గుడివాడ పర్యటన కీలక మార్పుగా కనిపిస్తుంది
అందరికీ తెలుసు, గుడివాడ నోటిదూల మంత్రి కొడాలి నాని ఖిలా అని. తన నోట్లో నోరు పెట్టటానికి అందరూ భయపడుతూ వుంటారు. చంద్రబాబు నాయుడుని టివిల్లో ఎప్పుడూ ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు. జగన్ మోహన్ రెడ్డి తెలివిగా కొడాలి నానిని చంద్రబాబు నాయుడుని దెబ్బతీయటానికి ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, కొడాలి నాని ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వారు కాబట్టి. అటువంటి కొడాలి నాని కోటలోకి వెళ్లి నానీ పరువుతీయటం చిన్న పనేమీ కాదు. నిన్న పవన్ కళ్యాణ్ ప్రదర్శన, నానిపై డైలాగులు తుపాకుల్లాగా పేలాయి. ప్రజలు అటువంటి దూకుడు ధోరణిని హర్షిస్తారు. ఇటీవల తెలంగాణాలో బండి సంజయ్ కెసిఆర్ పై ఇటువంటి దూకుడునే ప్రదర్శించటం ప్రజలు హర్షించారు. ఆంధ్రలో బిజెపిలో అటువంటి దూకుడుగల నాయకుడు లేడని అందరూ అనుకుంటున్నారు. బిజెపిలో లేకపోయినా దాని భాగస్వామి జనసేన నాయకుడు అదే దూకుడుని ప్రదర్శించటం ఆ లోటు తీరినట్లయ్యింది.
ఇది రెండు విధాలుగా ఉపయోగపడింది. జగన్ తరఫున హుందాతనం మరిచి మాట్లాడే నాయకులకు కొదవలేదు. కొడాలి నాని, అనిల్ కుమార్, రోజా, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కోకొల్లలు. వాళ్ళ ధాటికి తెలుగుదేశం తట్టుకోలేకపోతుంది. కొంతమంది దీటుగా సమాధానం ఇవ్వటానికి ప్రయత్నించినా గత ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు కావటంతో ఆత్మ రక్షణలో ఉండాల్సి వస్తుంది. అదీగాక ప్రజలు తెలుగుదేశాన్ని సీరియస్ గా తీసుకోవటంలేదనేది వాస్తవం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటన ఆ లోటుని తీర్చినట్లుగా కనబడుతుంది. ఏకంగా జగన్ కోటరీలో ముందుండి తిట్ల దండకం లంఘించుకొనే కొడాలి నానిని టార్గెట్ చేయటం చర్చనీయాంశం అయ్యింది. ఇదే ధోరణి ముందు ముందు కొనసాగిస్తే జగన్ వ్యతిరేక వర్గం పవన్ లో ఓ ఆశా కిరణాన్ని చూసే అవకాశం వుంది. అందుకనే గుడివాడ పర్యటన పవన్ కళ్యాణ్ కి రెండో దశగా అనిపిస్తుంది. మాట్లాడిన పధ్ధతి, హావభావాలు, జగన్ కి చేసిన హెచ్చరికలు ఓ సీరియస్ రాజకీయవేత్త జగన్ కి, చంద్రబాబుకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నాడా అని అనిపిస్తుంది. చివరగా పంట నష్టపోయిన రైతులకు 35 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పటం మంచి వ్యూహంగా కనిపిస్తుంది. ఇదే జనసేన-బిజెపిని మూడో ప్రత్యామ్నాయంగా ముందుకు తీసుకెళ్తుంది.
పవన్ కళ్యాణ్ చేయాల్సిందల్లా ఒక్కటే
ఇలానే క్రమం తప్పకుండా ప్రజాక్షేత్రంలో వుండటం. తను సినిమాలు చేసుకున్నా పర్వాలేదు. రాజకీయరంగాన్ని విడవకుండా ఇలానే ప్రధాన సమస్యలపై కదులుతూ వుంటే చాలు ఖచ్చితంగా ప్రజలు వెంట నడుస్తారు. ఎన్నికలకి ఇంకా మూడు సంవత్సరాలు వుంది. తన సినిమాల షూటింగులు మొదటి రెండు సంవత్సరాల లోపల పూర్తి చేసుకున్నా చివరి సంవత్సరం పూర్తికాలం రాజకీయరంగం మీదే కేంద్రీకరిస్తే మంచి ఫలితాలే వచ్చే అవకాశం వుంది. ఇప్పటికిప్పుడు 2024లో జనసేన-బిజెపి కూటమి అధికారం లోకి వస్తుందని చెప్పలేకపోయినా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. పవన్ కళ్యాణే స్వయంగా చెప్పినట్లు ముందుగా ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదు. జమిలీ ఎన్నికల చర్చ సీరియస్ గానే వినబడుతుంది. అధికారం సంగతి పక్కన పెడితే ముందుగా రాజకీయంగా నిలదొక్కుకోవటం ముఖ్యం. ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాలు ఇరు పార్టీల మధ్యనే కేంద్రీకృత మయ్యాయి. ఈ దిశను, దశను మార్చాల్సిన అవసరం వుంది. అది ఇప్పటినుంచే ప్రారంభం కావాల్సి వుంది.
చేయవలసిందల్లా ఒక్కటే . ప్రజాక్షేత్రంలో వుండటం. సమస్యలపై స్పందించటం. పరిస్థితులు వాటికవే సానుకూలంగా మారతాయి. ఆంధ్రా రాజకీయాలు కొన్ని ప్రత్యేక ఒరవడిలో కొనసాగుతుంటాయి. ఆవిధంగా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ నిలకడగా ప్రజాక్షేత్రంలో వుంటే చాలు. ప్రజల్లో ఒకసారి విశ్వాసం ఏర్పడితే చాలు పరిస్థితులు ఒక్కసారిగా మారుతాయి. ముందుగా తెలుగుదేశం స్థానంలో జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా జనసేన-బిజెపి కూటమి రావాలి. అప్పుడే రాజకీయాల్లో పెనుమార్పులు జరుగుతాయి. కాగలకార్యం గంధర్వులు చేసినట్లు తెలుగుదేశం బలహీనపడటం జగన్ మోహన్ రెడ్డినే చూసుకుంటాడు. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు జనసేన-బిజెపి కూటమి తయారుగా వుంటే చాలు. మిగతా రాజకీయాలు చక చకా జరిగిపోతాయి. చూద్దాం ఏమి జరగబోతుందో.