ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య పది లక్షలు దాటేసింది. రెండు లక్షల మందికి నయమవ్వగా 53వేల మందికి పైగా మృతిచెందారు. భారత్ లో 2,088 కేసులు నమోదవ్వగా 156 మంది స్వస్థత పొందారు. 56 మంది మృతిచెందారు. భూమ్మీద దాదాపు అన్ని దేశాల్లో ఈ వైరస్ ప్రమాదకరంగా వ్యాపిస్తోంది. అమెరికా, స్పెయిన్, బ్రిటన్ లో మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరోనా బాధితుల్లో పావు వంతు అమెరికన్లే కావడం కలవరపెడుతోంది. అక్కడ మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే 6000కు పైగా మృతిచెందారు. నిన్న గురువారం ఒక్కరోజే 1100కి పైగా ప్రాణాలు కోల్పోయారు. వైట్ హౌస్ విశ్లేషకులైతే లక్ష నుంచి రెండున్నర లక్షల మంది అమెరికన్లు కరోనాకు బలవుతారని అంచనా వేస్తున్నారు. మృతదేహాల కోసం లక్ష సంచులు కావాలని అమెరికా విపత్తు స్పందన సంస్థ ‘ఫెమా’ ఆ దేశ సైన్యాన్ని కోరడం గమనార్హం. ఆ దేశంలో దాదాపు 85% మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. కరోనా ప్రజ్వలన కేంద్రమైన న్యూయార్క్ లో ప్రజలు మాస్క్ లు ధరించకుండా బయటకు రావొద్దని నగర మేయర్ బిల్ డి బ్లేసియో అభ్యర్థించారు. కొన్ని రోజుల వరకు మాస్క్ లు ధరించాలని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కోరారు.