పెద్దపల్లి జిల్లా మంథని వాస్తవ్యులు, హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు దంపతుల హత్యోదంతాన్ని హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. తమ కొడుకు, కోడలును పట్టపగలే హత్య చేసిన వారిని ఉరితీయాలని వామన్ రావు తండ్రి వరంగల్ ఐజీ నాగిరెడ్డికి లేఖ రాయడంతో ఈ వ్యవహారంపై సర్కారు మరింత దృష్టి సారించింది. సాక్షాత్తు న్యాయ శాఖ కార్యదర్శి హైకోర్టుకు లేఖ రాశారు. దీంతో కేసు విచారణ వేగవంతం చేసి నిందితులను పట్టుకునే ప్రయత్నంలో భాగంగా హత్యతో ప్రమేయం ఉన్న పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పై ఉచ్చు బిగుస్తోంది. వారం రోజులుగా అదృశ్యమైన పుట్ట మధు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలియడంతో ఆయన పాత్రపై విచారణ ముమ్మరం చేశారు.
పుట్ట మధు పాత్రపై అనుమానాలు?
వామన్ రావు దంపతుల హత్యలో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు పాత్ర ఉందనే అనుమానాలు వామన్ రావు తండ్రి కిషన్ రావు వ్యక్తం చేశారు. వామన్ రావు మంథనికి వచ్చే విషయం ఒక్క సర్పంచ్ రాజుకే తెలుసు అన్నారు. హత్య తరువాత సర్పంచ్ పరామర్శకు కూడా రాలేదని స్పష్టం చేశారు.
అసలేం జరిగింది?
గట్టు వామన్ రావు దంపతుల హత్య విషయంలో అసలేం జరిగింది. ఎందుకంత కిరాతకంగా నడిరోడ్డుపై చంపారు. దీనికి పాత కక్షలే కారణమా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. వామన్ రావు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలపై విచారణ వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే పుట్ట మధును అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
సంచలనం సృష్టించిన కేసు
గత ఫిబ్రవరిలో జరిగిన వామన్ రావు దంపతుల హత్య రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హైకోర్టు న్యాయవాదులను టార్గెట్ చేసి దారి కాసి కొడవళ్లతో నరికి చంపడం చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో న్యాయవాదుల ఆగ్రహ జ్వాలలు కూడా చెలరేగాయి. నిందితులను కఠినంగా శిక్షించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో హత్యోదంతంపై అందరూ సీరియస్ గా తీసుకుని నిందితులను అదుపులోకి తీసుకుని కేసు పురోగతి వేగవంతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.