తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ జనసేన పార్టీల మధ్య అసాధారణ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు పార్టీల ఒప్పందం మేరకు బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ బరిలో దిగుతున్నారు. మాజీ ఐఏఎస్, కర్నాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈవిడను తిరుపతి బరిలో ఉంచాలని గురువారం రాత్రి హైకమాండ్ ప్రకటించింది. తనకు టికెట్ దక్కడంపై రత్నప్రభ స్పందించారు. కాగా.. ఆమె అభ్యర్థిత్వంపై పవన్ మౌనంగా ఉంటున్నారు. ఏపీ ప్రతిపక్ష స్థానంకోసం పోరాడుతున్న బీజేపీ.. పవన్ కల్యాణ్ తో పొత్తును కొనసాగిస్తూ.. బలపడేందుకు ప్రయత్నం చేస్తోంది.
Also Read: సీఐడీపై యుద్ధానికి టీడీపీ సిద్ధం..?
ఏపీలో తమ ఎదుగుదలకు తిరుపతి ఎన్నికలను గీటురాయిగా భావిస్తున్న బీజేపీ నేతలు అక్కడ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలనే దానిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేశారు. టికెట్ కోసం జనసేన నుంచి ఒత్తిడిరాగా.. పవన్ ను ఎలాగోలా ఒప్పించి.. రత్నప్రభకు టికెట్ ఖరారు చేశారు. రత్నప్రభ సొంత జిల్లా ప్రకాశం. ఆమె తండ్రి కత్తి చంద్రయ్య. సోదరుడు ప్రదీప్ చంద్ర. భర్త విద్యా సాగర్.. ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులు. కర్నాటక కేడర్ ఐఏఎస్ అధికారిణి అయిన రత్నప్రభ కర్నాటక సీఎస్ గా రిటైర్డు అయిన తరువాత వృత్తి నైపుణ్య అథారిటీ చైర్మన్ గా కొనసాగారు. గతంలో కొంతకాలం పాటు డిప్యూటేషన్ పై ఏపీ కేడర్ లోనూ పనిచేశారు. ఫైర్ బ్రాండ్ గా పేరున్న రత్నప్రభ అయితేనే వైసీపీని, సీఎం జగన్ ను ధీటుగా ఎదుర్కొంటారని కమలనాథులు ఆమెకు అవకాశం ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే రత్నప్రభ ప్రచారం ప్రారంభించారు.
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా తనను ఎంపిక చేయడంపై రత్నప్రభ అనూహ్యంగా స్పందించారు. పార్టీ హైకమాండ్ ప్రకటన చేసినప్పటి నుంచి రత్నప్రభ వరుస ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ‘ఆర్ఎస్ఎస్, బీజేపీ అధినాయకత్వం నిజంగా నాకు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇది కల కాదు కదా.. కాదు, నిజమే అని అర్థం చేసుకోడానికి కొంత సమయం పట్టింది. దైవశక్తి కొలువైన, అత్యంత పవిత్రమైన తిరుపతిలో ప్రజలకు సేవ చేసుకునే అవకాశం నాకు దక్కడం నిజంగా దైవ సకల్పం, విధిరాత గానే భావిస్తున్నాను. అకస్మాత్తుగా నా ముందు పెద్ద సవాలు నిలిచింది. నియోజకవర్గంలోని చిట్టచివరి ఓటరు హృదయాన్నీ చేరుకునే ప్రయత్నంలో ఆ భగవంతుడు నాకు బలాన్ని ఇస్తాడని నమ్ముతున్నా’ అని రత్నప్రభ వ్యాఖ్యానించారు.
Also Read: పవన్ రాకుంటే తిరుపతిలో బీజేపీకి కష్టమేనా..?
తిరుపతి ఉపఎన్నికలో ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ పేరు ఖరారైన వెంటనే ఏపీ బీజేపీ నేతలు వరుసగా ట్వీట్లు ప్రకటనలతో సందడి చేశారు. అయితే, వారి మిత్రుడైన పవన్ కల్యాణ్ గానీ ఆయన పార్టీ జనసేన గానీ రత్నప్రభ అభ్యర్థిత్వంపై స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. తిరుపతి టికెట్ ఆశించి భంగపడ్డ పవన్ కల్యాణ్ ఇటీవల బీజేపీ స్థానిక నేతలపై కోపంగా ఉండటం, బీజేపీ వల్ల నష్టపోయామని జనసేన అధికారికంగా విమర్శలు చేయడం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ.. పవన్ ను ట్యాగ్ చేస్తూ ధన్యవాదాలు చెప్పినా జనసేనాని స్పందించకపోవడం షాకింగ్ వ్యవహారంగా మారింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్