Raje Saheb Deshmukh : సహజంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రజలకు వరాలు ఇస్తుంటాయి. అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తుంటాయి. సంక్షేమ మంత్రాన్ని పటిస్తుంటాయి. ఉచితాల తాయిలాలను వేస్తుంటాయి. కానీ, ఇదంతా రొటీన్ అయిపోయింది. ఇలాంటి సమయంలో మన దేశం ఎదుర్కొంటున్న అసలైన సమస్యను శరద్ పవర్ పార్టీకి చెందిన అభ్యర్థి రాజే సాహెబ్ దేశ్ ముఖ్ తెరపైకి తెచ్చారు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీల మీద విమర్శలు చేయకుండా.. అసలైన సమస్యను ప్రస్తావించారు. “వయసు వచ్చిన యువకులకు పెళ్లి చేస్తానని.. జీవన ఉపాధిని కూడా కల్పిస్తానని” ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పడం దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది. నిజానికి దేశంలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది. ఆర్థిక అంతరం పెరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే అనేక సమస్యలు ఉన్నాయి. కానీ వాటన్నింటికీ మించి ఈడు వచ్చిన యువకులకు పెళ్లిళ్లు కాకపోవడం అనేది అతిపెద్ద సమస్యగా మారింది. కేవలం దక్షిణాది రాష్ట్రాలలోనే ఈ సమస్య లేదు. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య ఉంది. కేవలం ఆదివాసి, ఆదిమ జాతులలోనే ఈ సమస్య లేదు..
ఓ సర్వే ప్రకారం..
ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం గత 10 ఏళ్లలో పెళ్లికాని యువకుల సంఖ్య దేశంలో పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఒకప్పటిలాగా అమ్మాయిలు పెద్దల మాట విని.. వారు సూచించిన అబ్బాయిని చేసుకునే పరిస్థితి లేదని తెలుస్తోంది. “ఉద్యోగం, కెరియర్, ఆర్థిక స్థిరత్వం, దురలవాట్లు లేనివారిని అమ్మాయిలు కోరుకుంటున్నారు. అన్ని విషయాలలోనూ ఒక స్పష్టతతో వ్యవహరిస్తున్నారు. ఒకవేళ కట్టుకున్నవాడు పెత్తనం చేసినట్టు కనిపిస్తే.. మొహమాటం లేకుండా దాంపత్యానికి వీడ్కోలు పలుకుతున్నారు. అందువల్లే చాలామందికి పెళ్లిళ్లు కావడం లేదు. ఫలితంగా చాలామంది యువకులు ఒంటికాయ శొంఠి కొమ్ము జీవితానికి అలవాటు పడుతున్నారని” ఆ సంస్థ తన సర్వేలో ప్రకటించింది. భ్రూణ హత్యలు పెరిగిపోవడం.. ఆడపిల్లలను ఎక్కువగా కనకపోవడం.. చాలా రాష్ట్రాలలో లింగ సమానత్వం లేకపోవడం కూడా ఈ సమస్యకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే శరద్ పవర్ పార్టీకి చెందిన అభ్యర్థి రాజే సాహెబ్ దేశ్ ముఖ్ రేకెత్తించిన విషయం మామూలుది కాదు. అదేదో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన స్టంట్ కూడా కాదు. ఈడొచ్చిన యువకులకు పెళ్లిళ్లు సరిగా కాకపోతే అది అంతిమంగా జనాభా పెరుగుదలపై పడుతుంది. జనాభా పెరుగుదల తిరోగమనం దిశగా సాగితే ఆ ప్రభావం దేశ భద్రతపై, ఆర్థిక పరిస్థితి పై పడుతుంది. ప్రస్తుతం జపాన్ దేశం ఎదుర్కొంటున్న సమస్య కూడా అదే.