Priyanka Gandhi: దేశంలోని అతిపెద్ద స్టేట్లలో ఉత్తరప్రదేశ్ మొదటిది. అందుకే అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ విజయం సాధించాలని భావిస్తాయి. ఇందులో భాగంగానే ఇక్కడ మెజార్టీ స్థానాలు దక్కించుకుంటే దేశంలో అధికారం ఖాయమని తెలుస్తోంది. దీంతో అన్ని పార్టీలు ఇక్కడ తమ ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తున్నాయి. బీజేపీ రెండు సార్లు ఇక్కడ ఎక్కువ సీట్లు గెలుచుకుని కేంద్రంలో అధికార పీఠం చేజిక్కించుకుంది. దీంతో ఈసారి కూడా ఇక్కడ నుంచే ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని అన్ని పార్టీలు యోచిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ సారధ్యంలో యూపీలో పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇన్నాళ్లు అధికారానికి దూరమై ప్రజల్లో స్థానం కోల్పోతున్న క్రమంలో పూర్వ వైభవం కోసం తాపత్రయపడుతోంది. ఇప్పటికే 40 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తామని చెప్పిన సందర్భంలో మరో హామీ ఇచ్చారు. దీంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీతో పార్టీ పూర్వ వైభవం సాధిస్తుందని అందరు అంచనా వేస్తున్నారు.
పేదలకు ఉచిత వైద్యం పథకంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు సార్లు అధికారం చేపట్టిన నేపథ్యంలో ప్రస్తుతం యూపీలో కూడా ఆరోగ్యానికి పెద్దపీట వేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందజేస్తామని ప్రియాంక గాంధీ ప్రకటించినందున ఇప్పుడు అందరు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ యూపీలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ సర్కారుకు ముచ్చెమటలు పట్టేలా చేస్తోంది. వరుస పథకాలతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో బీజేపీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు అన్ని దారులు వెతుకుతోంది. పోయిన ప్రతిష్టను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రియాంక గాంధీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా యూపీలో అధికారం కోసం చేపట్టాల్సిన చర్యల గురించి ముమ్మర ప్రయత్నాలు సాగిస్తోంది.