Ratan Tata: రతన్ టాటా బతికి ఉండగానే.. టాటా గ్రూపును సమర్ధుడైన వ్యక్తికి అప్పగించాలని భావించారు. ఇందులో భాగంగా సైరస్ మిస్త్రి కి టాటా గ్రూపు బాధ్యతలను అప్పగించారు. అయితే సైరస్ – రతన్ మధ్య బంధం దీర్ఘకాలం సాగలేదు.. రతన్ కలల ప్రాజెక్టు నానో.. టాటా కంపెనీకి గుదిబండ లాగా మారింది. దీంతో ఆ ప్రాజెక్టు ఆపేయాలని మిస్త్రి అనేక ప్రయత్నాలు చేశారు. దానికి రతన్ అడ్డు చెప్పారు. నానో ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదని రతన్ భీష్మించుకు కూర్చున్నారు. దీంతో రతన్ కు మిస్త్రీ దూరమయ్యారు. ఆ తర్వాత ఆయన స్థానంలో నటరాజన్ చంద్రశేఖరన్ చేరారు. ఆయన టాటా గ్రూపులో దీర్ఘకాలం పనిచేస్తున్నప్పటికీ.. టాటా గ్రూప్ చరిత్రలో పార్సీయేతర వ్యక్తి చంద్రశేఖరన్ టాటా గ్రూప్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. చంద్రశేఖరన్ కు రతన్ టాటా తెర వెనుక మద్దతు ప్రకటించాలని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే టాటా మరణంతో ఆ మహా సామ్రాజ్య బాధ్యతలు చేపట్టేందుకు ఎవరు ముందుకు వస్తారు? అనే ప్రశ్న అందరిలోనూ ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది. అయితే ఆ అవకాశాలు, అర్హతలు ఉన్న వారిలో.. టాటా కుటుంబ వారసుల జాబితాలో.. నోయల్ టాటా పేరు వినిపిస్తోంది. నోయల్ రతన్ టాటా కు సవతి సోదరుడు. టాటా గ్రూపులో రిటైల్ వర్తక విభాగమైన ట్రెంట్, ఇతర వ్యాపారాల్లో ఆయన కీలక భూమిక పోషిస్తున్నారు. టాటా స్టిల్స్ కంపెనీకి వైస్ చైర్మన్ గా ఉన్నారు.. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. నావల్, సియోన్ టాటా దంపతులకు కుమారుడే నోయెల్ టాటా. నోయల్ తల్లి సియోన్ పెళ్లి చేసుకోవడానికి ముందు.. నావల్ కు సుని తో వివాహం జరిగింది. నావల్ – సుని దంపతులకు రతన్ 1937 డిసెంబర్ 28 న ముంబైలో జన్మించారు. రతన్ పుట్టిన పది సంవత్సరాలకు సుని – నావల్ విడిపోయారు.. ఆ తర్వాత నావల్ – సియోన్ ను పెళ్లి చేసుకున్నారు. నావల్ – సియోన్ దంపతుల కుమారుడే నోయల్.. రతన్ కు నోయల్ సవతి సోదరుడవుతాడు. నోయల్ కు నెవిల్లే, లేహ్, మాయ సంతానం. అయితే వీరంతా టాటా గ్రూపులో రకరకాల మేనేజ్మెంట్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.
టాటా గ్రూప్ బాధ్యతలు ఎవరికిస్తారు?..
నోయెల్ టాటా సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్, జేఎన్ టాటా ఎండోమెంట్, బాయి హీరాబాయి జేఎన్ టాటా నవ్ సారి చారిటబుల్ ట్రస్టులలో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాడు. నోయెల్ టాటా సోదరి ఆలూను సైరస్ మిస్త్రి వివాహం చేసుకున్నాడు. అప్పట్లో రతన్ టాటా సైరస్ ను టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ గా నియమించారు.. 2016లో ఆయన టాటా గ్రూప్ నుంచి బయటికి వెళ్లిపోయారు. 2017 ఫిబ్రవరి వరకు టాటా గ్రూప్ చైర్మన్గా రతన్ టాటా పనిచేశారు. నోయెల్ ముగ్గురు పిల్లలు లేహ్, మాయ, నెవిల్లే టాటా గ్రూప్ కంపెనీలలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నోయెల్ సస్సెక్స్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఫ్రాన్స్ లోని insead బిజినెస్ స్కూల్లో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం ను అభ్యసించారు. ఆ తర్వాత టాటా గ్రూపులో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 2003లో టైటాన్ ఇండస్ట్రీస్, వోల్టాస్ కంపెనీలకు డైరెక్టర్ గా మారారు. రతన్ కన్నుమూసిన నేపథ్యంలో నోయెల్ టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం జరుగుతోంది.. రతన్ కన్ను మూసిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోయెల్ తో ఫోన్లో మాట్లాడారు.. ఈ కష్టకాలంలో భగవంతుడు మీకు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ఫోన్లో కోరారు.