రామజన్మభూమి అయోధ్యలో మొదలు పెట్టిన రామాలయ నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే విమర్శలు తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్నాయి. భూమి కొనుగోలు వ్యవహారంలో కోట్లా రూపాయల స్కామ్ జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే.. కోట్లాది రూపాయలు అధికంగా చెల్లించి భూములు కొనుగోలు చేశారని కథనాలు వస్తుండడం.. పెను దుమారం రేపుతోంది.
ఈ మార్చి 18వ తేదీన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు 1200 చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేసింది. అయితే.. ఈ భూమిని ఒకరి నుంచి ఓ వ్యక్తి కొనుగోలు చేసిన కొన్ని గంటల్లోనే రామజన్మభూమి ట్రస్టు అతన్ని కొనుగోలు చేయడం.. అందుకుగానూ ఊహించలేనంత రెట్టింపు డబ్బులు చెల్లించడమే ఈ వివాదానికి కారణమైంది.
ఈ భూమి రవిపాటక్ అనే వ్యక్తికి చెందినది. ఆ వ్యక్తి నుంచి రవి, అన్సారీ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి మార్చి 18న కొనుగోలు చేశారు. ఇందుకు గానూ వారు 2 కోట్ల రూపాయలు చెల్లించారు. అయితే.. అదే రోజున ఈ భూమిని వారిద్దరి నుంచి రామజన్మభూమి ట్రస్టు కొనుగోలు చేసింది. ఇందుకోసం ఏకంగా 18.5 కోట్లు చెల్లించింది. దీంతో.. తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇద్దరు వ్యక్తులు 2 కోట్లకు కొనుగోలు చేసిన భూమిని.. కొద్ది గంటల తేడాలోనే ట్రస్టు కొనుగోలు చేయడం.. దానికి ఏకంగా పద్దెనిమిదన్నర కోట్లు చెల్లించడంపై రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదంతా స్కామ్ లో భాగమేనని, ముందస్తు గూడుపుఠానీ ప్రకారమే ఈ కొనుగోళ్లు జరిగాయని కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఆరోపిస్తున్నాయి. పలు హిందూ ధార్మిక సంస్థలు కూడా ఈ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరి, దీనికి ట్రస్ట్ ఎలాంటి సమాధానం చెబుతుందన్నది చూడాలి.