Krishnam Raju- Prabhas Marriage: కృష్ణంరాజు పరిపూర్ణ జీవితం గడిపారు. జీవితంలో కీర్తి, పేరు, గౌరవం, ఆస్తులు, విలాసాలు అన్నీ చూశారు. కానీ ఓ ముఖ్యమైన కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశారు. అదే ప్రభాస్ వివాహం. కృష్ణంరాజుకు కుమారులు లేరు. తమ్ముడు కుమారుడు ప్రభాస్ నే కన్నకొడుకుగా భావించాడు. ఆ ప్రేమతోనే తన వారసుడిగా వెండితెరకు పరిచయం చేశాడు. ఒక స్థాయికి వచ్చే వరకు వెనకుండి నడిపించారు. పెదనాన్న ఆశలు నిలబెడుతూ ప్రభాస్ పెద్ద స్టార్ అయ్యాడు. కృష్ణంరాజు ఊహించిన దానికంటే పెద్ద స్టార్ అయ్యాడు. హీరోగా ప్రభాస్ ఎదుగుదల చూసి కృష్ణంరాజు మురిసిపోయాడు.
అయితే అంతకు మించిన కృష్ణంరాజు కలను ప్రభాస్ నెరవేర్చలేకపోయాడు. అదే వివాహం. గత పదేళ్లుగా ప్రభాస్ పెదనాన్న, పెద్దమ్మ పెళ్లి చేయాలని విశ్వ ప్రయత్నం చేశారు. తమ చేతుల మీదుగా ప్రభాస్ వివాహం అంగరంగ వైభవంగా చేయాలి అనుకున్నారు. కానీ ప్రతిసారి వాళ్లకు నిరాశే మిగిల్చాడు ప్రభాస్. మిర్చి సినిమా తర్వాత బాహుబలి, బహుబలి 2 కోసం ప్రభాస్ ఐదేళ్లు కేటాయించాడు. బాహుబలి2 విడుదలైన వెంటనే వివాహం చేసుకుంటాడు అన్నారు.
కానీ ప్రభాస్ సాహో కోసం మరో రెండేళ్లు కేటాయించాడు. చూస్తుండగానే ప్రభాస్ ఏజ్ 40 ఏళ్ళు దాటిపోయింది. కృష్ణంరాజు ఆశ అలానే ఉండిపోయింది. చివరికి ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించాడు. మరొక దురదృష్టకర విషయం ఏమిటంటే.. కనీసం కూతుళ్ళకు కూడా ఆయన వివాహం చేయలేదు. కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు కాగా ఒక్కరికి కూడా పెళ్లి చేయలేదు. ఇప్పుడు ఆ బాధ్యత ప్రభాస్ భుజాలపై పడింది.
అసలు ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం మాత్రం ఎవరికీ తెలియదు. ఆయన అందానికి, ఇమేజ్ కి, సంపాదనకు… కో అంటే కోటి మంది అమ్మాయిలు లైన్లో నిలబడతారు. అలాంటి ప్రభాస్ పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదో అర్థం కాక అభిమానులు కూడా అల్లాడిపోతున్నారు. ఇక ప్రభాస్-అనుష్కల మధ్య ఎఫైర్ రూమర్స్ గట్టిగా వినిపించాయి. అనుష్కను ప్రభాస్ ప్రేమిస్తున్నాడని త్వరలో వివాహం చేసుకుంటాడంటూ పలు కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్లను ప్రభాస్, అనుష్క ఖండించారు. వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాలు చేయడం జరిగింది. మరి భవిష్యత్ లో అయినా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడనే విషయంలో స్పష్టత లేదు.