RBI report about Telangana : ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ మాగాణి బంగారమైందట! ఒక్క సాగు రంగమేనా..? ఐటీ, పరిశ్రమలు వంటి రంగాల్లోనూ అద్భుత ప్రగతి సాధించిందట!! రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్లలో భారీగా వృద్ధిరేటు పెరిగిపోయిందట!!! ఇవన్నీ చెప్పింది ఎవరో కాదు.. సాక్షాత్తూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా! మరి, ఆ రిపోర్టులో ఇంకా తెలంగాణ గురించి ఏం చెప్పిందో తెలుసుకోండి

నిజానికి.. ఏపీ నుంచి తెలంగాణ విడిపోతే భవిష్యత్ ఏంటి? ఎలా ఉంటుంది? అన్నదానిపై ఎవరికీ స్పష్టమైన అవగాహన లేదు. సముద్ర మట్టానికి ఎంతో ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో.. అప్పటి వరకూ నీటి వసతి కూడా సరిగా లేని ఈ నేల పరిస్థితి ఏం కానుంది? అనే ఆందోళన చాలా మందిలో ఉన్నది. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వంటివారు తెలంగాణ అంధకారమైపోతుందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. రాష్ట్రం కోరుకున్న వారిలోనూ ఓ వైపు ఆందోళన నెలకొంది. అయితే.. అనుమానాలను పటాపంచలు చేస్తూ.. తెలంగాణ అద్వితీయమైన ప్రగతి సాధించిందని ఆర్బీఐ గణాంకాలతో సహా వెల్లడించింది.
రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలో(2014-15).. 29,288 కోట్ల ఆదాయంతో ఉన్న తెలంగాణ.. ఇప్పుడు (2020-21లో) 85,300 కోట్లకు చేరిందట! రాష్ట్ర ఆవిర్భావం నుంచి గడిచిన ఏడేళ్లలో.. జీఎస్డీపీ ఏకంగా 117 శాతం పెరిగింది లెక్క గట్టింది. ఏయే రంగాల్లో వృద్ధి భారీగా పెరిగిందో కూడా వెల్లడించింది.
ఐటీతోపాటు ఐటీ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, ఔషధ రంగంతోపాటుగా.. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లోనూ అద్భుతమైన వృద్ధిరేటు నమోదు చేసిందని ఆర్బీఐ వెల్లడించింది. పన్నులతోపాటు.. పన్నేతర రాబడి సైతం భారీగా పెరిగిందని తెలిపింది. పై రంగాలన్నీ భారీగా వృద్ధి సాధించడంతో.. సర్కారు ఖజానాకు ఆదాయం గణనీయంగా పెరిగిందని వెల్లడించింది ఆర్బీఐ.
ఇంకా పక్కాగా చెప్పాలంటే.. 2014-15తో పోలిస్తే.. 2020-21 నాటికి పన్నేతర ఆదాయం ఏకంగా 474 శాతం పెరిగిందని, పన్నుల ఆదాయం కూడా 291 శాతం పెరిగిందని తెలిపింది. రాష్ట్రంలో రంగాలన్నీ గణనీయంగా వృద్ధి నమోదు చేయడంతో.. సర్కారు ఆదాయం కూడా భారీగా పెరిగింది. మొత్తంగా చూస్తే.. రాష్ట్రం ఏర్పాటైననాటి నుంచి.. ఇప్పటి వరకు మూడింతలకుపైగా వృద్ధి నమోదైందని ఆర్బీఐ లెక్కగట్టింది. పత్తి, వరి, పప్పుధాన్యాల ఉత్పత్తిలో దేశీయ సగటుకన్నా 3 నుంచి 4 రెట్లకుపైగా వృద్ధి నమోదైంది.
అయితే.. రాష్ట్రం అప్పులు కూడా మూడింతలు పెరిగాయి. పెరిగిన ఆదాయానికి అనుగుణంగా.. తెలంగాణ అప్పులు కూడా చేసింది. మార్చి 2021 నాటికి రూ.2,52,325 కోట్లకు అప్పులు చేరాయి. గడిచిన ఆరేళ్లలో రూ. లక్షా 80వేల కోట్ల వరకు అప్పులు చేసింది. కానీ.. పెరిగిన ఆదాయంతో పోలిస్తే ఈ అప్పు పెద్ద భారమేమీ కాదు. అప్పులతో పాలమూరు – రంగారెడ్డి, కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా.. అప్పుల ద్వారా ఆదాయాన్ని సృష్టించింది.