Narendra Modi Birthday: తన పుట్టినరోజు అయినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్రాంతి తీసుకోలేదు. విధి నిర్వహణను పక్కన పెట్టలేదు. ఎప్పటిలాగే ఈసారి కూడా తన జన్మదినం సందర్భంగా ప్రజా సేవలోనే నిమగ్నమయ్యారు. తమ అభిమాన నాయకుడి పుట్టినరోజు కావడంతో బిజెపి నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాలలో అన్నదానం, వస్త్రదానం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. నరేంద్ర మోడీ మంగళవారం ఒడిశాలో పర్యటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు పథకాలను ఆయన ప్రారంభించారు. పేదల సొంత ఇంటి కారణం నిజం చేసేందుకు ప్రధానమంత్రి పీఎం ఆవాస్ యోజన పథకాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఇళ్లను నిర్మించింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా మరో 26 లక్షల గృహాలను కానుకగా ఇచ్చేందుకు మోడీ నిర్ణయించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో మోడీ ఈ మేరకు ప్రకటించారు. భువనేశ్వర్ లోను గడకానా మురికివాడలో నరేంద్ర మోడీ పర్యటించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఇళ్ల నిర్మాణం గురించి వారికి వివరించారు. ఇదే సందర్భంగా వారితో చాలాసేపు మాట్లాడారు.
మహిళలకు 10,000
మరోవైపు తన జన్మదినం సందర్భంగా నరేంద్ర మోడీ మరో స్కీమ్ కూడా ప్రారంభించారు. సుభద్ర యోజన పేరుతో ప్రతి సంవత్సరం కోటి మందికి పైగా పేద మహిళలకు 10,000 చొప్పున కేంద్రం ఆర్థిక సహాయం చేస్తుందని ఆయన ప్రకటించారు. ఈ సొమ్ము ప్రతి ఏడాది రెండు వాయిదాలలో మహిళల ఖాతాలో జమవుతుందని ఆయన వెల్లడించారు. భువనేశ్వర్ లోని జనతా మైదాన్ వేదికగా నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రకటించారు. ఒడిశా రాష్ట్రంలో ఎన్నికల సమయంలో మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని బిజెపి స్పష్టం చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా దీనిని ప్రకటించింది. సరిగ్గా నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించింది. పూరి జగన్నాథుడి సోదరుడు భద్ర పేరు మీద ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకాలు మాత్రమే కాకుండా 2,871 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, 1000 కోట్ల విలువైన హైవే ప్రాజెక్టు పనులను మోడీ ప్రారంభించారు. ప్రజాసేవ కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, దేశ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నరేంద్ర మోడీ ప్రకటించారు. విపక్షాలు ఆరోపణలు చేస్తున్నప్పటికీ.. తాము దేశ అభివృద్ధిని విస్మరించబోమని నరేంద్ర మోడీ అన్నారు. విపక్షాలు ఎన్ని రకాలుగా విమర్శించినా తమ అంతిమ ధ్యేయం దేశ శ్రేయస్సు మాత్రమేనని నరేంద్ర మోడీ ప్రకటించారు. కాగా, నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ప్రపంచ దేశాల అధినేతలు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.