Telangana BJP : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై దృష్టిసారించిన బీజేపీ అధిష్టానం ఇటీవలే నాలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించింది. తాజాగా నాలుగు రాష్ట్రాల ఇన్‌చార్జీలను మార్చింది. తెలంగాణలో ప్రధాని పర్యటనకు ఒకరోజు ముందు ఇన్‌చార్జిగా తరుణ్‌చుగ్ స్థానంలో ప్రకాశ్ జావదేకర్‌ను ప్రకటించింది. సహ ఇన్‌చార్జిగా సునీల్ బన్సల్‌ను నియమించింది. తెలంగాణతోపాటు మరో మూడు రాష్ట్రాల ఇన్‌చార్జీలను కూడా బీజేపీ అధిష్టానం మార్చింది.
తెలంగాణపై ప్రత్యేక దృష్టి..
తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీ అధిష్ఠానం కీలక మార్పులు చేస్తోంది. తెలంగాణలో ఇటీవల బండి సంజయ్‌ను తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరగనున్న పలు రాష్ట్రాలకు పార్టీ ఎన్నికల ఇన్‌చార్జీలను నియమించింది. తెలంగాణకు ఎన్నికల ఇన్‌చార్జిగా కేంద్రమాజీ మంత్రి ప్రకాశ్ జావదేకర్‌ను నియమించింది. సునీల్ బన్సల్‌ను సహాయ ఇన్‌చార్జిగా ఉండనున్నారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఇన్‌చార్జిగా ఓపీ మాథుర్, రాజస్థాన్‌కు ప్రహ్లాద్ జోషీ, మధ్యప్రదేశ్‌కు భూపేంద్ర యాదవ్‌ను నియమించింది. ఈ నియామకాలను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేపట్టినట్లు భాజపా ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
‘ఈటల’తో కలుపుకుపోయేలా..
తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్న సమయంలో తరుణ్‌చుగ్ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. అధ్యక్షుడు మారిన నేపథ్యంలో ఇన్‌చార్జిని కూడా మార్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను బీజేపీ అధిష్టానం నియమించింది. ఆయన కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలను కోఆర్డినేట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అందరినీ కోఆర్డినేట్ చేసేలా ఇన్‌చార్జిని కూడా మార్చినట్లు తెలుస్తోంది. ప్రకాశ్‌జవదేకర్, సునీల్ బన్సల్‌తో ఈటలకు సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈ నియామకం చేసినట్లు సమాచారం.