Southwest Monsoon: ఏపీ ప్రజలకు శుభవార్త. శనివారం నుంచి రాష్ట్రంలో వర్షాలు పడనున్నాయి. రుతుపవనాలు ప్రవేశించడంతో వానలు ప్రారంభంకానున్నాయి. శనివారం మధ్యాహ్నంలోగా దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ను నైరుతి రుతుపవనాలు పలకరించనున్నాయి. రెండు రోజుల్లో రాష్ట్రంతో పాటు పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. కేరళకు మూడు రోజులు ముందుగానే వచ్చిన రుతుపవనాలు జూన్ 7న రాష్ట్రానికి విస్తరించాల్సి ఉన్నా.. వాతావరణం అనుకూలించక జాప్యమైంది.వారం రోజులుగా దక్షిణ కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకే పరిమితమయ్యాయి. బుధవారం గోవా వరకు వ్యాపించాయి. ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి ఆవరించి ఉన్నందున శుక్ర, శని వారాల్లో కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీయనున్నాయి. దక్షిణ ఆంధ్రలో ఒకట్రెండు చోట్ల వడగాడ్పులు వీయొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

మూడు రాష్ట్రాల్లో రెడ్ అలెర్ట్
మరోవైపు ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ ప్రకటించింది. రుతుపవనాలు మొత్తం ఈశాన్య ప్రాంతాన్ని కవర్ చేశాయని వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ రెడ్ అలర్ట్ అనేది రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలకు హెచ్చరికగా ఉంది. అధిక వర్షపాతం కారణంగా సాధ్యమయ్యే సంఘటనలను నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలని ఇది సూచిస్తుంది.
Also Read: Balakrishna- Gopichand Malineni: క్రాక్ డైరెక్టర్… బాలయ్యతో అఖండ 2 తీస్తున్నాడా?

ఇప్పటికే ఆ మూడు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. మే నుంచి మూడు రాష్ట్రాల్లో పడుతున్న భారీ వర్షాలకు 43 మంది మృత్యువాత పడ్డారు. ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మేఘాలయలోని గారో హిల్స్‌లో గురువారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు, రెండున్నరేళ్ల చిన్నారితో నలుగురు వ్యక్తులు సజీవ సమాధి అయినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.
[…] Also Read: Southwest Monsoon: ఏపీలో నేటి నుంచి వర్షాలు.. చురు… […]