Revanth Reddy : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి కొలువుదీరారు. దేశవ్యాప్తంగా చూపు రేవంత్ రెడ్డి పై పడింది. దేశంలో యంగ్ డైనమిక్ లీడర్ గా ప్రాచుర్యం పొందారు. సోషల్ మీడియాలో సైతం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నారు. తెలంగాణలో 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని విజయ తీరాల వైపు రేవంత్ రెడ్డి చేర్చారు. ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 65 సీట్ల మెజారిటీ సాధించింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడి నుంచే రేవంత్ రెడ్డి పేరు మార్మోగిపోయింది. అయితే రేవంత్ రెడ్డి విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమ ముందుగానే అప్రమత్తమైంది.

సాధారణంగా చిత్ర పరిశ్రమతో రేవంత్ రెడ్డికి అంతగా సంబంధాలు లేవు. నందమూరి కుటుంబ సభ్యుల ఫంక్షన్లకు హాజరైన సందర్భాలు ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ తో మంచి సంబంధాలే కొనసాగిస్తూ వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా 2009లో బస్సు యాత్ర చేపట్టినప్పుడు మంచి అనుబంధం ఏర్పడింది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరాక.. మరి ఏ ఇతర చిత్ర పరిశ్రమ ప్రముఖులతో అంతగా సంబంధాలు కొనసాగించలేదు. ఒకవేళ కలవాల్సి వచ్చినా.. ఆ విషయాలను ఎప్పుడూ బయట పెట్టలేదు.

ఫలితాలు వెల్లడైన తర్వాత, కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చిన తర్వాత.. సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా రేవంత్ రెడ్డిని కలవడం ప్రారంభించారు. అదే సమయంలో పలు సందర్భాల్లో ఆయన సినీ ప్రముఖులతో తీయించుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ఓ ఫంక్షన్ కు హాజరైన ఫోటోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దర్శకుడు కొరటాల శివ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో తీయించుకున్న ఫోటో, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ తో రేవంత్ రెడ్డి తీయించుకున్న ఫోటోలు ఎక్కువగా వైరల్ అయ్యాయి.

ముఖ్యంగా రేవంత్ రెడ్డి జర్నలిస్ట్ గా ఉండేటప్పుడు మిగతా మిత్రులతో, తన భార్య, కుటుంబంతో దిగిన ఫోటోలు, మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ తో కరచలనం చేస్తున్న ఫోటో, రేవంత్ రెడ్డి కూతురి పెళ్లి సమయంలో చిరంజీవి, అల్లు అరవింద్, ఇటీవల ఓ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతున్న ఫోటో, జూనియర్ ఎన్టీఆర్ బస్సు యాత్ర చేపట్టినప్పుడు, బసవతారకం ఆసుపత్రిలో బాలకృష్ణతో ఉన్న ఫోటో, తన అభిమాని బండ్ల గణేష్.. ఇలా ఒకటేమిటి అన్ని రకాల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలో రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

