Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళికి( Posani Krishna Murali ) అండగా నిలిచారు వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి. రెండు రోజుల కిందట పోసాని కృష్ణ మురళిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని పోసాని కృష్ణ మురళి ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అయితే ఆయన అరెస్ట్ అక్రమమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించారు. పోసాని కృష్ణ మురళి భార్యతో ఫోన్లో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అటు తరువాత పొన్నవోలు సుధాకర్ రెడ్డి నేతృత్వంలోని లీగల్ టీం ను పంపించారు. అయితే ఇంతకుముందు ఏ నేత అరెస్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇంతలా స్పందించలేదు. దీనికి కారణం ఏంటనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది.
Also Read: ఏపీ బడ్జెట్.. అందరికీ ఆరోగ్య బీమా.. రూ.25 లక్షల వైద్య సేవలు!
* బలమైన మద్దతు దారుడుగా
జగన్మోహన్ రెడ్డికి ( Jagan Mohan Reddy) పోసాని కృష్ణ మురళి బలమైన మద్దతు దారుడుగా నిలిచేవారు. 2014 నుంచి 2019 మధ్య జగన్మోహన్ రెడ్డికి ఫాలోవర్ గా ఉండేవారు. టాలీవుడ్ నుంచి జగన్ కు మద్దతు తెలిపే అతి కొద్దిమంది వ్యక్తుల్లో పోసాని కృష్ణ మురళి ఒకరు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారైనా.. చంద్రబాబుపై విరుచుకు పడడంలో ముందుండే వారు పోసాని కృష్ణ మురళి. అందుకే జగన్మోహన్ రెడ్డి సైతం చేరదీశారు. పార్టీలో సముచిత స్థానం కల్పించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకు ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. గత ఐదేళ్ల వైసిపి హయాంలో చంద్రబాబుతో పాటు పవన్ పై రెచ్చిపోయారు పోసాని కృష్ణ మురళి. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి పై ఉన్న అభిమానమే.
* రాజకీయాలకు దూరంగా పోసాని
అయితే ఎన్నికల ఫలితాల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీలోనే కొనసాగారు పోసాని కృష్ణ మురళి. అయితే వరుసగా వైయస్సార్ కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదవుతుండడంతో భయపడినట్టు కనిపించారు. అందుకే తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రకటించారు. ఇకనుంచి రాజకీయాలు మాట్లాడడానికి కూడా తేల్చేశారు. అయితే ఇప్పుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు తరువాత జగన్మోహన్ రెడ్డి శరవేగంగా స్పందించారు. పార్టీతో సంబంధం లేదని పోసాని కృష్ణమురళి తేల్చి చెప్పగా.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే కృష్ణ మురళి కోసం ప్రత్యేకంగా రంగంలోకి దిగడం మాత్రం చర్చకు దారితీసింది.
* విద్వేషం తగ్గించుకునేందుకే
అయితే జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణమురళి విషయంలో స్పందించడానికి ప్రధాన కారణం కమ్మ సామాజిక వర్గం( kamma caste ). అదే సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని వంశీ అరెస్టు సమయంలో జగన్ స్పందించలేదన్న విమర్శ ఉంది. రెండు రోజుల తర్వాత ఆయన జైలుకు వెళ్లి పరామర్శించారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి కమ్మ సామాజిక వర్గం దూరం అయ్యింది. అందుకే ఆ సామాజిక వర్గంలో తనపై ద్వేషాన్ని తగ్గించేందుకే పోసాని కృష్ణ మురళికి జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచినట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.
Also Read: కూటమిపై జ‘గన్’.. బడ్జెట్‌లో బ్రహ్మాస్త్రం ఇచ్చిన ఏపీ సర్కార్!