Real Estate : భారత్ దేశంలో అత్యాధునిక ఎక్స్‌ప్రెస్ రోడ్లలో ఒకటిగా రీజినల్ రింగ్‌రోడ్డు (ట్రిపుల్‌ఆర్)ను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాలుగు లేన్లు, భవిష్యత్తులో ఎనిమిది లేన్లకు విస్తరణ, ఐదు మీటర్ల ఎత్తుతో ఎలివేటెడ్ కారిడార్‌ను తలపించే విధంగా నిర్మిస్తున్నారు. ఇంటర్ ఛేంజ్ కూడళ్లు, అండర్‌పాస్‌లు ఇలా మరెన్నో విశేషాలతో నిర్మిస్తున్నారు. దేశంలోనే తొలి భారీ రింగురోడ్డుగా హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్) రూపుదిద్దుకుంటుంది. ఈ రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) సంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట, మెదక్ జిల్లాలను కలుపుతుంది. ఈ రోడ్డు 340 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. దాదాపు రూ.7వేల కోట్లతో ఈ రోడ్డును నిర్మిస్తున్నారు.
త్రిపుల్ ఆర్ ను ఎనిమిది లేన్లతో డిజైన్ చేశారు. కానీ, ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు నాలుగు లేన్లు మాత్రమే సరిపోతాయని నిర్ణయించారు. భవిష్యత్‌లో భూములు ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉంటుందన్న కారణంతో మరో నాలుగు లేన్లకు సరిపడా భూమిని కూడా సేకరించి పెట్టనున్నారు. ఈ క్రమంలోనే రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాలిట వరంగా మారనుంది. వారిని సిటీ అవతల వైపు చూసేలా చేస్తోంది. త్రిపుల్ ఆర్ మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా పలు ప్రాంతాల్లో భవిష్యత్ లో వెంచర్లు వేసేందుకు అనుగుణంగా ఉన్న వందల ఎకరాల భూములను కొనేస్తున్నారు. కొందరు బేరసారాలు నడుపుతున్నారు. ఇప్పటికిప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు మొదలైనా అది పూర్తి కావడానికి కనీసంలో కనీసం పది నుంచి ఇరవై ఏళ్ల సమయం పడుతుంది. దీంతో ఇప్పుడు కొని పెట్టుకుంటే అప్పటి వరకు రేట్లు భారీగా పెరిగి ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఇప్పటికే నిర్మించిన ఓఆర్ఆర్ తో ఆ లాభాలను కళ్లారా చూశారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. అందుకే ముందస్తుగానే రీజనల్ రింగ్ రోడ్డును సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
రీజనల్ రింగ్ రోడ్డును మొత్తం 347 కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్లతో నేషనల్, స్టేట్ రోడ్లతో కనెక్ట్ అయ్యే విధంగా ఈ 12 ప్రాంతాల్లో భారీ జంక్షన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవల్లో నిర్మించబోయే ఈ భారీ ఇంటర్ ఛేంజర్స్‌తో పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ గ్రోత్‌కు అవకాశం పుష్కలంగా ఉంది. అందుకే ఈ ఇంటర్ ఛేంజర్స్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీగా భూములను కొనుగోలు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చుట్టూ రోడ్ ఫేసింగ్‌తో ఎకరం రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్లు పలుకుతున్నాయి. విజయవాడ హైదరాబాద్ హైవే.. ముంబై హైదరాబాద్ హైవేల వైపు ఉండే ఇంటర్ చేంజర్స్ దగ్గర ఏకంగా ఎకరం మూడు కోట్లు పలుకుతుంది. రోడ్డు నుంచి కాస్త లోపలికి పోతే ఎకరం కోటి రూపాయల నుంచి కోటీ 30 లక్షల వరకు పలుకుతుంది. ఆర్ఆర్ఆర్ పనులు షురూ అయితే మాత్రం ఈ ధరలు రెట్టింపు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.