PM Modi Visit Visakhapatnam: రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు. దానితో సమానమైన ప్యాకేజీ లేదు. విభజన హామీలు అంతకంటే అమలుకావడం లేదు. ప్రత్యేక రైల్వేజోన్ ఊసేలేదు. ఒకసారి ఇస్తామంటారు. మరోసారి సాధ్యం కాదంటారు. మరోసారి పరిగణలోకి తీసుకుంటామని చెబుతారు. కానీ దేనిపై స్పష్టత లేదు. మిగతా రాష్ట్రాల విషయంలో వేగంగా నిర్ణయాలు అమలుచేసే కేంద్ర ప్రభుత్వం ఏపీ విషయానికి వచ్చటప్పటికి నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోంది. అయితే ఇక్కడి రాజకీయ పరిస్థితులే కేంద్రంలో ధీమాకు కారణమని అందరికీ తెలిసిందే. అటు అధికార పక్షం వైసీపీ, ఇటు ప్రధాన విపక్షం టీడీపీ కేంద్రం ప్రాపకం కోసం ప్రయత్నిస్తుండడం, పోటీ పడుతుండడం కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి కారణం. అయితే కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోంది. విభజిత ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేదు. విభజనతో ఏర్పడిన సమస్యలు కొలిక్కి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఇతోధికంగా సాయం చేయాల్సింది పోయి.. ఉన్న విశాఖ ఉక్కులాంటి పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు సమంజసం.

అయితే రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ ఎంత అపవాదును మూటగట్టుకుందో.. విభజన హామీలు అమలుచేయకుండా జాప్యం చేస్తున్న బీజేపీ చర్యలను కూడా ఏపీ ప్రజలు తప్పుపడుతున్నారు. ఈ రాష్ట్రానికి అన్యాయం చేసే జాబితాలో బీజేపీ సైతం ఉంది. సుమారు తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రానికి మేలు జరిగే ఒక్క నిర్ణయమూ తీసుకోలేదు. తాను సాక్షిగా ఉండి.. స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానిని నిర్వీర్యం చేస్తుంటే పట్టించుకోలేదు. ఇస్తానన్న ప్రత్యేక హోదా మరిచిపోయారు. పోలవరానికి అతీగతీ లేదు. విభజన హామీల్లో భాగంగా ఇవ్వాల్సిన రైల్వేజోన్ ను ప్రకటించడం లేదు. పోనీ భవిష్యత్ ను అంధకారం చేస్తూ ఏపీని అప్పుల కుప్పగా మారుస్తున్న వైసీపీ సర్కారును కట్టడి చేస్తున్నారంటే అదీ లేదు. రాష్ట్ర భవిష్యత్ ను నాశనం చేస్తున్న జగన్ గవర్నమెంట్ కు తిరిగి రాజకీయ పరంగా చేయి అందిస్తున్నారు. అందుకే కాబోలు వాస్తవాన్ని గ్రహించి.. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం తన వ్యూహాన్ని మార్చుతున్నట్టు ప్రకటించారు.
విభజిత ఆంధ్రప్రదేశ్ లో దగాకు గురైన ప్రాంతమేదైనా ఉందంటే అది విశాఖపట్నమే. జగన్ సర్కారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించినా.. అందులో రాజకీయ మర్మమే ఉందే తప్ప వాస్తవికత లేదు. అదే జరిగితే ఈపాటికే పరిశ్రమలు వెల్లువలా తేవాలి. ఉన్న పరిశ్రమలను అభివృద్ధి చేయాలి. కేంద్రం వద్ద ఉన్న పరపతితో ప్రత్యేక రైల్వేజోన్ ప్రకటింపజేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను యథాతధంగా కొనసాగించాలి. కానీ అటువంటివేవీ కానరాడం లేదు. చంద్రబాబు నిర్మించిన అమరావతిలో తాను పాలన చేయడం ఏమిటి? అదే బిల్డింగులను నేను నిర్మించడం ఏమిటి? అన్న రీతిలో వ్యవహరించిన జగన్ కళ్లెదుట కనిపిస్తున్న విశాఖ నగరంలో క్యాపిటల్ పెట్టడానికి నిర్ణయించుకున్నారు తప్పితే.. ఈ ప్రాంతం మీద అభిమానమో.,. ప్రేమో కాదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

అయితే ఏపీ సర్కారుపరంగా, అటు కేంద్ర ప్రభుత్వ చర్యలతో దగాకు గురైన విశాఖ వాసులు అటు బీజేపీ, ఇటు వైసీపీ పై కోపం పెంచుకున్నారు. ఇటువంటి తరుణంలో నవంబరు 11న ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు రానున్నారు. రూ.400 కోట్ల రూపాయలతో విశాఖ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రధాని హాజరుకానున్నారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక రైల్వేజోన్ విషయంలో దగాకు గురైన విశాఖ వాసులు ప్రధాని మోదీని సాదరంగా ఆహ్వానించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రధాని మోదీ చెన్నై పర్యటన సమయంలో తమిళవాసులు తమ నిరసన గళాన్ని వినూత్న రూపంలో వ్యక్తపరిచారు. ఇప్పుడు అదే సీన్ విశాఖలో కూడా తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.