Vizag Steel Plant: రాజకీయాలంటే కాసింత ముందుచూపు ఉండాలి. అందునా అశేష భారతావనిని తన చెప్పుచేతల్లోకి తెచ్చుకొని పాలిస్తున్న బీజేపీ విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి.కాషాయ దళంతో రాజకీయం చేయాలనుకుంటే అలెర్ట్ గా ఉండాలి. పరిస్థితిని స్టడీ చేయాలి. లేకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జరిగే పరిణామాలే ఉత్పన్నమవుతాయి. స్టీల్ ప్లాంట్ రాజకీయంలో అన్ని పార్టీలు బీజేపీ ట్రాప్ లో పడిపోయాయి. ఏ అధికారం లేని సహాయ మంత్రి ప్రకటనతో క్రెడిట్ మొత్తం కొట్టేయ్యాన్న ప్రయత్నంలో బీఆర్ఎస్ తో సహా అన్ని రాజకీయ పక్షాలు చతలికిలపడ్డాయి. అతి చేసి ప్రజల ముందు చులకనయ్యాయి.
ఆది నుంచి బీఆర్ఎస్ హడావుడి..
ప్లాంట్ ను పూర్తి సామర్ధ్యంతో నడిపేందుకు మూలధనం, ముడి సరుకు లేక స్టీల్ ప్లాంట్ సతమతవుతోంది. అందుకే తమకు మూలధనం, ముడిసరుకు అందించి అందుకు సరిపడా ఉక్కు ఉత్పత్తులను పొందే సంస్థల నుంచి స్టీల్ ప్లాంట్ బిడ్డులను ఆహ్వానించింది. మార్చి 27న ఈవోఐ జారీచేసింది. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఉక్కు ప్రైవేటీకరణకు ఇది తొలి అడుగు అని విమర్శిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అటు తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్టీల్ బిడ్ లో పాల్గొనాలని డిసైడ్ అయ్యారు. ఏపీలో బీఆర్ఎస్ ను విస్తరించాలన్న ప్రయత్నంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అటు తరువాత ఏపీ సీఎం జగన్ కూడా స్పందించాల్సి వచ్చింది. కేంద్రానికి లేఖ రాయడంతో పాటు అవసరమైతే అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర సహాయ మంత్రి ప్రకటనతో..
అటు బీఆర్ఎస్ విశాఖ ఉక్కును కార్నర్ చేసుకొని ఏపీలో ఎంట్రీ ఇవ్వాలన్న ప్రయత్నంలో ఉండగా ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు. ఈ సమయంలో ప్రైవేటీకరణ అంశం ప్రస్తావించగా అసహనం వ్యక్తం చేశారు. ఇవన్నీ ప్లాంట్ పరిరక్షణ చర్యలు తప్ప ప్రైవేటీకరణ కోసం కాదని అర్ధం వచ్చేలా మాట్లాడారు. దీంతో ఇక ప్రైవేటీకరణ అంశం ఆగిపోయిందని అంతా భావించారు. బీఆర్ఎస్ అయితే సంబరాలు చేసుకుంది. మొత్తం క్రెడిట్ దక్కించుకొని విశాఖలో విజయోత్సవ సభ ఏర్పాటుచేయడానికి కూడా డిసైడయ్యింది. అయితే ఇంతలో కేంద్ర ఉక్కు శాఖ స్పష్టతనిచ్చింది. ప్రైవేటీకరణకే తాము మొగ్గుచూపుతున్నామని.. వంద శాతం కేంద్ర ప్రభుత్వ వాటాలను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. దీంతో బీజేపీ కొట్టిన దెబ్బతో బీఆర్ఎస్ విలవిల్లాడుతోంది.
అన్ని పార్టీలకు ఝలక్..
బీఆర్ఎస్ మాత్రమే కాదు.. అన్ని పార్టీలకు గట్టి ఝలక్ తగిలింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకపోయినా.. ప్రస్తుతానికి ఆపేశారని అనుకున్న రాజకీయ పార్టీలు తమ పోరాటాల వల్లేనని చెప్పుకోవడం ప్రారంభించాయి. తెలుగుదేశం పార్టీ నేతలు తమ నేత పల్లా శ్రీనివాసరావు ఆమరణదీక్ష చేశారని గుర్తు చేశారు. జీవీఎల్ నరసింహారావు ఉన్న పళంగా ఢిల్లీ నుంచి విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఆ క్రెడిట్ తమకే దక్కాలన్నట్లుగా వ్యవహరించారు. ఇక వైసీపీ నేతలు.. ఇటీవల సీఎం జగన్ డిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో ఈ విషయంపై మాట్లాడారని అందుకే వెనక్కి తగ్గారని ప్రచారం చేసుకున్నారు. చివరికి పవన్ కల్యాణ్ కూడా స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆగిపోయిందన్నట్లుగా ట్వీట్ చేశారు. జనసేన పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు పవన్ పోరాటం ఫలించిందని చెప్పుకున్నారు. ఇలా అందరూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా గట్టిగా ప్రయత్నించామని ఎవరికి వారు ప్రచారం చేసుకున్నారు. చివరకు కేంద్ర ప్రభుత్వం కొట్టిన దెబ్బతో అందరూ చిన్నబోయారు.