
ఏపీ సీఎం జగన్ ఏడాది పాలనపై బీజేపీ నేత రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పుట్టినరోజున దీవించామంటే అర్థం చేసిన పాపాలు మర్చిపోయినట్టు కాదన్నారు. పాపాలు కచ్చితంగా కౌంట్ అవుతాయని హెచ్చరించారు. ఏపీలో పాలన అద్భుతంగా ఉందంటూ రాంమాధవ్ కితాబిచ్చారని, జగన్ మీడియా చేసిన ప్రచారానికి రాంమాధవ్ వ్యూహాత్మక కౌంటరించ్చారు. శుభాకాంక్షలు చెప్పినంత మాత్రాన సమర్థించినట్టు కాదని, అఖిల భారత వర్చువల్ ర్యాలీలో రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో అంతా రివర్స్ లో పాలన జరుగుతోందన్నారు. అన్నీ రివర్సే. రాజధానితో మొదలైంది రివర్స్. పోలవరం ప్రాజెక్టుకు టెండర్లు రివర్స్, అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తామన్నారు. దాంట్లో రివర్స్. ఇప్పుడు కొత్త కొత్త బ్రాండ్లతో మద్యం ప్రవహిస్తోంది. తిరుమల ఆలయ భూములు, ఆస్తులు అమ్మేసే ప్రయత్నం చేశారు. ప్రజలు రివర్స్ కావడంతో అక్కడా రివర్స్ అయ్యారు. ఎలక్షన్ కమిషనర్‌లో రివర్స్. బహుశా 60 సార్లు (సగటున వారానికి ఓసారి) హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకున్న ప్రభుత్వం దేశంలో ఇంకెక్కడా లేదు. బెయిల్ మీద ఒకాయన ఉంటే, బెయిల్ కోసం తయారీలో ఇంకొకాయన ఉన్నారు.’ అని రాంమాధవ్ అన్నారు.