Rahul Gandhi Bharat Jodo Yatra: అధికారం ఎవ్వరిని అయినా మార్చేస్తుంది.. అందలం ఎక్కిస్తుంది. అలాగే అధికారం కోల్పోతే.. ప్రజలు ఆదరించకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో రాజకీయ నేతలకు అలవాటు. ఎన్నికల్లో ఓటమిని ఏ నాయకుడు స్వీకరించడు.. అంగీకరించడు.. 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఎన్నో దఫాలు పాలించింది. కానీ అవినీతి మరకలు.. అసంబద్ద పాలనతో 2014లో ప్రజలు ఆ పార్టీకి చరమగీతం పాడారు. అస్సలు నాడు ఉనికి లేని బీజేపీని.. మోడీ ఫోటో చూసి గెలిపించారు. ఒక ఛాయ్ వాలా.. సామాన్యుడిగా మోడీని ఆదరించారు.. అక్కున చేర్చుకున్నారు. 2019 ఎన్నికల్లోనూ మోడీ హవా కొనసాగి మరోసారి ప్రధానిగా అవతరించారు. నాడు చాయ్ వాలా ఇప్పుడు దేశానికి పవర్ ఫుల్ వ్యక్తిగా.. ప్రపంచానికి దిక్సూచీగా మారారు.

ఇక 2014లో తన సారథ్యంలో కాంగ్రెస్ ఓటమితో అధ్యక్ష పగ్గాలు వదులుకున్నాడు రాహుల్ గాంధీ. ఇప్పటికే చేపట్టనంటున్నాడు. రెండు సార్లు అధికారం దూరంతో కాంగ్రెస్ కుదేలైంది. ఒక్కో రాష్ట్రం కాంగ్రెస్ చేజారి.. బీజేపీ వశమైంది. దేశంలో కాంగ్రెస్ ప్రభ మసకబారింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో చచ్చిపోతున్న కాంగ్రెస్ ను బతికించాలని దేశవ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. దక్షిణాన కన్యాకుమారి నుంచి మొదలైన ఆయన ప్రస్థానం ఇప్పుడు కర్ణాటకను దాటి ఏపీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక నిన్న జరిగిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని. ఎన్నికలలో బళ్లారి పోలింగ్ బూత్ లో క్యూలో నిలబడి అతి సామాన్యుడిలా రాహుల్ గాంధీ ఓటు వేశారు. తన నిరాడంబరతను, సామాన్యతత్వాన్ని చాటుకున్నారు.

రాహుల్ ను చూసి తమిళలు, మలయాళీలు, కన్నడిగులు ఫిదా అయ్యారు. ఒక సామాన్యుడిలా ఆయన పాదయాత్రలో ప్రజలతో కలిసిపోయిన విధానం.. కలుపుగోలుతనం అందరినీ ఫిదా చేసింది. ఇప్పుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర మంగళవారం ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశిస్తోంది. ఒకప్పుడు ఇదే ఆంధ్రా కాంగ్రెస్ కు కంచుకోట.. రాష్ట్ర విభజనతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మళ్లీ జవసత్వాలు నింపేందుకు రాహుల్ తెలుగు రాష్ట్రాల్లోకి అడుగుపెడుతున్నారు.
ఈరోజు నుంచి నాలుగురోజులు పాటు ఏపీలో రాహుల్ పాదయాత్ర సాగనుంది. ఏపీ సరిహద్దు గ్రామమైన హాలహర్వి నుంచి రాహుల్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. చత్రగుడి హనుమాన్ ఆలయం నుంచి రాహుల్ పాదయాత్ర మొదలుపెడుతారు. 10.30 గంటలకు ఆలూరు సిటీలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. రాత్రికి చాగి గ్రామంలో నైట్ హాల్ట్ ఉంటుంది. ఈ పాదయాత్రలో ఏపీ నాయకులతోపాటు తెలంగాణ నేతలు కూడా పాల్గొంటారు.

కర్నూలు జిల్లా ఆలూరు మండలం హాలహర్వి వద్ద రాహుల్ పాదయాత్ర సందర్భంగా భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే రాహుల్ కన్యాకుమారి నుంచి ప్రారంభించిన ఈ యాత్ర 41వ రోజుకు చేరుకుంది. 21వ తేదీ వరకూ ఏపీలో కొనసాగనుంది. ఏపీలో 96 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర సాగనుంది. ఏపీ, తెలంగాణ కీలక నేతలు పాల్గొననున్నారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ కు ఈ రాహుల్ యాత్ర ఊపిరిలూదడం ఖాయం. నేతలను సంఘటితం చేయనుంది.
-23న తెలంగాణలోకి రాహుల్ పాదయాత్ర
ఏపీ నుంచి రాహుల్ పాదయాత్ర 23న తెలంగాణలోకి ప్రవేశించనుంది. నారాయణపేట జిల్లా శివారులోని కృష్ణ మండలం గూడవల్లూరు గ్రామంలోకి యాత్ర ప్రవేశిస్తుంది. ఆరోజు సాయంత్రానికి మక్తల్ చేరుకొని దీపావళి సందర్భంగా 24,25వ తేదీల్లో పాదయాత్రకు రాహుల్ గాంధీ విరామం ఇస్తారు. ఆయన బస కూడా ఇక్కడే ఉండనుంది. 26 నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది.

ఈ పాదయాత్ర ద్వారా పడిపోయిన కాంగ్రెస్ ను పైకి లేపడం.. జవసత్వాలు నింపడం.. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు స్థైర్యం నింపి వచ్చేసారి అధికారమే లక్ష్యంగా అడుగులు వేయడానికి దోహదపడనుంది. మరి రాహుల్ పాదయాత్ర లక్ష్యం చేరుతుందా? లేదా? అన్నది 2024 ఎన్నికల్లోనే తేలనుంది.