Congress Bharat Jodo Yatra- Telangana: 16 రోజులు.. 19 అసెంబ్లీ.. 7 లోక్‌సభ నియోజకవర్గాలు.. రోజుకు 25 కిలోమీటర్లు.. మొత్తం తెలంగాణలో 375 కిలోమీటర్లు సాగిన కాంగ్రెస్ అగ్రనేత, గాంధీ కుటుంబ వారసుడు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో ఆ పార్టీకి కొత్త ఊరిపి పోసినట్లే అనిస్తోంది. అక్టోబర్ 26న రాష్ట్రంలోకి అడుగు పెట్టిన రాహుల్‌గాంధీ మధ్యలో నాలుగు రోజులు బ్రేక్ తీసుకున్నారు. మొత్తంగా 12 రోజులు సాగియ యాత్ర.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఏకతాటిపైకి తీసుకొచ్చినట్లే కనిపిస్తోంది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదలైన యాత్ర హైదరాబాద్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల మీదుగా సాగింది. ఈ యాత్రలో తెలంగాణ విద్యావంతులు, వివిధ సంఘాల నాయకులు, వివిధ వర్గాలు, మత, కుల పెద్దలు, రాజకీయ, క్రీడా, వ్యాపార, సినిమా రంగాలకు చెందిన ప్రముఖులు రాహుల్‌తో కలిసి నడిచారు. ఈమేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఐక్యంగా పనిచేశారు. సభలు, సమావేశాలకు భారీగా జన సమీకరణ చేశారు. మొత్తంగా రాహుల్ యాత్ర విజయవంతానికి నాయకులంతా సమష్టిగా పనిచేయడం శుభపరిణామం.
కీలక సమయంలో..
కాంగ్రెస్ మిగతా రాజకీయ పార్టీలకు పూర్తి భిన్నం. అందులో తెలంగాణ కాంగ్రెస్ మరీనూ. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టిననాటి నుంచి ఈ ప్రజాస్వామ్యం శృతి మించింది. ఎవరికి వారు తాను పీసీసీ చీఫ్ రేంజ్‌లో ఫీల్ అవుతూ పార్టీని చిలువలు పలువలు చేస్తున్నారు. చివరకు ఆధిపత్యం కోసం అంతర్గత కుమ్ములాటలకు తెరలేపారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు. బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నిక తెచ్చారు. క్లిష్ట పరిస్థితిలో.. కీలయ సమయంలో రాహుల్ యాత్ర తెలంగాణలో సాగడం.. యాత్ర విజయవంతానికి దూరం దూరంగా ఉన్న నేతలు ఐక్యంగా పనిచేయడం కనిపించింది.
కాంగ్రెస్‌కు బలమున్న రాష్ట్రం..
2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కేంద్రంలో ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయింది. ఎనిమిదేళ్ల కాలంలో పార్టీ బలహీనపడుతూ వస్తోంది. అయినా తెలంగాణ మాత్రం కాంగ్రెస్‌కు అత్యంత బలం ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. దక్షిణాదిన కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యమైన పార్టీగా, ప్రస్తుతానికి ప్రతిపక్ష పార్టీగా ఉంది కాంగ్రెస్. కానీ కేరళ, కర్ణాటకతో పోలిస్తే తెలంగాణ పరిస్థితి తక్కువ ఆశాజనకంగా ఉంది. అయితే తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్‌ను బలహీన పర్చేందుకు టీఆర్‌ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్‌ను బలహీన పరుస్తూ బీజేపీ బలం పుంజుకుంటోంది. కాంగ్రెస్ నాయకుల మధ్య ఉండే గ్రూపు రాజకీయాలే.. టీఆర్‌ఎస్, బీజేపీకి ప్లస్ పాయింట్‌గా మారాయనడం ఎవరూ కాదనలేని నిజం.
దేశ ఐక్యత కోసం చేపట్టిన యాత్ర..
రాహుల్ తన యాత్ర జాతీయ సమైక్యత, మతాల మధ్య కొట్లాటలు లేకుండా చూడడం, కులాల మధ్య వివక్ష లేకుండా చూడడం అన్నిటికీ మించి బీజేపీ విద్వేష, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా అని చెబుతున్నారు. ఎన్నికల రాజకీయాల గురించి కాకుండా, ఇతర అంశాల గురించి మాట్లాడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ తెలంగాణ రాహుల్ యాత్ర సాగిన 12 రోజులు ఆయన చెప్పిన అంశాల కంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు అనే అంశంపైనే ఎక్కువ చర్చ జరుగింది. ఈ యాత్రతో పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. పార్టీని పట్టి వెనక్కు లాగుతున్న గ్రూపు రాజకీయాల తీవ్రత ఇక తగ్గుతుందని నేతలు భావిస్తున్నారు.
