Rahul Gandhi : రాహుల్‌ వదిలేసిన స్థానంలో ప్రియాంక.. కాంగ్రెస్‌ మాజీ నేత సంచలన వ్యాఖ్యలు!

Rahul Gandhi మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు రాజీవ్‌ చంద్రశేఖర్‌ కూడా కాంగ్రెస్‌ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ‘వంశపారంపర్యం రాజకీయానికి ఆ పార్టీ మళ్లీ తెరలేపిందని విరుచుకుపడ్డారు

Written By: NARESH, Updated On : June 18, 2024 3:54 pm
Follow us on

Rahul Gandhi : ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పోటీచేసిన రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు. దీంతో వయనాడ్‌(కేరళ), రాయ్‌బరేలీ(యూపీ) స్థానాల్లో ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై తాను ఎటూ తేల్చుకోలేకపోతున్నానంటూ ఇటీవల రాహుల్‌ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, తన నిర్ణయం రెండు నియోజకవర్గాల ప్రజలను సంతోషపరుస్తుందన్నారు. ఈ తరుణంలో వయనాడ్‌ స్థానాన్ని వదులుకుంటున్నట్లు రాహుల్‌ అధికారికంగా ప్రకటించారు. రాహుల్‌ రాజీనామాతో వయనాడ్‌లో జరిగే ఉప ఎన్నికల్లో ఆయన సోదరి ప్రియాంక బరిలో దిగడం ఖాయమైంది. ఈమేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ధ్రువీకరించారు.

స్థాయికి తగ్గది కాదు.. ప్రమోద్‌ కృష్ణం..
అయితే ఏఐసీసీ నిర్ణయంపై కేరళ కాంగ్రెస్‌ మాజీ నాయకుడు ప్రమోద్‌ కృష్ణం సంచలన వ్యాఖ్యలు చేశారు. వయనాడ్‌ నుంచి ప్రియాంకను బరిలో దించడం ఆమె స్థాయిని తగ్గించడమే అవుతుందని పేర్కొన్నారు. ఏఐసీసీ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ప్రియాంకను ఏఐసీసీ అధ్యక్షురాలిగా ప్రకటించాల్సి ఉందన్నారు. వయనాడ్‌ నుంచి అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం ద్వారా ప్రియాంకగాంధీ స్థాయిని కాంగ్రెస్‌ తగ్గించిందని ఆరోపించారు.

ఇంకా ప్రమోద్‌ కృష్ణం ఏమన్నాడంటే..
‘కాంగ్రెస్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి ప్రియాంకగాంధీ. ఆమెను కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా చేసి ఉండాల్సింది.. ఆమెకు ఉప ఎన్నికల్లో లోక్‌సభ టిక్కెట్టు ఇవ్వడం ద్వారా ప్రియాంక స్థాయిని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ హిందువులను విశ్వసిస్తే కాంగ్రెస్‌కు నమ్మకం లేదని, ప్రియాంక గాంధీని వయనాడ్‌ నుంచి పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్‌ ఒకటి నిరూపించింది. వేరే చోట నుంచి పోటీ చేయించారు’ అని వెల్లడించారు.

ఓటర్లును మోసం చేసింది..
మరోవైపు బీజేపీ నాయకులు కూడా కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ఎంతో నమ్మకంతో గెలిపించిన వయనాడ్‌ ఓటర్లను రాహుల్‌గాంధీ మోసం చేశారని ఆరోపించారు. వారిపై ‘రాజవంశం ప్రయోగానికి’ కాంగ్రెస్‌ సిద్ధమైందని విమర్శించారు. ప్రియాంక గాంధీని తన రాజకీయ యాత్ర ప్రారంభించడానికి దక్షిణ భారతదేశానికి పంపడం ద్వారా గాంధీ కుటుంబం కొడుకు, కుతూరు మధ్య వివక్ష చూపిందని షెహజాద్‌ పూనావాలా ఆరోపించారు. ‘కాంగ్రెస్‌ పార్టీ కాదు, కుటుంబాన్ని నడిపించే కంపెనీ అని నిరూపించబడింది, సోనియా గాంధీ రాజ్యసభ నుంచి ఎంపీగా ఉంటారు, రాహుల్‌ గాంధీ రాయ్‌బరేలీ స్థానంలో ఉంచుతారు. వయనాడ్‌ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అంటే కుటుంబం మొత్తం పార్లమెంట్‌లో ఉంటుంది’ అని ఆరోపించారు.

వంశ పారంపర్య రాజకీయాలు..
మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు రాజీవ్‌ చంద్రశేఖర్‌ కూడా కాంగ్రెస్‌ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ‘వంశపారంపర్యం రాజకీయానికి ఆ పార్టీ మళ్లీ తెరలేపిందని విరుచుకుపడ్డారు. వయనాడ్‌ ఓటర్లపై తమ రాజవంశానికి చెందిన నేతలు ఒకరి తర్వాత మరొకరిని రుద్దడం సిగ్గుచేటన్నారు.