Opposition Meet- CM Jagan: రాష్ట్రపతి ఎన్నికలతో పాటు కీలక అంశాల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి సహకరిస్తానని జగన్ ముందుగానే ఒప్పందం చేసుకున్నారా? తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెట్టారా? సోనియా గాంధీనే ఎదిరించిన నేతగా ప్రాచుర్యం పొందిన ఆయన కేసులకు భయపడుతున్నారా? దాదాపు ఆయన ఎన్డీఏ ప్రభుత్వంలో చేరినట్టేనా? అంటే జరుగుతున్న పరిణామలు అవుననే సమాధానం చెబుతున్నారు. విపక్ష సీఎంలు, రాజకీయపక్షాల సమావేశానికి సీఎం జగన్ కు ఆహ్వానం అందకపోవడంతో అనుమానాలు నిజమేనని తేటతెల్లమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో వైసీపీ పొత్తు అంటూ పీకే కాంగ్రెస్‌తో కాస్త టచ్‌లో ఉన్నప్పుడు జరిగిన ప్రచారం ఇప్పుడు పూర్తిగా ఆగిపోయింది. అంతే కాదు విపక్షాలు మొత్తం వైసీపీని ఎన్డీఏ ఖాతాలో వేసేశాయి. విపక్షాల లెక్కలోకి అసలు తీసుకోవడం లేదు. కనీసం సంప్రదింపులకు కూడా పిలవడం లేదు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ సమాచారం పంపుతున్నారు కానీ.. జగన్ ను మాత్రం పట్టించుకోవడం లేదు.
బీజేపీయేతర సీఎంలకు ఆహ్వానం..
రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ జాతీయ సమావేశం ఏర్పాటుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 15న ఢిల్లీలో ఈ భేటీ జరుగుతుందని.. దానికి హాజరుకావాలని సోనియా సహా దేశంలోని వివిధ విపక్షాలకు చెందిన 22 మంది నేతలకు లేఖ రాశారు. ఢిల్లీ, కేరళ, తెలంగాణ, ఒడిసా, తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, పి.విజయన్, కేసీఆర్, నవీన్ పట్నాయక్, ఎంకే స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, హేమంత్ సోరెన్, భగవంత్ సింగ్ మాన్, ఆర్‌జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా, ఎన్‌సీపీ, సమాజ్‌వాదీ అధ్యక్షులు శరద్‌పవార్, అఖిలేశ్ యాదవ్, ఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడు జయంత్ చౌధురి, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ, ఆయన కుమారుడు-కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ నేతలు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్, ఎస్‌డీఎఫ్ అధినేత పవన్ చామ్లింగ్, ఐయూఎంఎల్ అధ్యక్షుడు ఖాదర్ మొహిదీన్ వీరిలో ఉన్నారు.చివరికి జాతీయరాజకీయాల విషయంలో ఆమడ దూరం ఉండే .. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌ను కూడా ఆహ్వానించారు దీదీ. కానీ జగన్ కు మాత్రం ఆహ్వానం పంపలేదు.
Also Read: Power Crisis In AP: ఏపీలో విద్యుత్ సంక్షోభం.. ఏ పూటది ఆ పూటే కొనుగోలు
ఆయనను బీజేపీ ముఖ్యమంత్రుల జాబిాతలోనే వేసినట్లుగా తేలిపోతోంది. ఈ విషయంలో వైసీపీ కూడాపెద్దగా పట్టించుకోవడం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క అడుగు వేయాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. పిలవకపోతేనే మంచిదని అనుకుంటోంది. తమపై బీజేపీ ముద్ర ఉండటం అడ్వాంటేజ్‌గా భావిస్తూండటంతో సమస్య రావడం లేదు.
అడ్వాంటేజ్ గా…
ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కూడా బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకోకపోయినా ఆ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న అభిప్రాయాన్ని కల్పించడం వైసీపీకి అవసరం . అందుకే వైసీపీ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం అధికార వైసీపీకి కలవరపాటుకు గురిచేస్తోంది. ఆ మూడు పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదని భావిస్తోంది. పొత్తు చిత్తు చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల రూపంలో అరుదైన అవకాశం వైసీపీకి వచ్చింది. బీజేపీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. మొత్తం పరిణామాలు చూస్తూంటే వైసీపీ ఎలాంటి షరతులు లేకుండానే బీజేపీ నిలబెట్టబోయే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతివ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read:Perni Nani vs Balashowry: బాలశౌరి, పేర్నినానిపై వైసీపీ హైకమాండ్ సీరియస్..అసలు జరిగిందేమిటి?