
ప్రముఖ కమెడియన్, రచయిత, రాజకీయ నేత పోసాని కృష్ణమురళి ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడతారు. మనసులో ఏదీ దాచుకోకుండా ఉన్నదిఉన్నట్లుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. తాజాగా ఒక ప్రముఖ ఛానల్ పోసానిని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో పోసానిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేయాలని సదరు టీవీ ఛానల్ భావించింది. అయితే సదరు ఛానల్ ప్రశ్నలకు కుండ బద్దలుగొట్టినట్లుగా పోసాని సమాధానం ఇచ్చారు.
సదరు ఛానల్ యాంకర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే జగన్ కు వ్యతిరేకంగా పని చేశారని భావిస్తున్నారా…? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు పోసాని స్పందిస్తూ తనకు నిమ్మగడ్డ వ్యవహార శైలి ఏ మాత్రం నచ్చలేదని… ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ తో చర్చించకుండా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకోవడం సరికాదని చెప్పారు.
గతంలో ఏ అధికారి నిమ్మగడ్డలా ప్రవర్తించలేదని… ప్రభుత్వంతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోవడం రాజ్యాంగానికి వ్యతిరేకమేనని అన్నారు. జగన్ సర్కార్ పై కేంద్రంలో దురభిప్రాయం కలిగే విధంగా కేంద్రానికి లేఖ రాయాల్సిన అవసరం నిమ్మగడ్డకు ఎందుకుందని ప్రశ్నించారు. జగన్ సర్కార్ పై నిమ్మగడ్డ వాడిన భాష గురించి అధారాలు ఉన్నాయని తెలిపారు.
దేశ ఎన్నికల ప్రధాన అధికారి శేషన్ సిన్సియర్ ఆఫీసర్ కాబట్టే ఆయనపై చచ్చేంత వరకు విమర్శలు రాలేదని… నిమ్మగడ్డ రమేశ్ విషయంలో మాత్రం విమర్శలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఒక కులానికి చెందిన బీజేపీ నాయకులు ఫైవ్ స్టార్ హోటల్ లో నిమ్మగడ్డను కలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. నిమ్మగడ్డ వాళ్లతో ఏ విషయాల గురించి చర్చించారో బహిరంగంగా చెప్పాలని అన్నారు.