
Rapaka Varaprasada Rao: అడ్డతిక్కలోడు తిరునాణలకు వెళితే… అన్నట్లుంది ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పరిస్థితి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కంటే ఎక్కువగా రాపాకకు తగిలినట్లుంది దెబ్బ. ఒకరు చెప్పారో లేదా ఆయనకు ఆయనే సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారో ఏమో గాని ఫుల్ గా కామెడీ పండిస్తున్నారు. మేటి కమేడియన్లకు సరిపోలుతూ రాజకీయాల్లోకి కూడా ఇటువంటి వారు ఉంటారని నిరూపించిన ఆయన చేసిన మరో సెల్ఫ్ గోల్ వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. ఆ పార్టీలోనే ఉంటే ఆయన భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించేవారు. కానీ, ఆయన అధికార వైసీపీలో చేరేందుకు ఉత్సుకత చూపించారు. అందుకోసం జనసేన నుంచి తనకు తానుగా సస్పెండ్ అయ్యేందుకు వ్యూహాలు రచించుకున్నారు. జగన్ సభలకు హాజరయ్యేవారు. పవన్ కల్యాణ్ ను నానా రకాలుగా విమర్శించేవారు. అయినా, ఆయన జనసేన ఎమ్మెల్యేగానే పేరు స్థిరపడిపోయింది. రాజోలులో కాపు సామాజిక వర్గం ఎక్కువ. ఆ ఓటు బ్యాంకును పోగొట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రాజోలులో గత ఎన్నికల్లో 814 ఓట్లతో జనసేన విజయం సాధించింది. రాపాక వరప్రసాదరావుకు అప్పట్లో జనసేన చేరదీసి టిక్కెట్ ఇచ్చింది. ముందు జగన్ దగ్గర వెళితే డబ్బుల్లేవని ఆయనకు కాదని బొంతు రాజేశ్వరరావుకు టిక్కెట్ ఇచ్చారు. ఆ తరువాత పవన్ కల్యాణ్ చరిష్మా, కాపు ఓటింగ్ తో రాపాక బయటపడ్డారు. ఆ కృతజ్ఞతను ఎంతో కాలం నిలుపుకోలేకపోయారు. గెలిచిన కొద్ది రోజుల్లోనే వైసీపీలో చేరాలని ఒత్తిడి వస్తుందని చెప్పుకున్నారు. అక్కడ ఉంటే 152 ఇక్కడ ఉంటే నెంబరు 1 అని చెప్పిన కొద్ది రోజులకే వైసీపీకి అనుబంధంగా మారిపోయారు.

తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన క్రాస్ ఓటింగ్‌లో అసలు రాపాక వరప్రసారావు పేరు బయటకు రాలేదు. నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన తరువాత ఆత్మ రక్షణలో పడిన వైసీపీని కాపాడేందుకు స్వయంగా నడుం బిగించారు. ముందుగా టీడీపీ నుంచి ఆఫర్ వచ్చింది తనకేనన్నారు. ఆ తరువాత కొంతసేపటికి తాను అనలేదని అన్నారు. మరుసటి రోజు అసలు ఆయన దొంగ ఓట్లతోనే గెలిచినట్లు తేల్చిచెప్పేశారు. పేకాట ఛాంపియన్ షిప్ లకు బాగా అలవాటు పడ్డ రాపాక తన ప్రత్యర్థులకు కూడా తనను ఆ ఆటతోనే గెలిచి చూపించాలని ఛాలెంజ్ లు విసురుతుంటారు. టీడీపీ నేత గొల్లాపల్లి సుర్యారావుతో కూడా ఆయన ఈ విధంగా చేసిన ఛాలెంజ్ ఆడియోలు ఈ మధ్య హల్ చల్ చేశాయి. ఆయన దొంగ ఓట్ల గెలుపు ఆడీయో కం వీడియో ఒకసారి మీరు కూడా ఆలకించండి..