Narendra Modi- Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఆ పార్టీ నేత గాంధీ కుటుంబ వారసుడు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత జోడో యాత్రలో చిటపటలు మొదలయ్యాయి. ఇప్పటికే దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమవుతున్నాయి. మరోవైపు రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్సే తమ ప్రత్యర్థిగా భావిస్తున్న కమలనాథులు రాహుల్ యాత్రే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పాదయాత్రలో రాహుల్‌గాంధీ ధరించి టీషర్ట్‌తో పంచాయితీ మొదలు పెట్టారు.

టీషర్ట్ వర్సెస్ సూట్..
పాదయాత్రలో రాహుల్‌గాంధీ ధరించిన టీషర్ట్‌పై ఉన్న లోగో ఆదారంగా బీజేపీ నాయకులు దాని గురించి గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఆ టీషర్ట్ విలువ రూ.45 వేలని ఇంత ఖరీదైన టీషర్ట్ ధరించి రాహుల్ చేస్తున్న పాదయాత్ర కూడా ఎంత ఖరీదైందో అంటూ ట్విట్టర్‌లో రాహుల్ ఫొటోతోపాటు, టీషర్ట్ ఫొటోను పోస్టు చేశారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. అమెరికా పర్యటన సందర్భంగా నరేంద్రమోదీ ధరించిన సూట్ ఫొటో, దాని ధర రూ.10 లక్షలు అంటూ అదే ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఇది రెండు పార్టీల మధ్య పంచాయితీకి కారణమైంది. టీషర్ట్ ధరను కాంగ్రెస్ ఖండించలేదు.. మోదీ సూట్ ధర కూడా తప్పని బీజేపీ ఎక్కడా ప్రకటన చేయలేదు. కాగా, తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మరో ఆరోపణ చేశారు. రాజస్థాన్ పర్యటనలో ఉన్న ఆయన రాహుల్ విదేశీ టీషర్టు ధరించి భారత్ జోడో అంటూ యాత్ర చేయడం ఏమిటని ప్రశ్నించారు. ‘భారత్‌ను ఐక్యం చేయడం తర్వాత ముందైతే దేశ చరిత్ర తెలుసుకోండి’ అంటూ చురకలు అంటించారు.
అగ్గి రాజేసిన పాస్టర్ వీడియో..
ఒకవైపు టీషర్ట్, సూట్ పంచాయితీ కొనసాగుతుండగానే కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో ఓ పాస్టర్ వీడియో కాంగ్రెస్ బీజేపీ మధ్య అగ్గిరాజేసింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే వ్యక్తితో రాహుల్ చెట్టాపట్టాలేంటని కమలం నేతలు భగ్గుమంటే.. మార్ఫింగ్ వీడియోలతో ఎగిరిపడొద్దని కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్ చేసింది. భారత్ జోడోయాత్ర కేరళలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ పాదయాత్రలో జార్జ్ పొన్నయ్య అనే పాస్టర్‌ను రాహుల్ కలవడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాహుల్‌తో కూడా జార్జ్ పొన్నయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపించింది. ‘జీసస్ నిజమైన దేవుడని, శక్తి లాంటి వేరే దేవతలాగా ఊహాజనితం కాదు’ అని రాహుల్‌తో జార్జ్ పొన్నయ్య అన్నారనే వీడియోను బీజేపీ రిలీజ్ చేసింది. రెచ్చగొట్టే ప్రసంగాలతో గతంలో అరెస్టయిన వ్యక్తిని రాహుల్ ఎలా కలుస్తారని బీజేపీ నేతలు ప్రశ్నించారు. అయితే బీజేపీ మార్ఫింగ్ చేసిన వీడియోను విడుదల చేసి.. నాటకమాడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాహుల్ భారత్ జోడో యాత్రకు వస్తున్న ప్రజా స్పందనను చూసి బీజేపీ నేతలు జీర్ణించుకోలేక ఇలాంటి వీడియోలను విడుదల చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్. ప్రధాని మోదీ ధరించే రూ.10 లక్షల సూట్ గురించి తాము ప్రశ్నించాల్సి వస్తుందన్నారు.

యాత్ర మొదలైన తొలి వారంలోనే కాంగ్రెస్, బీజేపీ మధ్య పంచాయితీ మొదలు కావడంతో.. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని విమర్శలు, ప్రతివిమర్శలు వస్తాయో అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.