Chandrababu Naidu: కుప్పం నియోజకవర్గం చంద్రబాబుకు అచ్చొచ్చిన ప్రాంతం. 1989 నుంచి 2019 వరకు తిరుగులేని నేతగా అప్రతిహ విజయయాత్ర కొనసాగిస్తున్నారు. ఆయన మాటకు ఎదురుండదు. అందరు ఆయన అనుచరులే. దీంతో టీడీపీ కంచుకోటగా కుప్పం ఖ్యాతిగాంచింది. కానీ ఈ మధ్య ఆ కోటకు బీటలు వారుతున్నాయని తెలుస్తోంది. గత స్థానిక ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి ఎదురుగాలి వీచింది. వైసీపీ విజయం దక్కించుకుంది. దీంతో బాబు నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం పోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో పార్టీ ప్రక్షాళన దిశగా బాబు అడుగులు వేస్తున్నారు. మూడు రోజులు అక్కడే నేతలతో మాట్లాడారు. వారు వెల్లడించిన విషయాలపై దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలో వారు సూచించిన అంశాల్లో మనోహర్ ను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ వచ్చినా బాబు మాత్రం దానికి అంగీకరించలేదు. దీంతో కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొందని తెలుస్తోంది. అయినా పార్టీ వ్యవహారాలను చూసుకునే మనోహర్ ను పక్కన పెట్టడం కుదరదని చెప్పారు. దీంతో కార్యకర్తలు సంతృప్తి చెందలేదని చెబుతున్నారు.
ఇక్కడ వైసీపీ తన ప్రభావాన్ని చూపించుకోవాలని చూస్తోంది. చాలామంది టీడీపీ నేతలు వైసీపీ కండువాలు కప్పుకున్నారు. దీంతో కుప్పంలో టీడీపీ విజయం వెనుకబడిపోతోందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో చంద్రబాబు (Chandrababu Naidu) దిద్దుబాటు చర్యలు చేపట్టినా ప్రయోజనం ఉంటుందో లేదో అనే ఆలోచనలో పడిపోయారు.
ఈనెల 12 నుంచి 14 వరకు కుప్పంలో పర్యటించేందుకు బాబు నిర్ణయించుకున్నారు. కార్యకర్తల్లో ఉత్తేజం నింపడానికి తన పర్యటన తోడ్పడుతుందని భావిస్తున్నారు. పార్టీని విజయతీరాలకు చేర్చేలా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు. మరోసారి నేతలను పిలిచి తన మనసులో మాట చెప్పి వారిలో ధైర్యం నూరిపోసే పనిలో పడినట్లు తెలుస్తోంది.