పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నాయకుడు పుట్ట మధును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలోని భీమవరంలో శనివారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. సుమారు మూడు నెలల క్రితం న్యాయవాదులు వామనరావు దంపతులను నడిరోడ్డుపై దుండగులు హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం పుట్టమధును పోలీసులు విచారిస్తున్నారు.
రెండో రోజైన ఆదివారం కూడా విచారణ కొనసాగించారు. ఈ విచారణలో భాగంగా ప్రధానమైన విషయాన్ని ఆరాతీస్తున్నట్టు సమాచారం. వామనరావు దంపతుల హత్యకు రూ.2 కోట్లు సుపారీ ఇచ్చినట్టు సమాచారం. ఈ డబ్బులు ఎక్కడివి? ఎవరు ఇచ్చారు? అనే వివరాలు రాబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పుట్ట మధుతోపాటు ఆయన కుటుంబం, బంధువులు, స్నేహితుల బ్యాంకు ఖాతాల లావాదేవీలను పరిశీలించాలని నిర్ణయించారని సమాచారం. ఇందుకోసం ఆయా బ్యాంకుల మేనేజర్లకు పోలీసులు లేఖలు కూడా రాశారట. దీంతోపాటు పుట్టమధు మేనల్లుడు తులసిగారి శ్రీనివాస్ అలియాస్ బిట్టు శ్రీను కారు కొనడానికి డబ్బులు ఎవరిచ్చారు? మరో నిందితుడు కుంట శ్రీనివాస్ ఇంటి నిర్మాణానికి డబ్బులు ఎక్కడివి అనే వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నట్టు సమాచారం.
ఇక పుట్టమధు భార్య, మునిసిపల్ చైర్మన్ శైలజ ను కూడా పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. గతంలో బిట్టు శ్రీనును పోలీసులు కోర్టుకు తీసుకొచ్చినప్పుడు.. శైలజ తన ఫోన్ బిట్టు శ్రీనుకు ఇచ్చిందని, అతను ఎవరితోనో మాట్లాడాడని వార్తలు వచ్చాయి. పోలీసు విధులకు ఆటంకం కలిగించారని ఈ మేరకు కేసు కూడా నమోదైంది. శైలజ ఎవరితో మాట్లాడించిందనే విషయమై కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం.
ఇదిలాఉంటే.. ఈ కేసు విషయంలో స్థానిక పోలీసులు ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారనే ఆరోపణలు గతంలోనే వెల్లువెత్తాయి. కేసు నమోదు, విచారణలోనూ ఉదాసీన వైఖరి అవలంభించారనే ఆరోపణలు విపక్షాల నుంచి వచ్చాయి. అయితే.. తాజాగా ముత్తారం, మంథని, రామగిరి ఎస్ఐల బదిలీలు జరగ్గా.. ఆదివారం మంథని సీఐ మహేందర్ రెడ్డిన వరంగల్ కమిషనరేట్ కు అటాచ్ చేశారు ఐజీ. దీంతో.. వారిపై ఆరోపణలకు చేకూరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సోమవారం నాటికి దర్యాప్తు వేగంగా కొనసాగించి.. ఆధారాలు లభిస్తే మధును అరెస్టు కూడా చేస్తారని ప్రచారం సాగుతోంది. అయితే.. మధు మాత్రం ఈ హత్యలతో తనకు సంబంధం లేదని చెబుతున్నట్టు సమాచారం. మరి, ఈ కేసు విషయంలో ఏం జరుగుతుందన్నది చూడాలి.