R Krishnaiah- Rajya Sabha: రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకోవడం ఆయా పార్టీల అధినేతల ఇష్టం. దానిని ఎవరూ కాదనలేరు కానీ.. వారి నిర్ణయాలు ఒకోసారి లాభం చేకూరుస్తాయి.. తప్పయితే మాత్రం వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ రాజ్యసభకు ఆర్,క్రిష్ణయ్యను ఎంపిక చేయడం ద్వారా సంక్షిష్ట పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నారు. తనకు రిస్క్ ఇష్టమని భావిస్తున్నారో ఏమో కానీ పక్క రాష్ట్రానికి చెందిన బీసీ నేతను పెద్దల సభకు పంపాలని నిర్ణయించుకున్నారు.
పార్టీ ఆవిర్భావం నుంచి తన వెంట నడిచిన బీసీ నాయకులను కాదని.. క్రిష్ణయ్యకు పదవి కట్టబెట్టారు. దీనిపై ఏపీ బీసీల్లో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నా పట్టించుకోవడం లేదు. తనకు తాను జాతీయ బీసీ నేతగా భావించే క్రిష్ణయ్యకు అన్ని రాజకీయ పక్షాలు ప్రాధాన్యమిచ్చాయి.. ప్రాధాన్యమిస్తునే ఉన్నాయి. అయితే క్రిష్ణయ్యను ఎంపిక చేయడం ద్వారా గుంపగుత్తిగా బీసీల ఓట్లు పడవొచ్చని జగన్ అంచనా వేయవచ్చు.. కానీ కాపుల ఓట్లకు మాత్రం గణనీయంగా గండిపడడం మాత్రం వాస్తవం. దీనికి క్రిష్ణయ్య వ్యవహార శైలే కారణం. కాపుల పట్ల ఆయన చాలా సందర్భాల్లో వ్యతిరేకత కనబరిచారు.
Also Read: Break To Gadapa Gadapa: ‘గడపగడప’కూ విమర్శలు… వదిలేస్తున్న మంత్రులు
అనుచిత వ్యాఖ్యలు సైతం చేశారు. కాపు సామాజికవర్గం ఆత్మాభిమానంపై దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇవన్నీ జగన్ కు తెలియవనుకుంటే మనం పొరబడినట్టే. అందుకే ఆయన అనూహ్యంగా క్రిష్ణయ్యకు తెరపైకి తెచ్చి కాపు సామాజికవర్గానికి కెలికారు. ఎలాగూ తనకు రాజకీయంగా దూరమవుతున్నారనో ఏమో కానీ.. కాపు కులాన్ని ధ్వేషించే క్రిష్ణయ్యను తెరపైకి తెచ్చి తన పంతాన్ని మరింతగా పెంచుకున్నారు. ఏపీలో ఉన్న 110 కి పైగా బీసీ కులాలను ఏకతాటిపైకి తెచ్చే బాధ్యతను క్రిష్ణయ్యకు అప్పగించారు. మీరు నన్ను సపోర్టు చేయకపోయినా పర్వాలేదు కానీ.. మీకు రాజ్యాధికారం దక్కకుండా చేస్తానని కాపు కులానికే జగన్ సవాల్ విసరుతున్నారు.
