Congress Bharat Jodo Yatra: – 3,200 మెట్లతో 15 కిలోమీటర్ల అలిపిరి–తిరుమల కొండ మార్గాన్ని కేవలం 90 నిమిషాల వ్యవధిలో ఏ మాత్రం ఆయాస పడకుండా 48 ఏళ్ల వ్యక్తి సునాయాసంగా ఎక్కేశాడు అంటే అతన్ని సోమరి అని ఎవరైనా అనుకుంటే మనమేం చేయలేం.
– ఒంటి చేత్తో కేవలం నిమిషం వ్యవధిలో 15 – 20 పుషప్‌లు చేసేసిన వాడిని సోమరి అంటే అది వాళ్ల విజ్ఞతకు వదిలేయాల్సిందే.
– పైలట్ అర్హత సాధించి, మంచి మార్కులతో ఎంఫిల్ చదివిన వాడిని సోమరి అని అంటే ఇక మనం ఆలోచించుకోవలసినదే.
– నడి సముద్రంలో ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా అమాంతం దూకి ఈత కొట్టిన వాడిని ధైర్యం లేని వాడు అనుకుంటే మన అజ్ఞానానికి పసిఫిక్ మహా సముద్రం లోతు కూడా సరిపోదు.

కాంగ్రెస్‌పై ప్రస్తుత రాజకీయ ప్రత్యర్థులు వేస్తున్న అపవాదులు చూస్తుంటే ఇలాగే ఉంది. కొండల మాదిరి గుట్టలు పేర్చుకున్న తినేత వాళ్లను నీతికి, పట్టుదలకు మారుపేరగా ప్రచారం చేస్తూ ఒక అద్భుతమైన రక్షణ కవచం చుట్టేసి, కాంగ్రెస్‌ను గాంధీ కుటుంబాన్ని మాత్రం ఏ ఆధారం లేకుండా ఆడి పోసుకోవడానికి ఆ కుటుంబంపై సమాజంలో విద్వేషాన్ని పెంచుతున్న తీరు కాంగ్రెస్ వాదులకు మింగుడు పడడంలేదు. మరోవైపు పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న అప్రతిహత జైత్రయాత్రను అడ్డుకోలేకపోతోంది. ఈ క్రమంలో ప్రస్తుత రాజకీయాల పద్యవ్యూహాన్ని ఛేదించుకుంటూ అవినీతి మకిలిని వదిలిస్తానంటూ.. నిందలు, అపవాదులను పటాపంచలు చేస్తానంటూ.. కాంగ్రెస్‌కు మళ్లీ పునర్‌వైభవం తీసుకురావడమే లక్ష్యంగా భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు.. గాంధీ కుటుంబ ఈ తరం వారసుడు రాహుల్ గాంధీ. ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ సమర్థుడిగా, అవసన దశలో ఉన్న పార్టీకి పూర్వ వైభవం తెచ్చిన నేతగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతాడు. అలా జరగని పక్షంలో కాంగ్రెస్ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందన్నది మాత్రం నిజం. భారత్ జోడో యాత్ర రాహుల్ సమర్థతను నిర్ణయించనుంది.
ఐదు తరాల రాజకీయ ప్రస్థానం..
కాంగ్రెస్‌లో గాంధీ కుటుంబానికి ఐదు తరాల రాజకీయ ప్రస్థానం.. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు సుదీర్ఘ ప్రయాణం, కాంగ్రెస్‌తో విడదీయలేని అనుబంధం కొనసాగుతోంది. సుధీర్ఘ రాజకీయ ప్రస్తానంలో.. తరానికి ఒక్కరు రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ వస్తున్నారు. దేశ స్వాతంత్య్రం కోసం తరం ఒకటైతే.. స్వాతంత్య్ర అనంతరం జాతి పునర్నిర్మాణానికి కృషి చేసింది ఇంకో తరం.. గరీబ్ హఠావో అంటూ గర్జించింది మరో నాయకత్వం.. సాకేంతికతను అందిపుచుకుంటూ దేశ పురోభివృద్ధికి బాటలు వేసింది మరో వారసత్వం.. ఈ పయనంలో ఎన్నో ఆటుపోట్లు.. ఇంకెన్నో అపవాదాలు.. వేటికీ వెరవకుండా భరత జాతికోసం.. అన్నివర్గాల ఐక్యత కోసం ముందుకు సాగింది గాంధీ కుటుంబం.
పంచవర్ష ప్రణాళికలతో దేశ పునర్నిర్మాణం..
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి ప్రధనిగా బాధ్యతలు చేపట్టిన జవహర్‌లాల్ నెహ్రూ.. తెల్లదొరలు కొల్లగొట్టిన దేశాన్ని, చెల్లాచెదురైనా ప్రాంతాలను ఐక్యం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టి నవభారత నిర్మాణానికి బాటలు వేశారు. ప్రాజెక్టులు నిర్మించారు. వ్యవసాయం, పారిశ్రామిక పరోభివృద్ధికి కృషి చేశారు.

పేదల బతుకుల్లో వెలుగు కోసం..
తండ్రి రాజకీయ వారసత్వం పుణికిపుచ్చుకున తనయా, దేశం నుంచి పేదరికాన్ని పారద్రోలాలని భావించిన నేతగా ఇందిరాగాంధీ చరిత్రలో నిలిచిపోయారు. బ్యాంకుల జాతీయీకరణ, దళితులకు ఇళ్ల నిర్మాణం, పేదలకు భూముల పంపిణీ, ఆర్థికాభివృద్ధికి రుణాల పంపిణీ, పారిశ్రామిక, శాస్త్ర సంకేతిక రంగంలో దేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలుపడంలో కీలక పాత్ర పోషించారు ఇందిర. దేశ తొలి మహిళా ప్రధానిగా, నిర్ణయాలు తీసుకోవడంలో అపర శక్తిగా, దేశ సుస్థిరత కోసం అహర్నిషలు శ్రమించారు. చివరకు దేశం కోసం తన రక్తం ధారపోశారు. ముష్కరుల తూటాకు బలయ్యారు.
అనుకోని పరిస్థితిలో ప్రధానిగా..
రాజీవ్ గాంధీ తల్లి, తాత ప్రధానులు అయినప్పటికీ కేవలం ఒక విమాన పైలెట్‌గా జీవనం ప్రారంభిచారు దివంగత ప్రధాని రాజవ్‌గాంధీ. తల్లి ఇందిరాగాంధీ హత్య నేపథ్యంలో అనుకోని పరిస్థితులలో ప్రధాని అయ్యారు రాజీవ్‌గాంధీ. అయితే ఆయన పాలించిన ఐదేళ్లలో మొదలైన డిజిటల్ విప్లవం ఫలితాలు దేశం ఇప్పటిక పొందుతోంది. వాళ్లు పదవులు కోసం ఏనాడూ పరితపించిపోలేదు. శాస్త్ర సాంకేతిక రంగంలో దేశాన్ని అగ్రదేశాల సరసన నిలిపే ప్రయత్నంలో మరో ఉగ్రకుట్ర రాజీవ్‌ను బలితీసుకుంది. దేశం కోసం రక్తం చిందించిన తల్లి, తనయుల చరిత్ర గాంధీ కుటుంబానిది.
తప్పు చేయకున్నా.. అవినీతి మచ్చలే..
గాం«ధీ కుటుంబంలో నేటి తరం నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి రాహుల్ గాంధీ.. అతనికి ప్రధానుల వారసత్వం రావటం కాదు. నిజానికి అతనికి వచ్చింది 70 ఏళ్ల అవినీతి అనే ఒక దుర్మార్గపు మకిలి. కాలక్రమంలో అందంతా వట్టిదే అని తేలిపోయినా… రూ.1.80 లక్షల కోట్ల 2జీ స్పెక్ట్రం కుంభకోణం రూపంలో మరో మచ్చ ఆ కుటుంబానికి గుదిబండగా మారింది. ఆ కుటుంబానికి సంబంధం లేని బొగ్గు కుంభకోణం పార్టీ మెడకు చుట్టుకుని అనకొండలా మారింది. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా అవినీతితో ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ అవినీతి అనే చచ్చిన పామును అతని కుటుంబం మెడలో వేసింది వైరి రాజకీయవర్గం. కానీ, ఆవర్గం అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లయినా ఒక్క కేసు అయినా నిరూపించలేకపోయింది..
కుట్రా రాజకీయలను ఛేదించుకుంటూ..
ప్రస్తుత స్వార్థ రాజకీయాల పద్యవ్యూహాన్ని ఛేదించుకుంటూ అవినీతి మకిలిని వదిలించుకుంటూ.. నిందలు, అపవాదులను పటాపంచలు చేస్తూ.. కాంగ్రెస్‌కు మళ్లీ పునర్‌వైభవం తీసుకురావడమే లక్ష్యంగా భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు.. గాంధీ కుటుంబ ఈ తరం వారసుడు రాహుల్ గాంధీ. ఎనిమిదేళ్లుగా జరుగుతున్న అసత్య ప్రచారాన్ని.. అవినీతి అరోపణలను, తప్పుడు పాలనా విధానాన్ని… దిగజారుతున్న దేశ ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరిస్తూ.. పార్టీలకు అతీతంగా జాతిని ఐక్యం చేయడమే భారత్ జోడో యాత్ర లక్ష్యం. 3,570 కిలోమీటర్ల ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభానికి ఒక రోజు ముందు.. ఇది భారత రాజకీయాలకు ‘‘పరివర్తన క్షణం’’, పార్టీ పునరుజ్జీవనానికి ‘‘నిర్ణయాత్మక క్షణం’’ అని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మెగా ర్యాలీలో ‘భారత్ జోడో యాత్ర’తో ఆర్థిక అసమానతలు, సామాజిక ధ్రువణత, రాజకీయ కేంద్రీకరణ సమస్యలపై ధ్వజమెత్తాలని ప్రయత్నిస్తోంది.
తండ్రి అమరుడైన స్థలం నుంచే..
దేశం కోసం రక్తం చిందించిన తన తండ్రి రాజీవ్‌గాంధీ అమరుడైన శ్రీపెరంబదూర్ నుంచే భారత్ జోడో యాత్రకు రాహుల్‌గాంధీ శ్రీకారం చుట్టారు. రాహుల్ ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. పాదయాత్ర ప్రారంభానికి ముందు, రాహుల్ గాంధీ శ్రీపెరంబుదూర్‌లోని రాజీవ్ గాంధీ స్మారక చిహ్నం వద్ద ప్రార్థన సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత కన్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభించారు. వీలైన చోటల్లా భారత్ జోడో యాత్రలో చేరాలని ప్రియాంక గాంధీ వాద్రా వీడియో సందేశంలో ప్రజలను కోరారు.
ఐదు నెలల సుదీర్ఘ యాత్ర..
దాదాపు ఐదు నెలలు సాగే భారత్ జోడో యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ శ్రీనగర్ వరకు 3,570 కి.మీలు కొనసాగనుంది. పాదయాత్ర రెండు బ్యాచ్‌లుగా ఉదయం 7 గంటల నుంచి 10:30 గంటల వరకు, రెండోది మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు సాగనుంది. ఉదయం సెషన్‌లో తక్కువ మంది పాల్గొనేవారు ఉండగా, సాయంత్రం సెషన్‌లో జన సమీకరణ కనిపిస్తుంది. సగటున ప్రతిరోజూ 22 నుండి 23 కి.మీ. సాగనుందని సమాచారం. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి తిరువనంతపురం, కొచ్చి, నిలంబూర్, మైసూరు, బళ్లారి, రాయచూర్, వికారాబాద్, నాందేడ్, జల్గావ్, ఇండోర్, కోట, దౌసా, అల్వార్, బులంద్‌షహర్, ఢిల్లీ, అంబాలా, పఠాన్‌కోట్, జమ్మూ మీదుగా ఉత్తరం వైపు వెళ్లి.. శ్రీనగర్‌లో ముగుస్తుంది.