తెలంగాణలో యాత్రపై రాహుల్ కీలక వ్యాఖ్యలు..
తెలంగాణలో యాత్ర ముగింపు సందర్భంగా కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ మాట్లాడారు. తెలంగాణను వదిలి వెళ్లడం బాధగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో ఎంతో మంది ప్రజలతో మాట్లాడానని, వారి కష్టసుఖాలున తెలుసుకున్నట్లు రాహుల్ చెప్పారు. ఈ రాష్ట్ర ప్రజలను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అయితే, ఇప్పుడు వదిలివెళుతుంటే బాధగా ఉందని వ్యాఖ్యానించారు.

పార్టీ నేతలకు కితాబు..
తెలంగాణ ప్రజలతో కలిసి ప్రయాణం చేశానంటూ రాహుల్
తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల పనితీరు గొప్పగా ఉందన్నారు రాహుల్. ఇవేవీ మీడియాలో, టీవీలో రావని అన్నారు. పార్టీ కార్యకర్తల పనితీరును తాను స్వయంగా చూశానన్నారు. గతంలో తెలంగాణకు రావడం, సమావేశాలకు హాజరవడం.. తిరిగి వెళ్లిపోవడం.. ఇలా జరిగేది కానీ.. ఈసారి మాత్రం తాను కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొని ప్రజలతో కలిసి ప్రయాణం చేశామన్నారు. అన్ని వర్గాల ప్రజలను కలిశానని, అందరితో మాట్లాడానని చెప్పారు.
పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్..
భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రలో కొన్ని సన్నివేశాలు పార్టీ శ్రేణులను ఉత్తేజపరిశాయి.
– మహబూబ్‌నగర్‌లో రాహుల్ పాదయాత్రలో రాహుల్ వద్దకు కొంతమంది చిన్నారులు వచ్చారు. అయితే.. వారితో కలిసి రన్నింగ్ మొదలుపెట్టారు రాహుల్. పక్కనే ఉన్న రేవంత్ కూడా పరుగు అందుకున్నారు. అక్కడున్నవాళ్లు దీన్ని చూసి కేరింతలు కొట్టారు.
– భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క ఏర్పాటు చేయించిన బతుకమ్మ ప్రదర్శనను రాహుల్ గాంధీ ఆసక్తిగా తిలకించారు. ఆ తర్వాత మహిళలతో కలిసి లయబద్ధంగా అడుగులు కలుపుతూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ కోలాటం ఆడి అందరిని అబ్బుర పరిచారు.
– సంగారెడ్డి జిల్లాలో చేసిన యాత్రలో మహిళలు బోనాలతో రాహుల్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోతురాజుల నుంచి కొరడా తీసుకున్న రాహుల్ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి కొరడా ఆడించి క్యాడర్‌లో జోష్ నింపారు.
– ముగులు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి గిరిజన మహిళలతో కలిసి రాహుల్ గిరిజన సంప్రదాయ నృత్యం చేశారు.
– మహిళలను ఆత్మీయంగా పలకరించారు. చిన్నారులను ఎత్తుకుని లాలించారు. వృద్ధులను ఆత్మీయంగా హత్తుకున్నారు.
రాహుల్‌ను దగ్గర నుంచి చూడడమే మహద్భాగ్యంగా భావించే కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు 12 రోజులు ఆయనతో కలిసి నడవడం, ఆయనను దగ్గరి నుంచి చూడడం, షేక్‌హ్యాండ్ ఇవ్వడం మాట్లాడడం లాంటి సన్నివేశాలతో క్యాడర్‌లో జోష్ నింపింది. అయితే ఈ ఉత్సాహం, ఐక్యత ఇలానే కొనసాగుతుందా.. కుక్క తోక వంకర చందంగా యాత్ర ముగిసింది కదా అని నాయకులు మళ్లీ ఎవరికి వారు యమునా తీరు అన్న చందంగా మారతారా అన్నది వేచి చూడాలి.