దేశంలో ఇప్పటికే కరోనా వైరస్ హాట్ స్పాట్లుగా మారిన 20 ప్రాంతాలను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 22 ప్రాంతాలు కరోనా హాట్ స్పాట్లుగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అయితే దేశంలో ఎక్కడా కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ లేదని స్పష్టం చేసింది.
కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ఇంకా పెద్ద ఎత్తున సిబ్బంది, సౌకర్యాలు అవసరమని, ఆమేరకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పింది. వివిధ అవసరాల కోసం సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నామని వెల్లడించింది.
దేశంలో కరోనా వైరస్ కు హాట్ స్పాట్లుగా మారిన ప్రాంతాలకు ఫాస్ట్ ట్రాక్ కొవిడ్ టెస్ట్ కిట్లను అందజేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. వీటి ద్వారా కొన్ని చుక్కల రక్తంతోనే కరోనా వైరస్ కు దేహంలో యాంటీబాడీలు తయారయ్యాయా? అన్నదానిని బట్టి వైరస్ ఉందా? లేదా? అన్నది నిర్ధారించవచ్చు.
అరగంటలోపే రిజల్ట్ వచ్చే ఈ టెస్టులో కరోనాకు యాంటీబాడీలు దేహంలో ఉంటే అతడికి వైరస్ వచ్చి, తగ్గిపోయినట్లు తెలుస్తుంది. ఐసీఎంఆర్ నుంచి ఆమోదం లభించిన వెంటనే.. కరోనా కేసులు ఎక్కువున్నచోట్ల లేదా హాట్ స్పాట్లలో ఈ కిట్స్ ను ఉపయోగించనున్నారు.
భారత్ గతవారమే 5 లక్షల యాంటీబాడీ టెస్ట్ కిట్లను సేకరించింది. ఢిల్లీ నిజాముద్దీన్ ఏరియాలో యాంటీబాడీ టెస్టులకు ఐసీఎంఆర్ ఇదివరకే సిఫారసు చేసింది. యాంటీబాడీ టెస్టులో పాజిటివ్ వచ్చినవాళ్లనుంచి శాంపిళ్లు తీసుకుని మళ్లీ కొవిడ్ టెస్టు చేస్తారు. నెగెటివ్ వచ్చినవాళ్లను హోంక్వారంటైన్ లో ఉండాలని చెప్తారు.
కొవిడ్ రోగులలో 5 శాతం మందికే వెంటిలేటర్ల అవసరం ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ రోగులలో 80 శాతం మందికి స్వల్ప లక్షణాలు మాత్రమే కన్పిస్తాయని, 20 శాతం మందికి మాత్రమే సీరియస్ అవుతుందని ఆరోగ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.