
Narendra Modi Birthday Special: భారత ప్రధానిగా ఆయనది తిరుగులేని ఘనత.. రాజకీయ నేతగా ఎదురులేని చరిష్మా. సైద్ధాంతిక విధానాలను కాసేపు పక్కన పెడితే.. వ్యక్తిగా ఆయన స్థాయి అద్వితీయం. ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. రాజకీయం వారసత్వపు హక్కుగా చలామణి అవుతున్న తరుణంలో చాయ్ వాలా కూడా ప్రధాని కావొచ్చని నిరూపించిన సామాన్యుడతను. తనవైన నిర్ణయాలతో దేశపు అత్యున్నత శిఖరానికి చేరిన అసామాన్యుడతను. ఆయనే.. నరేంద్ర మోడీ(Narendra Modi). ఇవాళ ఆయన పుట్టిన రోజు. నేటితో 71వ వసంతంలోకి అడుగుపెడుతున్న మోడీ జీవితాన్ని ఓ సారి పరిశీలిస్తే.. ఎన్నో ఆశ్చర్యపరిచే సంఘటనలు కనిపిస్తాయి.. అబ్బుర పరుస్తాయి.
చాయ్ దుకాణం నడిపే దామోదర్ దాస్ ముల్ చంద్ మోడీ – హీరాబెన్ మోడీ దంపతులకు 1950 సెప్టెంబర్ 17వ తేదీన జన్మించారు నరేంద్ర మోడీ. గుజరాత్ లోని వాద్ నగర్ లో ఒక పేదింట జన్మించిన బాలుడు.. రాజకీయ నాయకుడవుతాడని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధాని అవుతాడని ఎవ్వరూ ఊహించలేదు. అయితే.. అందుకు అవసరమైన సునిశిత దృష్టి, మేధాశక్తి మాత్రం చిన్న తనంలో కనిపించడం గమనించాల్సిన అంశం.

వాద్ నగర్ లోని బీఎన్ పాఠశాలలో మోడీ చదువుకున్నారు. చదువుకునే రోజుల్లోనే ఆయన తనలోని వ్యూహకర్తను ప్రపంచానికి పరిచయం చేశారు. ఓ సారి కబడ్డీ మ్యాచ్ లో తరచూ ఓడిపోతున్న జట్టుకు తనదైన వ్యూహాలతో విజయం అందించారు. ప్రత్యర్థి జట్టు బలాలు, బలహీనతలను అధ్యయనం చేసి, గెలుపు దక్కేలా చూశారు. తనలోని వ్యూహకర్త.. ఆయనతోపాటు పెరుగుతూ వచ్చాడు.
వాద్ నగర్ రైల్వే స్టేషన్ లో చాయ్ అమ్మే తన తండ్రికి మోడీ సాయం చేసేవారు. ఇదే విషయాన్ని ఎన్నికల్లో ఆయన ప్రధాన అస్త్రంగా మార్చుకోవడం అందరికీ తెలిసిందే. అయితే.. ఎదుగుతున్న వయసులో ఆయన కేవలం గుజరాత్ కు మాత్రమే పరిమితం కాలేదు. 17 సంవత్సరాల వయసులోని ఉత్తర భారత పర్యటనకు బయల్దేరారు. గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్, యూపీ, బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్, డార్జిలింగ్ వరకు పర్యటించారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లోని ఆల్మోరా లో రామకృష్ణ మఠంలో గడిపారు. దాదాపు మూడేళ్లపాటు ఉత్తరభారతంలోని ప్రధాన ప్రాంతాలను చుట్టేశారు.
ఈ పర్యటన తర్వాత మోడీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)లో చేరారు. మోడీ జీవితాన్ని మార్చిన ప్రధాన సందర్భం ఇదే. తన గురువు వకీల్ సాబ్ ద్వారా ఆర్ ఎస్ ఎస్ లో ప్రవేశించిన మోడీ.. తక్కువ కాలంలోనే సంఘ్ లో కీలకమైన వ్యక్తిగా ఎదిగారు. కీలక బాధ్యతలు స్వీకరించారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో సంఘ్ ప్రతినిధి దేశంలోని కీలక నాయకులను కలిశారు. ఈ విధంగా ముందుకు సాగిన మోడీ.. 1986లో బీజేపీ నాయకుడిగా మారారు. గుజరాత్ లో కీలక నాయకుడిగా అవతరించారు.

1995లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేందుకు కీలక పాత్రపోషించారు. దీంతో.. పార్టీ అధిష్టానం పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఇన్ ఛార్జ్ గా నియమించింది. అక్కడ కూడా తనదైన వ్యూహాలతో పార్టీని బలోపేతం చేశారు. ఆ విధంగా బీజేపీ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. భారతీయ జనతా పార్టీలో కీలక నాయకుడు అయ్యారు.
2001లో తొలి సారిగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు మోడీ. అప్పటి నుంచి 2014 వరకు సుదీర్ఘంగా గుజరాత్ సీఎంగా పనిచేశారు. మొత్తం నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పటి వరకు రెండు దఫాలుగా ఓడిపోయిన ఎన్డీఏకు మోడీ ఆశాదీపంగా కనిపించారు. దాంతో.. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. గుజరాత్ కు నాలుగు సార్లు సీఎంగా పనిచేసిన ఘనత.. పదేళ్లుగా అవినీతిలో కూరుకుపోయిన యూపీఏ చరిత కలిసి.. ఎన్డీఏకు ఊహించని విజయాన్ని కట్టబెట్టాయి. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, 370 ఆర్టికల్ రద్దు, పౌరసత్వ సవరణ, ట్రిపుల్ తలాక్ రద్దు వంటివి ఎన్నో ఉన్నాయి. దేశానికి ఎక్కువ కాలం సేవలందించిన కాంగ్రెసేతర ప్రధానిగా కూడా మోడీ రికార్డు సృష్టించారు. చాయ్ వాలాగా మొదలై.. దేశ ప్రధానిదాకా సాగిన నరేంద్ర మోడీ మరెన్నో అత్యున్నత శిఖరాలు అందుకోవాలని ఆశిస్తూ.. ‘‘ఓకే తెలుగు’’ తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.