రాజద్రోహం కేసులో అరెస్ట్ అయ్యి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలైన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తొలి సారి మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం వివాదాస్పద వ్యాఖ్యలను మీడియాలో, సోషల్ మీడియాలో మాట్లాడవద్దని చెప్పిన దృష్ట్యా ఇన్నాళ్లు ఆయన మౌనంగా ఉండిపోయారు. బెయిల్ పొందాక తొలిసారి ఈరోజు మీడియాకు ఒక వీడియోను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘురామ ఆచితూచీ జాగ్రత్తగా మాట్లాడారు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వవద్దని.. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించడంతో కేవలం వీడియోలో తన బాసలు పంచుకున్నారు. తనకు ఈ కష్టకాలంలో అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇక జగన్ బెయిల్ రద్దు కేసులో తాజా పరిణామాలపై స్పందించారు. జగన్ ఇవాళ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన కౌంటర్ లోని అంశాలపై రఘురామ అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టులపై నమ్మకం ఉందని.. దేవుడు ఉన్నాడంటూ వేధాంత ధోరణిలో రఘురామ మాట్లాడడం విశేషం.
సుప్రీంకోర్టు బెయిల్ షరతులకు లోబడి ఏపీ సీఐడీ దాఖలు చేసిన కేసుకు సంబంధించి తాను మాట్లాడబోనని రఘురామ తెలిపారు. ఈ కేసులో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. కేసుపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని.. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని.. సాక్ష్యులను ప్రభావితం చేయరాదని సుప్రీంకోర్టు సూచించిందని రఘురామ తెలిపారు.
బెయిల్ రద్దుపై విచారణ మూడు సార్లు వాయిదా పడ్డాక జగన్ కౌంటర్ దాఖలు చేశారని.. నాపై ఏడు ఎఫ్ఐఆర్ లు ఉన్న వ్యక్తి ఈ పిటీషన్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించారని రఘురామ తెలిపారు. వారం రోజుల్లో తాను రీజాయిండర్ వేస్తానని.. న్యాయస్థానాలపై నమ్మకం ఉందని.. భగవంతుడి విశ్వాసం ఉందని రఘురామ తెలిపారు. నా పోరాటం ప్రజల కోసం.. మీకోసం.. ఇందులో నా వ్యక్తిగత స్వార్థం లేదని తెలిపారు.
ఇక తనపై కేసులపై కూడా ఎంపీ రఘురామ స్పందించారు. ఏపీ ప్రభుత్వం తన నియోజకవర్గంలో దాఖలు చేసిన ఏడు ఎఫ్ఐఆర్ లలో తాను దోషిగా నిరూపణ కాలేదని.. ఎఫ్ఐఆర్ దశలోనే ఉన్నాయని రఘురామకృష్ణంరాజు తెలిపారు. చార్జ్ షీట్ కూడా దాఖలు కాలేదన్నారు. దోషిగా నిర్ధారణ కాకముందే ఎఫ్ఐఆర్ వేసినంత మాత్రాన నేరస్థుడిని కాదన్నారు. తనపై కేసులేవీ ఇంకా నిరూపణ కాలేదని జగన్ కౌంటర్ లో ప్రస్తావించిన దానికి ఎన్ కౌంటర్ చేసేశాడు ఎంపీ రఘురామ.