
రాజకీయ అవసరాలు విడిపోయిన వారిని కలుపుతుంటాయి. అధికారం కోసం కలిసేలా చేస్తాయి. ఇప్పుడు రాజకీయంగా అథమ స్థానంలో ఉన్న బీజేపీ నాయకురాలు పురంధేశ్వరిని కమలనాథులు పట్టించుకోవడం లేదు. రెండు సార్లు దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా ఆమెకు పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు.
బీజేపీలో చేరిన ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరికి అస్సలు ప్రాధాన్యం దక్కడం లేదని ఆమె అనుంగ అభిమానులు వాపోతున్నారు. ఇక ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుది వేరే కథ..
వైసీపీలో చేరి పర్చూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి దగ్గుబాటి తృటిలో ఓడిపోయారు. లేకుంటే ఆయనే ఇప్పుడు శాసనసభ స్పీకర్ అయ్యుండే వారు. కానీ ఓడిపోయాక ట్రెయిన్ రివర్స్ అయ్యింది. బీజేపీలో ఉన్న పురంధేశ్వరి సీఎం జగన్ పై విమర్శలు చేయడం.. దగ్గుబాటి వాటిని నియంత్రించకపోవడంతో వైసీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. అదేసమయంలో దగ్గుబాటిని ఓడించిన టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ బాటపట్టడంతో దగ్గుబాటికి రాజకీయంగా ఇబ్బందులు తలెత్తాయి. బీజేపీనా.. ? వైసీపీనా తేల్చుకోవాల్సిన సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీని వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇలా దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత లేకుండా ఉన్నారు. వారి అసహాయతను అనుకూలంగా మార్చుకోవాలని చంద్రబాబు, లోకేష్ తాజాగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలిసింది.
తాజాగా అగ్రహీరో బాలక్రిష్ణ బర్త్ డే వేడుక కొత్త రాజకీయ సమీకరణాలకు వేదికైందట.. బాలయ్య బర్త్ డేకు నందమూరి కుటుంబసభ్యులంతా హాజరయ్యారు. ఈ సమయంలోనే బాలక్రిష్ణతో కుటుంబం సమవేశం అయ్యి ఫ్యామిలీ అంతా ఒకటి కావాలని అని డిసైడ్ అయ్యారట.. నారాలోకేష్ ఈ మేరకు చొరవ కూడా తీసుకున్నాడట.. బీజేపీలో అసమ్మతిగా ఉన్న వాళ్ల పెద్ద అమ్మ, కేంద్ర మాజీ మంత్రి అయిన దగ్గుబాటి పురంధేశ్వరి – వాళ్ల పెద్ద నాన్న ఇటీవల వైసీపీలో నుంచి బయటకి వచ్చారు. వాళ్ల కుమారుడికి లోకేష్ తో ఇంకా సత్సంబంధాలు ఉన్నాయట.. వారిని టీడీపీలోకి తీసుకొచ్చి అగ్రతాంబూలం ఇచ్చేందుకు లోకేష్ బాబు ప్రయత్నాలు ప్రారంభించారని టాక్ వినిపిస్తోంది.
కుదేలైన తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు నింపేందుకు.. ఇదే సమయంలో నందమూరి కుటుంబాన్ని ఏకం చేయడానికి బాలయ్య, లోకేష్ నడుం బిగించారట.. దగ్గుబాటి కుటుంబానికి ఇప్పుడు రాజకీయంగా గట్టి మద్దతు కావాలి కాబట్టి లోకేష్ బాబు పోయి అడిగితే దగ్గుబాటి ఫ్యామిలీ ఖచ్చితంగా ఆలోచిస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాడు ఎన్టీఆర్ ను గద్దెదించిన సమయంలో ఇదే చంద్రబాబు తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును మోసం చేశాడనే అపవాదు కూడగట్టుకున్నారు. కానీ ఈసారి చంద్రబాబు వాళ్లను మోసం చేయకుండా చూసే బాధ్యత బాలక్రిష్ణ తీసుకుంటాడని.. ఈ మేరకు బాలయ్య కూడా నందమూరి ఫ్యామిలీని ఒక్కటి చేసేందుకు తన అల్లుడు లోకేష్ బాబుతో కలిసి ప్రయత్నాలు ప్రారంభించారని మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
-నరేశ్ ఎన్నం