Homeజాతీయ వార్తలుRajaiah Vs Kadiam Srihari: రాజయ్యా.. ఎందయ్యా ఇదీ!

Rajaiah Vs Kadiam Srihari: రాజయ్యా.. ఎందయ్యా ఇదీ!

Rajaiah Vs Kadiam Srihari: తెలంగాణ రాజకీయాల్లో నేతల భాష రోత పుట్టిస్తోంది. ఇప్పటికే కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమ సమయంలో వాడిన భాషతో అన్ని పార్టీల్లోనూ అదే భాష అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా కేసీఆర్‌ ఇప్పటికీ విపక్షాలపై అదే భాష వాడుతున్నారు. దీనినే ఒంట పట్టించుకున్న ఆ పార్టీ నేతలు ఓ అడుగు ముందుకు వేసి వ్యక్తిగత దూషణలు, వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారు. మహిళలను, కుటుంబ సభ్యులను కూడా వదలకుండా అసభ్యరమైన మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీ తండ్రి గురించి అసోం ముఖ్యమంత్రి హేమంత్‌ బిస్వశర్మ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే భాష ఇదేనా అని ప్రశ్నించారు. బలుపా.. కావుమా.. అహంకారమా అంటూ ఆందోళనకు పిలుపునిచ్చారు.

ఇప్పుడు సొంత పార్టీలోనే..
నాడు హేమంత్‌ బిస్వశర్మ వ్యాఖ్యలను ఖండించిన కేసీఆర్‌ ఇప్పుడు సొంత పార్టీలోనే అంతకన్నా ఘోరమైన భాష వాడుతున్నా, అదీ సొంత పార్టీ నేతలపైనే చేస్తున్నా మౌనం వహిస్తున్నారు. స్టేషన్‌ ఘనపూర్‌కు చెందిన ఇద్దరు దళిత నేతల తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి మధ్య రెండ రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎమ్మెలే రాజయ్యకు ఈసారి టికెట్‌ వచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. దీంతో తనకు పోటీగా ఉన్న కడియం శ్రీహరిపై వ్యక్తిగత దూషణలకు దిగారు రాజయ్య. తల్లి, కులం గురించి కూడా నీచంగా మాట్లాడారు. అవినీతి తిమింగలం అని, అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. తల్లిదో కులం, తండ్రిదో కులం అంటూ వ్యక్తిత్వాన్ని కించపర్చేలా మాట్లాడారు.

కౌంటర్‌ ఇచ్చిన శ్రీహరి..
రాజయ్య వ్యాఖ్యలపై కడియం శ్రీహరి స్పందించారు. తనపై చేసిన ఆరోపణలను ఖండించారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చెప్పారు. తన కులం, తల్లి గురించి మాట్లాడిన రాజయ్య తీరును తప్పుపట్టారు. డాక్టర్‌ చదివిన రాజయ్యకు కులం ఎవరిది వస్తుందో తెలియకపోవడం బాధాకరనమన్నారు. అక్రమ ఆస్తులు ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ చేశారు.

యథా అధ్యక్ష.. తథా నేతలు..
రాజు ఎలా ఉంటే.. ప్రజలు అలాగే ఉంటారన్నట్లు.. అధ్యక్షుడు ఎలా మాట్లాడితే.. నేతలు కూడా అదే భాష వంట పట్టించుకుంటున్నట్లు విపక్షాలు బీఆర్‌ఎస్‌ నేతల తీరును తప్పుపడుతున్నాయి. రాజకీయాల్లో రాజకీయంగానే విమర్శలు చేయాలని సూచిస్తున్నారు. గతంలో చంద్రబాబు భార్య గురించి, పవన్‌ భార్య గురించి ఏపీ సీఎం జగన్‌ భార్య గురించి కొంతమంది ఇలాగే తప్పుడు విమర్శలు చేశారు. మహిళలను కూడా రాజకీయాల్లోకి లాగి విమర్శల పాలయ్యారు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్‌ఎస్‌ నేతలు ఆంధ్రా సంస్కృతిని ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది. ఇంత దిగజారి, కుటుంబ సభ్యులను కూడా విమర్శించడం రోత పుట్టిస్తోంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌ స్పందిస్తారో లేదో చూడాలి!

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular