
దేశరాజకీయాల్లో ట్విటర్ మరోసారి కేంద్ర బిందువైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖాతాతోపాటు కాంగ్రెస్ అఫీషియల్ అకౌంట్, దాదాపు 5 వేల మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల ఖాతాలను నిలిపేసింది. దీంతో.. ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దీనిపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. అయితే.. ఈ పరిస్థితి కారణమైన హత్యాచార బాధిత కుటుంబం రాహుల్ గాంధీకి మద్దతుగా వ్యాఖ్యానించడంతో.. ట్విటర్ కు ఎదురుదెబ్బ తగిలినట్టైంది. అసలేం జరిగిందంటే…
ఈ నెల 3వ తేదీన ఢిల్లీలోని నంగమ్ ప్రాంతంలో ఓ మైనర్ బాలికపై ఆలయ పూజారి, మరో ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అనంతరం హత్య చేశారు. ఆ తర్వాత.. బాధితురాలు విద్యుత్ షాక్ తో ప్రమాదవశాత్తు చనిపోయినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారని తేలింది. ఈ దారుణం మరో నిర్భయ ఘటనను తలపించింది. దీంతో.. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.
ఈ విషయమై రాహుల్ గాంధీ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆ ఫొటోలు, వీడియోలను తన ట్విటర్ అకౌంట్లో పోస్టు చేశారు. అయితే.. హత్యాచార బాధితురాలి తల్లి ఫొటోను బయటపెట్టారంటూ ట్విటర్ రాహుల్ ఖాతాను నిలిపేయడం గమనార్హం. దాంతోపాటు కాంగ్రెస్ అకౌంట్ ను, వేలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అకౌంట్లనూ నిలిపేసింది.
దీనిపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బీజేపీ సూచన మేరకే ట్విటర్ కాంగ్రెస్ ను టార్గెట్ చేసిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన యూట్యూబ్ చానల్ లో ఒక వీడియోను పోస్టు చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం ముప్పును ఎదుర్కొంటోందని అన్నారు.
పార్లమెంటులో విపక్షాలను మాట్లాడనివ్వట్లేదని, మీడియానూ నియంత్రిస్తున్నారని అన్నారు. ట్విటర్ లాంటి తటస్థ వేదికల్లో అభిప్రాయాలను షేర్ చేసుకుందామంటే.. ఆ సంస్థ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందని అన్నారు. ప్రభుత్వం చెప్పిందే ఆ సంస్థ వింటోందని ఆరోపించారు. మన రాజకీయాల్లో ఒక కార్పొరేట్ కంపెనీ జోక్యం చేసుకుంటోందన్న రాహుల్.. ఇది ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదని అన్నారు. ఒక రాజకీయ నాయకుడిగా దీన్ని తాను అంగీకరించబోనని అన్నారు.
కాగా.. ఏ కారణంతోనైతే ట్విటర్ రాహుల్ ఖాతాను నిలిపేసిందో.. ఆ విషయంలోనే ఎదురు దెబ్బ తగిలింది. హత్యాచార బాధితురాలి తల్లి ఫొటోను షేర్ చేయడంపై ఆ కుటుంబం స్పందించింది. రాహుల్ తమ ఫొటోను షేర్ చేయడం పట్ల తమకేమీ అభ్యంతరం లేదని ప్రకటించింది. మరి, ట్విటర్ ఏం సమాధానం చెబుతుందో చూడాలి.