిష్టానం నిర్ణయం మేరకు మంత్రి పదవి దక్కించుకున్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి పూలబొకే ఇచ్చారు. అంతే ముక్కాలని అనిల్ దూరం పెట్టేశారు. మంత్రికి బొకే ఇస్తే తప్పేంటి?… పార్టీ స్టాండ్ లో నడుచుకోవడమే తప్పా?… అంటూ ముక్కాల అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పైగా ఆయన వర్గీయులు, సామాజికవర్గం వారిపై వేధింపులు తీవ్రం కావడం నగరంలో ప్రధాన చర్చనీయాంశమైంది.ముక్కాల తనకి వెన్నుపోటు పొడిచాడని అనిల్ అనుచరులు… అనిల్ వెన్నుపోటు పొడిచాడని ముక్కాల అనుచరులు పరస్పరం ఆరోపించుకున్నారు . ఇలా అనిల్ కి అత్యంత సన్నిహితులు ఒక్కొక్కరిగా దూరమవుతున్నారు. ఇప్పుడు సరిగ్గా మైకు ముందు మాట్లాడేవారూ లేకపోవడంతో… అనిల్ అంతా తానై వ్యవహారిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో సీటీ నుంచి పోటీ చేసే పరిస్థితి లేకపోవడం… ఏ నియోజకవర్గ ప్రజలూ అనిల్ ని హర్షించకపోవడం… ముఖ్యులందరూ దూరమైపోతూ ఉండటంతో… ఆయన రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని అనుచరులు తలలుపట్టుకుంటున్నారు.ఇక అనిల్ భవితవ్యం ఏమిటనేది ఆ పైవాడికే ఎరుక!
Also Read: BJP- Pawan Kalyan: బీజేపీ, పవన్ కళ్యాణ్.. ఓ సీక్రెట్ భేటి
[…] Also Read: Anil Kumar Yadav: జాడలేని ఫైర్ బ్రాండ్ అనిల్ కుమ… […]