Ramoji Rao Vs Jagan: అసలే పత్రిక పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. నరేంద్ర మోదీ ఎడాపెడా పన్నులు పెంచేయడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి పేపర్ కు ధర పెరగడం, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల “కొండ పొగ” లాంటి పేపర్ దిగుమతి నిలిచిపోవడం, ఇంకులు, ప్లేట్ల ధరలు అమాంతం పెరగడంతో పత్రికా పరిశ్రమ కనివిని ఎరగని స్థాయిలో సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీనికి తోడు పత్రికలను ప్రచురించే యాజమాన్యాలు తమ రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా వార్తలు రాస్తుండడం, డిజిటల్ మీడియా మరింత వేగంగా దూసుకు రావడంతో పత్రికా మాధ్యమం పతనాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఏ మేనేజ్మెంట్ అయినా ఒక రూపాయి ప్రకటనను కూడా వదిలిపెట్టదు. ఎందుకంటే పత్రికల సేల్స్ కంటే ప్రకటనలే వాటికి కీలక ఆదాయం వనర. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం పత్రిక అమ్ముతున్న ధరకు.. దానిని రూపొందిస్తున్న ఖర్చుకు ఏమాత్రం పొంతన కుదరదు. యాజమాన్యాలు అందుకే ప్రకటనల ఆదాయం మీద ఆధారపడతాయి. అయితే ఇలాంటి దశలో 40 కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ పేరుపొందిన ఓ పత్రికా యజమాని యుద్ధానికే సిద్ధమయ్యాడు.
వద్దనుకున్నాడు
రామోజీరావు తెలుసు కదా.. ఈనాడు యజమాని. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సర్కులేషన్ ఉన్న పేపర్ కు కర్త, కర్మ, క్రియ. ఎన్టీఆర్ మొదలుకొని చంద్రబాబు నాయుడు వరకు ఎవరు ఏ సమయంలో ముఖ్యమంత్రి కావాలో నిర్ణయించిన ఘనాపాటి. అక్కడిదాకా ఎందుకు దేశంలోని ప్రతిపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న నరేంద్ర మోదీని తన వద్దకు రప్పించుకున్న ఘనత రామోజీరావుది. అలాంటి రామోజీరావు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాడు. మార్గదర్శి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒత్తుతున్న ఒత్తుడుకు గింగిరాలు తిరిగిపోతున్నాడు. అయితే తన ప్రత్యర్థుల విషయంలో ఏమాత్రం కనికరం చూపని జగన్మోహన్ రెడ్డి రామోజీరావు విషయంలో తప్పక తలవంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఏబీసీ రేటింగ్స్ ప్రకారం ఈనాడు నెంబర్ వన్ పత్రిక. ప్రభుత్వ పథకాలకు సంబంధించి.. ఆ పత్రిక మీద కోపం ఉన్నప్పటికీ అనివార్యంగా ప్రకటనలు ఇవ్వాల్సి వస్తున్నది. సాక్షితో పాటే ఆ పత్రికకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమానంగా ప్రకటనలు ఇస్తోంది. వీటికి సంబంధించిన చెల్లింపులను కూడా ఎప్పటికప్పుడు చేపడుతోంది. ఈనాడు విషయంలో ఎంతో ఉదారత చూపిన జగన్మోహన్ రెడ్డి.. ఆంధ్రజ్యోతి విషయంలో మాత్రం అదే ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే మార్గదర్శి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో రామోజీరావు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇది తనకు కోట్లలో నష్టం తీసుకు వస్తున్నప్పటికీ ఆయన జగన్మోహన్ రెడ్డి మీద పంతానికే సిద్ధమని సంకేతాలు పంపారు.
40 కోట్లు వద్దనుకున్నారు
మార్గదర్శి విషయంలో అటు జగన్మోహన్ రెడ్డికి, ఇటు రామోజీరావుకు మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో ఏమాత్రం అవకాశం దొరికినా రామోజీరావును అరెస్టు చేసేందుకే జగన్ అడుగులు వేస్తున్నారు. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో తెలియదు కాని.. ప్రస్తుతానికైతే రామోజీరావు విషయంలో జగన్ పై చేయి సాధించినట్టే కనిపిస్తోంది. అయితే ఈ విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలను ఈనాడు ప్రచురించడం లేదు. దీనివల్ల తనకు వచ్చే ఏడాదిలో ఎంత లేదనుకున్నా 40 కోట్ల వరకు ప్రభుత్వ ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని ఈనాడు అంచనా వేసుకుంది. అయితే జగన్ తమ సంస్థల మీద యుద్ధం సాగిస్తున్న నేపథ్యంలో ఆయన ప్రభుత్వం తాలూకు ప్రకటనలు తన మొదటి పేజీలో వేయడం ద్వారా జనాలకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని ఈనాడు భావిస్తోంది. పైగా మొదటి పేజీలో ప్రభుత్వ ప్రకటన ఉండడంతో లూజ్ సేల్స్ దారుణంగా పడిపోతున్నాయి. వాస్తవానికి ఈనాడుకు చందాదారుల కంటే లూజ్ సేల్సే అధికంగా ఉంటాయి. ఈ విషయంలో ఆంధ్రజ్యోతికి మొదటి పేజీ ప్రకటనలు దక్కకపోవడం, జగన్ మీద అతి విపరీతంగా వార్తలు కుమ్ముతుండడంతో దాని లూజ్ సేల్స్ విపరీతంగా పెరిగాయని అంటున్నారు. మరోవైపు గ్రామ సచివాలయాల్లో సాక్షి పేపర్ మాత్రమే పడుతుండడంతో ఇది అంతిమంగా ఈనాడుకు నష్టం చేకూర్చుతోంది. ఈ పరిణామాలతో ఆలస్యంగా మేల్కొన్న ఈనాడు ప్రభుత్వ ప్రకటనలు ప్రచురించకూడదని నిర్ణయించుకుంది. దీనిని వెంటనే అమలులో పెట్టింది. ఏపీ సిఐడి ద్వారా జగన్మోహన్ రెడ్డి దాడులు చేస్తుంటే.. అందుకు కౌంటర్ గా ఈనాడు ప్రభుత్వ ప్రకటనలు ప్రచురించకుండా నిర్ణయించుకుంది. ఏ మాటకామాట ఈ నాలుగేళ్లు జగన్ ప్రభుత్వం ద్వారా ప్రకటనల ఆదాయం పొందిన ఈనాడు.. చివరి ఏడాదిలో ప్రకటనలు ప్రచురించబోమని చెప్పడం విడ్డూరంగా ఉందని కొంతమంది జర్నలిస్ట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ప్రకటనలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది.