Posani Krishna Murali : పోసాని కృష్ణ మురళి( Posani Krishna Murali ) ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కులాలు, వర్గాలపై తాను గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు ముందు అంగీకరించారు పోసాని. పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ కుటుంబ సభ్యులను సైతం దూషించినట్లు పోసాని తెలిపిన విషయాన్ని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే అవి తానంతట తాను చేసిన వ్యాఖ్యలు కాదని.. తన వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని పోసాని వెల్లడించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని పోసాని కృష్ణ మురళి చెప్పడం గమనార్హం. సజ్జల రాసిచ్చిన స్క్రిప్ట్ మేరకే తాను విమర్శలు చేసినట్లు పోలీసు విచారణలో పోసాని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అదే ఇప్పుడు రిమాండ్ రిపోర్టులో కనిపిస్తోంది. పవన్ అభిమానులను రెచ్చగొట్టే ఉద్దేశంతోనే తాను మాట్లాడినట్లు కూడా పోసాని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
* వైసీపీకి గట్టి మద్దతు దారు
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి గట్టి మద్దతు దారుడుగా ఉండేవారు పోసాని కృష్ణ మురళి. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆయనకు లభించింది. అయితే అప్పట్లో పోసాని కృష్ణ మురళి మీడియా ముందుకు వచ్చి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. హైదరాబాదులోని ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి విమర్శలు చేసేవారు. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలకు దిగేవారు. అయితే ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉండేదని.. ఆయన సూచనల మేరకు మాత్రమే మీడియా సమావేశం ఏర్పాటు చేసే వాడినని తాజాగా పోలీస్ విచారణలో చెప్పుకొచ్చారు పోసాని కృష్ణ మురళి.
Also Read : పోసాని కృష్ణ మురళి కి బెయిల్ విషయంపై సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు..ఇది మామూలు ట్విస్ట్ కాదు!
* సజ్జల కుమారుడిది ఒక పాత్ర
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జిగా సజ్జల భార్గవరెడ్డి( sajjala Bhargava Reddy ) ఉండేవారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో పోసాని అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. వాటిని సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియాలో వైరల్ చేసిన విషయాన్ని కూడా పోసాని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోసాని కృష్ణ మురళి చెప్పిన విషయాలతో రిమాండ్ రిపోర్టును పోలీసులు శుక్రవారం రైల్వే కోడూరు కోర్టుకు సమర్పించారు. కొద్ది రోజుల కిందట ఏపీ పోలీసులు పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రైల్వే కోడూరు కోర్టులో హాజరు పరచగా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈనెల 12 వరకు పోసాని రిమాండ్ లోనే ఉండనున్నారు.
* రాజంపేట సబ్ జైలులో..
ప్రస్తుతం పోసాని కృష్ణ మురళి రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అదే సమయంలో పోసానిని ఐదు రోజులపాటు కస్టడీ ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు భార్గవ రెడ్డి పై ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా పోసాని కృష్ణ మురళి ఇచ్చిన వాంగ్మూలంతో ఆ ఇద్దరిపై కేసులు నమోదు చేసే పరిస్థితి ఉంది. అయితే ఈ కేసులో అరెస్టుల వరకు వెళ్తారా? లేకుంటే కొద్దిరోజులు ఆగుతారా? అన్నది తెలియాల్సి ఉంది.
Also Read : పోసాని కోసం రంగంలోకి జగన్.. తెర వెనుక వ్యూహం అదే!