కాపుల రిజర్వేషన్లపై కన్నెర్ర
ఉమ్మడి రాష్ట్రంలో అయినా.. అవశేష ఆంధ్రప్రదేశ్ లో అయినా కాపులు సంఖ్య గణనీయం. కాపు, తూర్పుకాపు,ఒంటరి, తెలగ, బలిజలుగా పిలవబడే కాపులు ఏపీలో 22 శాతం ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. ఆర్థికంగా, రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారు. బీసీల్లో కలిపితేనే పురోగతి సాధిస్తామని.. బీసీలుగా గుర్తించాలని దశాబ్దాలుగా కోరుతూ వచ్చారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే కాపులను బీసీలుగా గుర్తిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో చేర్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత కాపుల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు మంజునాథ కమిషన్ ను ఏర్పాటుచేశారు. కమిటీ అధ్యయనం చేసి కాపులకు బీసీ రిజర్వేషన్ ఇచ్చేందుకు నివేదికలిచ్చింది. అయితే అప్పుడే క్రిష్ణయ్య ఈ ప్రక్రియను అడ్డగించారు. కాపులు అడ్డంగా బలిశారని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
వారిని బీసీల్లో కలిపితే 110కి పైగా బీసీ సామాజికవర్గాలకు అన్యాయం జరిగిపోతుందని వాదించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కుల నాయకులను సమీకరించి విజయవాడలో సమావేశం నిర్వహించారు. పాండిచ్చేరి మంత్రి క్రిష్ణారావును సైతం సమావేశానికి ఆహ్వానించారు. ఆర్థికంగా ఉన్నతులైన కాపులు బీసీల్లోకి వస్తే మన ఉనికి ప్రశ్నార్థకమని బీసీ నాయకులకు హెచ్చరించారు. వారు రాజ్యాధికారం కోసమే రిజర్వేషన్లకు డిమాండ్ చేస్తున్నారని మిగతా సామాజికవర్గాలైన రెడ్డీ, కమ్మలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. రిజర్వేషన్ కోటా పెంచి మాత్రమే తమకు రిజర్వేషన్ ప్రకటించాలని కోరుతున్నామని కాపు సంఘాల ప్రతినిధులు చెబుతున్నా వినలేదు. అప్పట్లో విపక్షంలో ఉన్న వైసీపీ డైరెక్షన్ లోనే క్రిష్ణయ్య పనిచేశారని ఆరోపణలున్నాయి. చివరకు చంద్రబాబు సర్కారు 2017 డిసెంబరులో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో క్రిష్ణయ్య కాపులకు వ్యతిరేకంగా మిగతా సామాజికవర్గాలను సమీకరించడం, రెచ్చగొట్టే ప్రయత్నం చేయడాన్ని కాపు సామాజికవర్గం ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే నాటి ఎపిసోడ్ లో క్రిష్ణయ్య సహకారం గుర్తించుకొని జగన్ రాజ్యసభ పదవి కట్టబెట్టారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అన్ని పార్టీలకు ప్రయోజనకారిగా..
బీసీ సంఘ జాతీయ నేతగా ఆర్.క్రిష్ణయ్యది సుదీర్ఘ చరిత్ర. దానిని కాదనలేం కానీ.. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ఈ నేత అవసరం రాజకీయ పక్షాలకు పడుతోంది. దీనినే అలుసుగా చేసుకొని క్రిష్ణయ్య భారీగానే లబ్ధిపొందారు. చంద్రబాబులాంటి అపర చాణుక్యుడు సైతం ఈయన బాధితుడే కావడం విశేషం. తెలంగాణలో టీడీపీ తరుపున ముఖ్యమంత్రి గా క్రిష్ణయ్యను ప్రకటించారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణలో తెలుగుదేశం కండువాను కప్పుకొని గెలిచిన క్రిష్ణయ్య తరువాత ఆ పార్టీకి ముఖం చాటేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఎప్పటికప్పుడు రాజకీయ స్ట్రేటజీ మార్చడం క్రిష్ణయ్యకు వెన్నతో పెట్టిన విద్య. పైకి మాత్రం తాను ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు… వ్యతిరేకం కాదంటూ ప్రకటనలిస్తుంటారు. కానీ ఫక్తు రాజకీయకు ఉండాల్సిన లక్షణాలు పుణికి పుచ్చుకున్నారు. ప్రస్తుతానికి వైసీపీ తరుపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. పదవీకాలం పూర్తయ్యాక మరో పార్టీ. ఆయన బీసీ జాతీయ నేతగా ఉన్నన్నాళ్లూ పదవులకు కొదువ ఉండదు. 110కిపైగా బీసీ సామాజికవర్గాలు మాత్రం ఓ మా నేత అంటూ పల్లకిని ఎత్తుకుంటాయి. కానీ ఓట్లు విషయానికి వచ్చేసరికి మాత్రం ఆయన మేనియా పనిచేయదు కానీ.. ఎందుకో జగన్ మాత్రం కాపుల మీద ఉన్న కోపం క్రిష్ణయ్యను చేరదీసినట్టుందని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:Telangana BJP: తెలంగాణలో ‘కాషాయ’ దండు కదులుతోంది.. ప్రత్యర్థులకు హెచ్చరికే
Recommended Videos