
Ramoji Rao Health: చతుర, విపుల కనుమరుగయ్యాయి, అన్నదాత మూత పడింది, మార్గదర్శిని జగన్ గెలుకుతున్నాడు, ఏనాడూ తన ఇంటి వైపు చూడని దర్యాప్తు సంస్థల అధికారులు ఈనాడు నేరుగా రామోజీ ఫిలిం సిటీలోకి వచ్చారు.. ఇన్నేళ్లుగా నిర్మించుకున్న తన సామ్రాజ్యపు ఇటుకలు ఒక్కొక్కటిగా పట్టు తప్పుతుంటే.. రామోజీరావు కూడా తన శరీరంపై పట్టుకొల్పోయాడు.. అనారోగ్యం బారిన పడ్డాడు.
చెట్టంత కొడుకు సుమన్ చనిపోతే ఆ గుండె కుంగిపోలేదు, రాజశేఖర్ రెడ్డి మార్గదర్శి విషయంలో బయటకి లాగితే భయపడలేదు, తన ఆత్మబంధువు కన్నుమూస్తే అతడు విచలితుడు కాలేదు.. కానీ ఇప్పుడు రామోజీకి ఏమయింది? పచ్చళ్ళు, పేపర్ కాంబినేషన్లో వేల కోట్లు సంపాదించిన మీడియా మొగల్ ధైర్యం ఎందుకు సన్నగిల్లింది? జగన్ ఆ స్థాయిలో దెబ్బ కొట్టాడా? పునాదులను పెకిలించి వేస్తున్నాడా? ఆర్థిక స్తంభాలను కూల కొడుతున్నాడా? వీటికి ఔననే సమాధానాలు వస్తున్నాయి.
అంతటి అమిత్ షాను ఇంటికి పిలిపించుకున్న ఘనత రామోజీ ది.. అంతటి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరై ముందువరుసలో కూర్చున్న చరిత్ర రామోజీది.. కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు చుక్కలు చూపించిన సత్తా రామోజీది.. కానీ అంతటి ఘనమైన వారసత్వం కలిగి ఉన్న ఈ మీడియా మొగల్ మంచానికే పరిమితం కావడం నిజంగా ఆశ్చర్యకరమే.

వయసు మళ్ళింది, రక్తం పలుచబడిపోయింది, నిసత్తువ ఆవరించింది.. ఈ ముక్తాయింపులు ఇప్పుడు వినిపిస్తాయేమో గాని.. అవి దీర్ఘ కాలంలో నిలబడలేవు. అలాంటి స్థితి కనుక ఉంటే ఈటీవీ భారత్ ను రామోజీరావు ఎందుకు ప్రవేశపెడతాడు? ఓం సిటీని ఎందుకు కడతాడు? ఒకే సారి 6 ఛానెల్స్ ఎందుకు మొదలుపెడతాడు? ఇంతటి తెగువ ఉన్నప్పటికీ ఎందుకు కూల పడిపోయాడంటే… జగన్ కొట్టిన దెబ్బ అలా సాలిడ్ గా ఉంది.. ఇప్పుడు రామోజీరావు లేవాలి, మార్గదర్శి కేసు కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళాలి..ఇవి జరిగే పనులేనా?!
వాస్తవానికి రామోజీరావుకు కొంతకాలంగా ఆరోగ్యం బాగుండటం లేదు. దీనికి తోడు తన గ్రూపు సంస్థల నష్టాలు. బయటికి చెప్పడం లేదు గాని మార్గదర్శి మినహా మిగతావేవీ లాభాల్లో లేవు. పైగా సొంత రాష్ట్రంలో అనుకూల ప్రభుత్వం లేదు.. దీంతో రామోజీరావులో అభద్రతా భావం మొదలైంది. అది కొంత కాలం నుంచే కనిపిస్తున్నది. సిఐడి విచారణ వేళ రామోజీరావు అనారోగ్యం విషయం తెరపైకి రావడం నిజంగా ఆశ్చర్యకరం.. అది కూడా నారా చంద్రబాబునాయుడు ట్విట్టర్ ద్వారా తెలపడం మరింత ఆశ్చర్యకరం.