Bandi Sanjay: ‘వరి వేస్తే ఉరే శరణ్యం… 60 లక్షల టన్నుల ధాన్యాన్ని మించి కొనేందుకు కేంద్రం సిద్ధంగా లేదంటూ’ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay kumar) తీవ్రంగా స్పందించారు. 60 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కేంద్రం కొనుగోలు చేస్తానంటే ఆ ఒప్పంద పత్రాలపై సంతకం చేసిన వ్యక్తి కేసీఆర్. అసలు ఆ పత్రాలపై సంతకం ఎందుకు పెట్టిండు? ఎంత పంట వస్తే అంత కొనాలని ఎందుకు చెప్పలేదు? రాష్ట్ర అవసరాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యాన్ని ఎందుకు కొనడం లేదు?’’అని బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా పోతంశెట్టి పల్లిలో జరిగిన సభలో వేలాది మంది ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. చత్తీష్ ఘడ్ మాజీ సీఎం రమణ్ సింగ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, ఎస్సీ, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, భాను ప్రకాశ్, పార్టీ నర్సాపూర్ ఇంఛార్జ్ సింగాయిపల్లి గోపి, మల్లారెడ్డి, సురేష్, జనార్దన్ రెడ్డి, సుధాకర్, రాజేందర్, రఘువీరారెడ్డి, మల్లేశం తదితరులు హాజరైన ఈ సమావేశంలో బండి సంజయ్ చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు…..
• నేనడుగుతున్న కేసీఆర్…..‘‘నువ్వు ఎందుకు ధాన్యం కొనవు. కొనడానికి నీకేం ఇబ్బంది? 60 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కేంద్రం కొనుగోలు చేస్తానంటే ఆ ఒప్పంద పత్రాలపై సంతకం చేసిన వ్యక్తి కేసీఆర్. అసలు నువ్వు ఎట్లా సంతకం పెట్టినవ్. ఎంత పంట వస్తే అంత కొనాలని ఎందుకు చెప్పలేదు? తెలంగాణ ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నవ్. కేంద్రం 60 లక్షల టన్నుల ధాన్యం కొంటే రాష్ట్ర ప్రజల అవసరాల కోసం కనీసం 20 లక్షల టన్నుల బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనడం లేదు. పెడితే పెళ్లి కోరతవ్…లేదంటే చావు కోరతవా.’ కేంద్రంతో ఎందుకు ఒప్పందం చేసుకున్నడో….పంట మొత్తం ఎందుకు కొనడం లేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి.
• చాముండేశ్వరి ఆశీస్సులు తీసుకుని ఈ జిల్లాలో అడుగు పెట్టిన. రేపు ఏడుపాయల వనదుర్గా మాత ఆశీస్సులు తీసుకున్న. దేశం కోసం, ధర్మం కోసం నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేసే పార్టీ బీజేపీ. నిన్నటి నుండి ఎక్కడికిపోయినా తండోపతండోలుగా తరలివస్తున్నరు. అన్నం పెట్టిన మెతుకు సీమ ఇది. కానీ అన్నం లేక నీళ్లు లేక అల్లాడుతుంటే చూడలేక పోతున్న.
• కోవిడ్ వస్తే సామాన్యులు అరిగోస పడుతుండ్రు. కనీసం జర్నలిస్టుల సంక్షేమాన్ని కూడా కేసీఆర్ పట్టించుకోలేదు. వాళ్లకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని మోసం చేసిండు. కోవిడ్ వస్తే కెమెరాలు భుజాన వేసుకుని ప్రాణాలకు తెగించి ప్రజల కష్టాలు ప్రపంచానికి చాటిన వాళ్లు జర్నలిస్టులు. చాలా మంది కోవిడ్ బారిన పడి చనిపోయారు. జీతాలు సరిగా లేకపోయినా ఓర్చుకుని పనిచేస్తున్నరు. అలాంటి వాళ్లకు కనీసం జర్నలిస్టులకైనా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని కోరుతున్న.
