Homeజాతీయ వార్తలుక‌రోనాపై మారిపోయిన ప్రజ‌ల ధోర‌ణి!

క‌రోనాపై మారిపోయిన ప్రజ‌ల ధోర‌ణి!

Coronavirus
సరిగా ఏడాది క్రితం కరోనాతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇంకా ఆ చేదు జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. ఆ బాధల నుంచి ఇంకా కోలుకున్నదీ లేదు. కానీ.. అప్పుడే దేశంలో సెకండ్‌ వేవ్‌ కనిపిస్తోంది. ఇండియాలో ఈ ఏడాది జ‌న‌వ‌రి–-ఫిబ్రవ‌రి నెల‌ల్లో సెకెండ్ వేవ్ బ‌లంగా ఉండ‌వచ్చని అంత‌కుముందే ఎక్స్‌పర్ట్స్‌ అంచ‌నా వేశారు. గ‌తేడాది సెప్టెంబ‌ర్ త‌ర్వాత దేశంలో క‌రోనా రోజువారీ నంబ‌ర్లు క్రమంగా తగ్గముఖం పట్టగా.. డిసెంబర్‌‌ నాటికి ప్రజలు కాస్త రిలాక్స్‌ అయ్యారు.

ఇక కరోనా తగ్గుముఖం పట్టిందని ప్రజలు కూడా పెళ్లిళ్లు, ఫంక్షన్లు జరిపించారు. వంద‌లు, వేలాది మంది అటెండ్ కావ‌డం రొటీన్ గా మారింది. కొంత‌మంది కాసేపు మాస్కులు ధ‌రించినా.. ఓవ‌రాల్‌గా ప్రజలు మాత్రం కరోనాను లైట్‌ తీసుకున్నారు. ఇక ఆ వైరస్‌కు భయపడడమే మానేశారు. ఇక ఆ త‌ర్వాత ప్రభుత్వాలు కూడా ప‌రిమితుల విష‌యంలో లైట్ తీసుకున్నాయి. వివిధ రాష్ట్రాల్లో అనేక ర‌కాల ఎన్నిక‌లు జ‌రిగాయి. కోర్టులు కూడా క‌రోనాను దృష్టిలో ఉంచుకుని ఎన్నిక‌ల‌ను ఆపండి అనే వాద‌న‌ల‌తో ఎవ‌రు వెళ్లినా లైట్‌ తీసుకొని ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి.

దీంతో ప్రజల్లో మరింత అజాగ్రత్త పెరిగింది. అందుకే.. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ ఎదుర్కోవాల్సి వస్తోందని అంటున్నారు. ఇప్పుడు కరోనాపై అటు ప్రభుత్వాలు కానీ.. ఇతర వ్యవస్థలు కానీ పెద్దగా పట్టించుకోవడంలేదు. ఏదో నామమాత్రంగా జాగ్రత్తగా ఉండండి అంటూ ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ.. ప్రజ‌ల‌ను క‌రోనాకు దూరంగా ఉంచాలి అనే శ్రద్ధ, చిత్తశుద్ధి మాత్రం ఎవరికీ కనిపించడంలేదు.

ఇక క‌రోనా విష‌యంలో ఏడాదిగా ప్రజ‌ల ధోర‌ణి గ‌మ‌నిస్తే.. స‌రిగ్గా గ‌తేడాది ఈ స‌మ‌యానికి క‌రోనా ఒక విచిత్రంలా గోచ‌రించింది. భ‌య‌పెట్టింది. అదే స‌మ‌యంలో త‌మ‌కు క‌రోనా రాదు అనే ధోర‌ణితో కోట్లాది మంది భార‌తీయులు ఉన్నారు. ఎవ‌రికో రావొచ్చు కానీ, త‌మ‌కు రాదు అనేది ప్రతి ఒక్కరి కాన్ఫిడెన్స్‌. అయితే జూన్ నాటికి క‌రోనా భ‌యం మొద‌లైంది. భారీగా పెరుగుతున్న నంబ‌ర్లు, అన్నింటికీ మించి క‌రోనా సోకితే రోజుల త‌ర‌బ‌డి ఐసొలేష‌న్లో ఉండాల్సి వ‌స్తుంది. ప‌రామ‌ర్శించ‌డానికి కూడా ప‌క్క మ‌నిషి రాడు అనే భ‌యం.. క‌రోనా అంటే ఏమిటో అర్థమ‌య్యేలా చేసింది. అదే స‌మ‌యంలో దేశంలో క‌రోనా కార‌ణ మ‌రణాలు, యుక్త వ‌య‌సులో ఉన్న వారు కూడా ఆ మ‌హమ్మారి బారిన ప‌డి మ‌ర‌ణించ‌డం.. క‌ల‌వ‌ర‌పాటును రేపింది. దీంతో జాగ్రత్తలు తీసుకోవ‌డం మొద‌లైంది.

ఇలా క‌రోనా విష‌యంలో ప‌లు ర‌కాల వ్యూస్ మారుస్తూ ఒక ఏడాది గ‌డిచిపోయింది. ఇప్పుడు మ‌ళ్లీ నంబ‌ర్లు పెరుగుతున్నాయి. కానీ పెరుగుతున్న నంబ‌ర్లు ప్రజ‌ల‌ను ఇప్పుడు పెద్దగా భయపెట్టడం లేదనేది మాత్రం వాస్తవం. గ‌తేడాది జూలైలో ఇవే స్థాయి నంబ‌ర్లున్నాయి. అయితే అప్పుడు క‌రోనా సోకుతుంద‌న్నా, చికిత్స అన్నా ఇప్పుడు అంత భ‌యం లేదు. సోకినా చూసుకుందామ‌నే ధోర‌ణి ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. క‌రోనా అంటే ఏడెనిమిది నెల‌ల కింద‌ట ఉన్న భ‌యం ఇప్పుడు లేదు. ఇది మంచిదే కానీ, మ‌రీ అజాగ్రత్తగా వ్యవ‌హ‌రించ‌డం మాత్రం గొప్పదేమీ కాదు. ఇంకోవైపు వ్యాక్సిన్ పై ఇప్పుడు మ‌ళ్లీ న‌మ్మకం పెరుగుతోంది. వేయించుకుంటే ఒక ప‌నైపోతుంద‌నే ధోర‌ణిలో చాలా మంది క‌నిపిస్తున్నారు. కానీ.. సెకండ్‌ వేవ్‌లో పెరుగుతున్న కేసుల సంఖ్య చూస్తే మాత్రం అందరూ మరోసారి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version