దేశ వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి అదే స్థాయిలో కోవిద్19 పై నకిలీ వార్తలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త , టాటా ట్రస్ట్ ఛైర్మన్ రతన్ టాటా ఈ ఫేక్ న్యూస్ బారిన పడ్డారు. దీంతో స్వయంగా ఆయనే ట్విటర్ ద్వారా నకిలీ వార్తపై స్పందించారు. దేశ ఆర్ధిక వ్యవస్థ గురించి తాను చెప్పినట్టు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తకు, తనకు సంబంధం లేదని రతన్ టాటా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు.
ఆ పోస్ట్ నేను రాయలేదు..చెప్పలేదు. వాట్సాప్ సహా ఇతర సోషల్ మీడియా వేదికలపై వైరల్ అవుతున్నవార్తల పట్ల నిజానిజాలు తెలుసుకోవాలని రతన్ టాటా కోరారు. ఏదైనా అంశంపై అభిప్రాయాన్ని చెప్పదల్చుకుంటే తానే అధికారికంగానే చెబుతానని వెల్లడించారు. నకిలీ వార్తలు, సమాచారం పట్ల అప్రమత్తంగా వుండాలని సూచించారు. అందరూ క్షేమంగా, జాగ్రత్తగా ఉండాలని రతన్ టాటా ఆకాంక్షించారు. కరోనా సంక్షోభ సమయంలో భారత ఆర్థికవ్యవస్థ ప్రభావంపై రతన్ టాటా వ్యాఖ్యల పేరుతో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో ఈ వ్యాఖ్యలు తనవి కావంటూ స్వయంగా రతన్ టాటా నకిలీ వార్తలకు ముగింపు పలికారు.
ఇటీవల, కోవిడ్ -19 కు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో రతన్ టాటా ప్రభుత్వానికి రూ .1,500 కోట్లు అందించారు. టాటా ట్రస్ట్స్ రూ .500 కోట్లు చెల్లించింది, టాటా సన్స్ కూడా రూ .1,000 కోట్ల అదనపు మద్దతును ప్రకటించింది, మొత్తం రూ .1,500 కోట్లు.కోవిడ్ 19 సంక్షోభం మేము ఒక జాతిగా ఎదుర్కొనే క్లిష్ట సవాళ్ళలో ఒకటి. టాటా ట్రస్ట్స్ మరియు టాటా గ్రూప్ కంపెనీలు గతంలో దేశ అవసరాలకు విరాళం ప్రకటించాయి ఇప్పుడు, ఇక ముందు ఎప్పుడు మా సహకారం దేశానికి ఉంటుందని రతన్ టాటా వెల్లడించారు.