• ఇక కేసీఆర్ రైతులను మోసం చేసేందుకు రోజుకో మాట చెబుతుండు. మొన్ననేమో పత్తి వేయొద్దన్నడు. తర్వాత పత్తివేయమంటడు. నిన్న దొడ్డు వడ్లు వద్దంటడు. మళ్లీ సన్నవడ్లు పండించమంటడు. రోజుకో మాట చెబుతుండు. ఆయన మాత్రం దొడ్డు వడ్ల పండిస్తడట. రైతులు మాత్రం సన్న వడ్లు పండించాలట. మొన్నటికి మొన్న ప్రతి గింజ నేనే కొంటనని చెప్పిన కేసీఆర్ ఈ విషయంలో కేంద్రానికి సంబంధమే లేదని చెప్పిండు. ఈరోజు మాట మార్చిండు. ఈ ప్రాంతంలో వరి ఎక్కువ పండుతుందని తెలిసి కొనడం చేతగాక కేసీఆర్ కేంద్రంపై తప్పులు నెడుతుండు.
• కేంద్రం ముడిసరుకుల ధరల పెరిగినా సబ్సిడీలపై ఎరువులు ఇస్తోంది. సబ్సిడీలు ఎత్తేసి ప్రజలపై భారం మోపుతున్న ప్రభుత్వం టీఆర్ఎస్ దే. వర్షాలతో రైతులు నష్టపోయిండ్రు. ఏడేళ్లలో ఏనాడూ కేసీఆర్ ఆదుకోలేదు. ఆపదలో ఆదుకునే పార్టీ బీజేపీ. మీకోసం కొట్లాడే పార్టీ బీజేపీ.
• కేంద్రం 3 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 12 వేల ఇండ్లు మాత్రమే కట్టింది. గుడిసెల్లో పెంకుటిళ్లలో జనం బిక్కుబిక్కుమంటున్నరు. పురుగులు, పాములొస్తే వాటికి బలైతున్నరు. అయినా కేసీఆర్ కు చలనం లేదు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడం లేదు. ఇంటికో ఉద్యోగమని గాలికొదిలేసిండు. కనీసం నిరుద్యోగ భ్రుతి ఇవ్వలేదు. ఇది తెలంగాణ పరిస్థితి.
• హైదరాబాద్ లో ఆరేళ్ల పసిపాపపై హత్యాచారం జరిపిండ్రు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎస్సీ,బీసీ బడుగు వర్గాలపై దాడులు జరుగుతున్నయ్. పసిపాపలపైనా హత్యాచారాలు జరుగుతున్నయ్. హోం మంత్రి దద్దమ్మ మంత్రి. ప్రజలను కాపాడే వ్యక్తి కాదు. పసిపాపను హత్య చేసినందుకు నైతిక బాధ్యత వహించాలి. ఏమాత్రం సిగ్గున్నా హోంమంత్రితో రాజీనామా చేయించాలి. చేతగాని హోంమంత్రి మాకు అక్కర్లేదు. పేదలను కాపాడే హోంమంత్రి కావాలే తప్ప పాతబస్తీ గురించి మాట్లాడే మంత్రి మాకొద్దు.
• కేంద్రం రోడ్లు వేసినం. హిందువులే నడవడం లేదు. ముస్లింలు కూడా నడుస్తున్నరు. రేషన్ బియ్యం అందరికీ ఇస్తున్నం. టాయిలెట్ల నిర్మాణం అందరికీ ఇస్తున్నం. అన్ని పైసలు కేంద్రమే ఇస్తోంది. హరితహారంసహా రోడ్లు, నీళ్లు, రైతు వేదికలుసహా స్మశాన వాటికల డబ్బులన్నీ కేంద్రమే ఇస్తోంది.
• బీజేపీ ఏ వర్గాన్ని కించపర్చే పార్టీ కాదు. 15 నిమిషాలు సమయమిస్తే హిందువులను నరికి చంపుతామని మాట్లాడిన వారిని కేసీఆర్ పక్కనపెట్టుకుండు. హిందువులను కించపరిస్తే ఊరుకుందామా? ఊరుకునే ప్రసక్తే లేదు. అడ్డుకుని తీరతాం.
