Rahul Gandhi Visit To Telangana: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం ప్రయత్నిస్తోంది. పోయిన పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఇందుకు గాను అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తాపత్రయపడుతోంది. దీనికి రాహుల్ గాంధీ పర్యటనను కూడా ఉపయోగించుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ఈనెల 6న వరంగల్ లో రైతు సంఘర్షణ సభలో పాల్గొని అనంతరం 7న హైదరాబాద్ లో పర్యటించనున్నారు. దీనికి గాను ఇప్పటికే రోడ్ మ్యాప్ ఖరారు చేశారు. ప్రజల్లో ఉన్న నమ్మకాలను వమ్ము చేసుకోకుండా పార్టీని ప్రజలకు దగ్గరయ్యేలా వ్యూహాలు రచిస్తున్నారు.
ఇందుకు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో భేటీ ఏర్పాటు చేయాలని భావించినా అక్కడ అనుమతులు లభించలేదు. యూత్ కాంగ్రెస్ నేతలు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీన్ని కూడా ఉపయోగించుకోవాలని రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ చేస్తున్నారు. రాహుల్ గాంధీతో వారిని జైల్లోనే ములాఖత్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ ఏ అవకాశాన్ని కూడా వదలకుండా తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. తెలంగాణలో కేసీఆర్ రాహుల్ గాంధీ పర్యటనపై ఓ కన్నేసి ఉంచినట్లు తెలుస్తోంది. వారి కార్యక్రమాలు విజయవంతం కాకుండా ఆపేందుకు ఏ మంత్రం వేస్తాడో అని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారు.
Also Read: Teenmar Mallanna: బీజేపీకి తీన్మార్ మల్లన్న రాం రాం..! షాకింగ్ కారణం ఇదేనా..?
మరోవైపు ఉస్మానియాలో విద్యార్థులతో సమావేశం ఏర్పాటుకు న్యాయపోరాటం చేస్తున్నారు. రాహుల్ గాంధీ పర్యటనలో ఇవి హైలెట్ కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రోజంతా రాహుల్ గాంధీ పర్యటన ప్రజల్లో జోష్ నింపాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ టూర్ టానిక్ లా పనిచేస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు అందుకే ఆయన పర్యటనను సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ప్రజాసమస్యల పరిష్కారంలో అధికార పార్టీ చేస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రజజలకు విడమర్చి చెప్పేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే అభివృద్ధి పనులు చేపట్టకుండా పర్సంటేజీల కోసం పాకులాడుతోందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ చర్యలు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగానే ఉండటంతో కాంగ్రెస్ పార్టీ వాటిని ఎక్స్ పోజ్ చేయాలని సంకల్పిస్తోంది రాహుల్ గాంధీ ఉండే రెండు రోజులు హడావిడి చేసి సంచలనాలు జరిగేలా చూడాలని ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు కలిసి వస్తాయో లేక పరిస్థితుల్లో తేడా వచ్చి బెడిసి కొడతాయో వేచి చూడాల్సిందే.
ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేపట్టాలనే కృతనిశ్చయంతో మూడు పార్టీలు ముందుకు సాగుతున్నాయి. దీనికి గాను అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో రెండో దశ పాదయాత్ర చేపడుతోంది. కాంగ్రెస్ పార్టీ రైతుల సమస్యలపై నినదించేందుకు రైతు సంఘర్షణ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇంకా అధికార పార్టీ మాత్రం ఏ ప్రయత్నాలు చేయడం లేదు. ఏం జరుగుతుందో చూడాలి మరి.
Also Read: YS Jagan Illegal Assets Case: అక్రమాస్తుల కేసులో జగన్ కు బిగ్ రిలీఫ్
Recommended Videos: