Pranav Elango: ఈ రోజుల్లో విద్యార్థులు సెల్‌ఫోన్లు, వివిధ రకాల వ్యసానాలకు బానిసై లక్ష్యాన్ని మర్చిపోతున్నారు. బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఓ 17 ఏళ్ల బాలుడు.. చిన్నతనం నుంచి నిర్దేశించుకున్న లక్ష్యంవైపు దూసుకెళ్లాడు. తాను కన్న కలలను నిజం చేసుకున్నాడు. ఏకంగా అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో సీటు సాధించంతోపాటు రూ.3.55 కోట్ల స్కాలర్‌షిప్ సాధించాడు. దృఢ సంకల్పం, నిరంతర అభ్యాసం, సామాజిక దృష్టి కలిసినప్పుడు అవకాశాలు ఎలా కలిసివస్తాయో నిరూపించాడు. తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన ప్రణవ్ ఇలాంగో. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక బ్రౌన్ విశ్వవిద్యాలయంలో స్థానం సంపాదించడమే కాకుండా, అత్యధిక విలువైన ఆర్థిక సహాయాన్ని కూడా అందుకున్నాడు.
గణిత ప్రావీణ్యం నుంచి వ్యవహారిక అనువర్తనం వైపు..
చిన్ననాటి నుంచే సంఖ్యలపై ఉన్న ఆకర్షణ అతనికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చింది. ఐజీసీఎస్‌ఈ పరీక్షలో ప్రపంచ స్థాయి అగ్రస్థానం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకోసం ప్రణవ్ కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం కాలేదు. సాఫ్ట్‌వేర్, కృత్రిమ మేధస్సు, డేటా విశ్లేషణలపై ఆసక్తి పెంచుకున్నాడు. సిద్ధాంతాలను రోజువారీ సమస్యల పరిష్కారానికి అనుసంధానించే పరిజ్ఞానం పెంపొందించుకున్నాడు. ఈ విధానం అతని విద్యా ప్రయాణాన్ని మరింత బలోపేతం చేసింది.
నైపుణ్యాల విస్తరణ..
పాఠశాల విద్యతోపాటు, 13 ఏళ్ల వయసు నుంచే జాతీయ స్థాయి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని, మార్గదర్శకత్వం, నాయకత్వ లక్షణాలు, సమస్య పరిష్కార నైపుణ్యాలు పెంచుకున్నాడు. ఈ అనుభవాలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసే సమయంలో అతని ఆలోచనలకు స్పష్టతను అందించాయి. అకడమిక్ ప్రతిభతో పాటు వ్యక్తిగత లక్ష్యాలు, ఆసక్తులు స్పష్టంగా ఉండటం అతని ఎంపికలో కీలక పాత్ర పోషించాయి.
భవిష్యత్ లక్ష్యం..
బ్రౌన్‌లో చేరిన తర్వాత అనువర్తిత గణితంతోపాటు ప్రజారోగ్య రంగంపై దృష్టి సారించాలని ప్రణవ్ నిర్ణయించుకున్నాడు. గణాంక నమూనాలు, డేటా విశ్లేషణ ద్వారా వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ఆరోగ్య సమస్యలను గుర్తించి, సాంకేతిక పరిష్కారాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. హాంకాంగ్ విశ్వవిద్యాలయం నుంచి పూర్తి ఆర్థిక సహాయ ఆఫర్ వచ్చినా, తన ఆసక్తులకు, లక్ష్యాలకు సరిపోయే బ్రౌన్‌ను ఎంచుకోవడం అతని పక్వతను చూపిస్తుంది.
ప్రణవ్ ప్రయాణం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, కేవలం మార్కులు లేదా సీటు సంపాదించడం మాత్రమే కాదు. చదువును సమాజ ప్రయోజనంతో కలపడం, నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం, స్పష్టమైన లక్ష్యంతో నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం. ప్రణవ్ కథ యువతను కేవలం వ్యక్తిగత విజయాలకే పరిమితం చేయకుండా, విస్తృత ప్రభావం చూపే నాయకులుగా తీర్చిదిద్దుతుంది.