•తప్పుడు మాటలతో, మోసపు హామీలతో ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ యత్నిస్తున్నడు. కేసీఆర్ యాస, భాషకు మోసపోయి టీఆర్ఎస్ కు ఓటేసి నష్టపోయినం. ఇప్పుడు వాస్తవాలు తెలుసుకున్నం. కేసీఆర్ ను నమ్మం. మోదీకే ఓటేస్తామని చెబుతున్నరు. తెలంగాణ తల్లి ఆత్మ ఘోషిస్తోంది. ఈ మూర్ఖుడి చేతిలో బందీ అయ్యాను. కార్యకర్తలారా…ప్రజలారా…గడీలు బద్దలు కొట్టి నన్ను బంధ విముక్తి చేయమని తెలంగాణ తల్లి ఘోషిస్తోంది. అందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న. తెలంగాణలో కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకిలించి వేస్తం. 2023లో ప్రజల ఆశీస్సులతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది.
– కేసీఆర్ కౌంట్ డౌన్ అయ్యినట్లే : చత్తీస్ ఘడ్ మాజీ సీఎం రమణ్ సింగ్
చత్తీష్ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని అన్నారు. 2023లో తెలంగాణలో బీజేపీ దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారని, అవినీతి ప్రభుత్వం అంతం కావాల్సిన అవసరం ఉందన్నారు. 1400 మంది అమరులతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో అనుకున్నంత అభివృద్ధి చెందకపోవడానికి కారణం కేసీఆరేనని విమర్శించారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలు నెరవేర్చని సీఎం కేసీఆరేనని విమర్శించారు. రాష్ట్రంలో 1.35 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఉద్యోగాల్లేక యువత అల్లాడిపోతోందన్నారు. కనీసం నిరుద్యోగ భ్రుతి కూడా ఇవ్వడం లేదన్నారు. ‘తెలంగాణలో చీకటి పోతుంది…సూర్యుడు వస్తాడు… కమళం వికసిస్తుంది’అని వ్యాఖ్యానించారు. అందుకోసమే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారని, ఆయనకు ప్రజలంతా మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. నరేంద్రమోదీ దేశ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశాన్ని అభివ్రుద్ది బాటలో తీసుకెళుతున్నారని అన్నారు. నరేంద్రమోదీ ఆరేళ్లలో చేసిన అభివ్రుద్ది, సంక్షేమ పనులు కాంగ్రెస్ 60 ఏళ్లు పాలించినా చేయలేకపోయిందని చెప్పారు. ఈ దేశంలో ట్రిపుల్ తలాఖ్ చట్టాన్ని రద్దు చేసిన ఘనత మోదీదేనన్నారు.
– కేసీఆర్ కు ఏది పగలో రాత్రో అర్ధం కావడం లేదు : దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు
బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనంటు దామోదర రాజనర్సింహ చేసిన వ్యాఖ్యలపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. ‘‘అనవసర ఆరోపణలు మానుకోవాలని హెచ్చరిస్తున్నా. మీ భార్య బీజేపీలో జాయిన్ అయితే… రాత్రికి రాత్రే తీసుకెళ్ళావ్… మళ్లీ మా అక్క బీజేపీ లోకి వస్తుందేమో చూసుకో. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మూడూ కూడా ఒకతాను ముక్కలే. కాంగ్రెస్ బొమ్మ అయితే టీఆర్ఎస్ బొరుసులాంటిది.’’అని వ్యాఖ్యానించారు. ‘‘దుబ్బాకలో బీజేపీ గెలిస్తే…మోటార్ కు మీటర్లు వస్తాయని హరీష్ రావు అన్నాడు. ఈ 10 నెలల్లో ఒక్క మోటార్ కైనా మీటర్ వచ్చిందా అని హరీష్ రావును ప్రశ్నిస్తున్నా? సైదాబాద్ లో 6ఏళ్ల గిరిజన బాలికపై హత్యాచారం చేస్తే… మీ షీ టీమ్ లు ఏం చేస్తున్నాయి? నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరిపించలేదు? 70వేల పుస్తకాలు చదివితే…కేసీఆర్ కి ఏది పగలో…ఏది రాత్రో తెలియడంలేదు. మామ-అల్లుళ్ళ పొగరు వంచుదాం కార్ లో ఓవర్ లోడ్ అయింది… టైర్లు పగిలాయి. ఇప్పుడు మిగిలింది కమళమే. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే’’అని పేర్కొన్నారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Praja sankalpa yatra bandi sanjay counter on kcr comments
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com