
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడక ముందు చిన్నా చితకా కలిపి దాదాపు 30కు పైగా బ్యాంకులు ఉండేవి. ఎస్బీఐలోనే రాష్ట్రానికో శాఖ చొప్పున ఉండేది. ఆర్థిక సంస్కరణల పేరిట నష్టాల్లో ఉన్న బ్యాంకులను విలీనం చేసి ఇప్పుడు కేవలం దేశంలో 12 బ్యాంకులకు మాత్రమే పరిమితం చేశారు.
ఇప్పటికే బ్యాంకుల విలీనం చేసిన కేంద్రప్రభుత్వం.. ఇప్పుడు సహకార బ్యాంకులపై పడింది. సహకార బ్యాంకుల విలీనాన్ని సూచిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద ప్రకటన చేసింది. సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, డీసీసీబీలను రాష్ట్ర సహకార బ్యాంకులు, ఎస్టీసీబీలతో విలీనం చేయడాన్ని పరిశీలిస్తుందని ఆర్బీఐ తెలిపింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రతిపాదన చేశాయి. జిల్లా సహకార బ్యాంకులను రాష్ట్ర సహకార బ్యాంకులతో రెండోస్థాయి స్వల్పకాలిక సహకార రుణ నిర్మాణంగా విలీనం చేయాలని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్బీఐని సంప్రదించాయి.
దీనిపై అధ్యయనం నిర్వహించిన ఆర్బీఐ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జిల్లాసహకార బ్యాంకులను రాష్ట్ర సహకార బ్యాంకులతో విలీనం చేయాలని ప్రతిపాదించినప్పుడు బ్యాంకుల విలీనాన్ని ఆర్బీఐ పరిశీలిస్తుంది. నాబార్డ్ తో సంప్రదించి 2 దశల్లో రాష్ట్ర సహకార, జిల్లా సహకార బ్యాంకుల విలీనం ప్రతిపాదనను ఆర్బీఐ పరిశీలించి ఆమోదించనుంది.
ఇటీవల అనేక రాష్ట్రాల్లో పనిచేస్తున్న బ్యాంకులలో అవకతవకలు, ఆర్థిక మోసాలు వెలుగుచూశాయి. ఆర్బీఐ కూడా అనేక బ్యాంకులకు జరిమానా విధించి కఠిన చర్యలు తీసుకొని లైసెన్స్ రద్దు చేసింది. అందుకే ఆర్బీఐ లో విలీనం దిశగా ప్రక్రియ మొదలు పెట్టింది.