విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వంద శాతం ప్రైవేటీకరణ చేయాలని ఈ మధ్య కేంద్రం నిర్ణయం తీసుకుంది. కానీ.. రెండేళ్ల ముందే ఉక్కు పరిశ్రమ భూముల్ని విదేశీ కంపెనీలకు అప్పగించేందుకు సిద్ధమయింది. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. ముందుగా స్టీల్ ప్లాంట్‌కు ఉన్న వేలాది ఎకరాల స్థలంలో ఓ ఎనిమిది వందల ఎకరాలు దక్షిణ కొరియా ఉక్కు కార్పొరేట్ దిగ్గజం పోస్కోకు కేటాయిస్తారు. అందులో గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ నిర్మిస్తారు. పోస్కో, విశాఖ స్టీల్ ప్లాంట్ ఓనర్ అయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ మధ్య సంతకాలు జరిగాయి. పోస్కో- ఆర్‌ఐఎన్‌ఎల్ మధ్య ఒప్పంద విషయం ఏపీ సర్కార్‌కు కూడా తెలుసు. పోస్కో- విశాఖ స్టీల్ ప్లాంట్ మధ్య నాన్ బైండింగ్ ఒప్పందం 2019 అక్టోబర్‌లోనే జరిగింది. ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి జాయింట్ వర్కింగ్ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేశారు.
Also Read: తిరుపతి సీటు బీజేపీకా.? జనసేనకా? ‘పంచాయతీ’ తేల్చేసింది..
అయితే.. కొత్త ప్లాంట్‌లో పోస్కోకు యాభై శాతం వాటా ఉంటుంది. కానీ.. భూములు ఇస్తున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్‌కు ఎంత వాటా ఉంటుందో ఇంతవరకూ ప్రకటించలేదు. అధికారికంగా నిర్ణయం తీసుకున్నా.. ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించిన సమాధానంలో ఆ విషయం వెల్లడించలేదు. భూముల విలువ ఆధారంగా నిర్ణయించే తీసుకునే అవకాశం ఉంది. భూముల విలువ ఎంత లెక్క కట్టారనేది కూడా ప్రధాన అంశం. ఈ అంశంపై మూడుసార్లు పోస్కో- స్టీల్ ప్లాంట్ ప్రతినిధుల మధ్య సమావేశాలు కూడా జరిగాయి. జగన్‌ను 2019 జూన్‌లో పోస్కో సీఈవో బాంగ్ గిల్ హూ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కలిశారు. అప్పట్లో సీఎంవో కూడా అధికారికంగా ఫొటోలు కూడా విడుదల చేసింది. అప్పుడే జాతీయ, అంతర్జాతీయ బిజినెస్ మ్యాగజైన్లలో.. విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో పోస్కో ప్లాంట్ పెట్టడానికి సిద్ధమయిందని విస్తృతంగా ప్రచారం జరిగింది.
కానీ.. ఏపీలో మాత్రం కడప ఉక్కు కోసం జగన్ ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం చేశారు. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నట్లుగా ఇప్పుడు బయటకు వచ్చింది. మొదట స్టీల్ ప్లాంట్ భూముల్లో పోస్కోను ప్రవేశపెట్టి తర్వాత దానిని వారి పరం చేయడం చాలా సులభం అవుతుందని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ పోస్కో ప్లాంట్ ఉంటే.. మరో కంపెనీ కొనేందుకు ముందుకు రాదు. అసలు పోస్కోకు అప్పగించే ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదనను అంగీకరింపచేశారని అంటున్నారు. ఇప్పుడు ఆ ప్రణాళికలో ఏపీ సర్కార్ కూడా భాగస్వామి అని స్పష్టంగా తెలుస్తోంది.
Also Read: వారికి జీతాలు పెంచరట..! బిరుదులిస్తారంట..!!
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని సీఎం జగన్ మోహన్ రెడ్డి తనకు ఏమీ తెలియనట్లుగా ప్రధానమంత్రికి లేఖ రాశారు. అది మీడియా కోసం రాశారా.. నిజంగా ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లిందో కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పడుతున్న ప్రతీ అడుగు రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వయంగా.. ప్రత్యక్షంగా అందులో పాల్గొంటోంది. స్టీల్ ప్లాంట్ విషయంలో పోస్కో ప్రతినిధులు సీఎం జగన్‌ను కలిశారు. ఇదంతా రహస్య సమాచారం కాదని కేంద్రం చెబుతోంది. ఇప్పుడు ఈ విశాఖ ఎపిసోడ్ మొత్తం ఏపీ ప్రభుత్వం మెడకే చుట్టుకునే ప్రమాదమే కనిపిస్తోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్